సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మారథాన్ ఇన్నింగ్స్ ఆడారు ప్రధాని మోదీ. 400 ప్లస్ స్థానాలే లక్ష్యంగా.. సుడిగాలిలా రాష్ట్రాలను చుట్టేశారు. 75 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక ర్యాలీలు నిర్వహించారు ప్రధాని మోదీ. బహిరంగ సభలు, రోడ్‌షోలతోపాటు వివిధ మీడియా సంస్థలకు 80 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 1న జరిగే చివరి విడత పోలింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను చుట్టేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి ఈ రెండున్నర నెలల్లో దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని.
ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. దీదీ ఇలాకా పశ్చిమ బెంగాల్‌లో రికార్డుస్థాయిలో 22 ర్యాలీల్లో పాల్గొన్నారు. బుధవారం కూడా ఆయన బెంగాల్‌లో ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని.. ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో 19 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు మోదీ. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిపైగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు ప్రధాని మోదీ. సౌత్‌లో బలం పెంచుకోవాలన్న లక్ష్యంతో.. ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే మోదీ సభలు పెంచింది.
ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో.. ఆ రాష్ట్రంపైనా బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. అక్కడ మోదీ 10 సభలు నిర్వహించారు. జగన్నాథ సన్నిధి పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్‌లో మోదీ 5 సభల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్‌లో 10, జర్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 4, హరియాణాలో 3 ర్యాలీలు నిర్వహించారు ప్రధాని. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రచారాల్లో పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనూ ఓసారి పర్యటించిన ప్రధాని.. పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. 2024 ఎలక్షన్ సీజన్‌లో తన చివరి ప్రచారాన్ని పంజాబ్‌లో నిర్వహించారు ప్రధాని మోదీ. హోషియార్‌పుర్ బహిరంగ సభతో సార్వత్రిక ప్రచార పర్వానికి ముగింపు పలికి.. ధ్యాన ముద్రలోకి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment