amnesty international india
-
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమ్నెస్టీపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు
న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఐపీఎల్), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్(ఐఏఐటీ) తదితర సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య చట్టం(ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమ్నెస్టీ ఇండియా, సంస్థ మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌లకు శుక్రవారం ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఈడీ ఆరోపణలపై ఆమ్నెస్టీ ఇండియా స్పందించింది. కఠిన చట్టాలతో విమర్శకులను అణచివేయడం ప్రస్తుత భారత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించింది. మనీల్యాండరింగ్ ఆరోపణల విషయం కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపింది. -
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు. #NEWS: Amnesty International India Halts Its Work On Upholding Human Rights In India Due To Reprisal From Government Of Indiahttps://t.co/W7IbP4CKDq — Amnesty India (@AIIndia) September 29, 2020 -
అలాంటి నిరసనలు మన దేశంలోనూ జరగాలి
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యకర్త ఆకార్ పటేల్‌పై బెంగుళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు దేశంలోని పలు నగరాలకు పాకాయి. ఈ నేపథ్యంలో పటేల్ అగ్రరాజ్యంలో చేపట్టిన అల్లర్ల వీడియోలను మే 31న ట్విటర్లో పోస్ట్ చేశారు. మన దేశంలోనూ మైనారిటీ ప్రజలు ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి మైనారిటీలు, వెనుకబడినవారు, పేదలు, మహిళలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (ఉద్యమ నినాదం.. 8.46) దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 505 (1) (బి) - ప్రజలను భయాందోళనకు గురి చేయడం లేదా ఏదేని విభాగానికి, వ్యక్తులకు లేదా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగేందుకు ప్రయత్నించడం, 153- అల్లర్లు జరిపేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, 117 - పదిమందిని లేదా ప్రజలను నేరానికి ఉసిగొల్పడం కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ఆకార్ పటేల్‌పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కింత అతనికి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ భావాలు వెల్లడించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టడం నేరమేమీ కాదన్నారు. కాగా ఆకార్ పటేల్ గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. (ఊపిరాడకుండా చేసి ఫ్లాయిడ్ హత్య) -
ట్రోలింగ్‌తో బరితెగింపు..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, బ్రిటన్లతో పోలిస్తే భారత మహిళా రాజకీయ నేతలే అధికంగా ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్‌లకు లక్ష్యంగా మారుతున్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ట్విటర్లో మహిళా నేతలకు ఎదురైన వేధింపులను పరిశీలించిన క్రమంలో ఈ వివరాలు వెల్లడించాయి. ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ సెక్రటేరియట్ 2019 మార్చి-మే మధ్య 95 మంది మహిళా రాజకీయ నేతలకు సంబంధించి వారిని ప్రస్తావిస్తూ సాగిన 1,14.716 ట్వీట్లను విశ్లేషించింది. ఈ ట్వీట్లలో ఏకంగా 13.8 శాతం ట్వీట్లు వేధింపులు, సమస్యాత్మక ధోరణిలో సాగాయని వెల్లడైంది. 2017లో 778 మంది మహిళా జర్నలిస్టులు, రాజకీయ నేతలు రిసీవ్ చేసుకున్న లక్షలాది ట్వీట్లను సాఫ్ట్వేర్ కంపెనీ ఎలిమెంట్ ఏఐతో కలిసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విశ్లేషించగా మహిళా నేతలకు పంపిన ట్వీట్లలో 7.1 శాతం ట్వీట్లు వారిని లక్ష్యంగా చేసుకుని వేధించేలా ఉన్నాయని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో మహిళా నేతలకు ఎదురువుతున్న ట్రోలింగ్‌తో పోలిస్తే భారత మహిళా నేతలకే ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్ అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. ఆమ్నెస్టీ నిర్వహించిన ఈ సర్వేలో ట్రోలింగ్‌కు గురైన 95 మంది భారత మహిళా నేతల్లో 44 మంది బీజేపీకి చెందిన వారు కాగా, 28 మంది కాంగ్రెస్, 23 మంది ఆప్, తృణమూల కాంగ్రెస్, అప్నాదళ్, ఏఐఏడీఎంకే, డీఎంకే వంటి పార్టీలకు చెందిన నేతలున్నారు. అయితే ట్రోలింగ్‌కు గురైన మహిళా నేతల పేర్లను మాత్రం ఆమ్నెస్టీ వెల్లడించలేదు. ఇక మహిళల్లోనూ ముస్లిం మహిళలు మితిమీరిన ట్రోలింగ్‌ను ఎదుర్కోగా, అణగారిన వర్గాలకు చెందిన మహిళలపై వారి కులాన్ని కించపరుస్తూ ట్రోలింగ్ సాగినట్టు గుర్తించారు. పార్టీలకు అతీతంగా మహిళా నేతలను ట్రోల్ చేస్తున్నారని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాలను సైతం ప్రస్తావిస్తూ ఆన్లైన్లో వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీకి చెందిన ఓ మహిళా నేత వాపోయారు. తమపై లైంగిక దాడులకు పాల్పడతామని బెదిరించడంతో పాటు తమ ప్రతిష్టను దిగజార్చేలా ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ హసిబా అమిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ అబ్యూజ్‌ను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని మహిళా నేతలతో పాటు పలువురు కోరుతున్నారు. చదవండి : విరుష్కలను ఆడేసుకుంటున్న నెటిజన్లు -
ఆమ్నెస్టీ కార్యాలయంపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బెంగళూరు, ఢిల్లీలోని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్యాలయాలపై శుక్రవారం దాడులు నిర్వహించింది. దాడులపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ సీబీఐ అధికారులు ఆరుగురు ఇవాళ ఉదయం 8.30 గంటలకు బెంగళూరు ఆమ్నెస్టీ కార్యాలయానికి చేరుకున్నారని, సాయంత్రం అయిదు గంటల వరకు సోదాలు కొనసాగించారని తెలిపారు. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారీ వేధింపులకు గురవుతున్నామని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంస్థ భారతీయ, అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొంది. గత ఏడాది కూడా విదేశీ మారకద్రవ్యాల ఉల్లంఘన (ఫెరా) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. 2010లో ఫారన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రద్దు కేసుతో ముడిపడి ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
62 శాతానికిపైగా అండర్ ట్రయల్సా?
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో అరెస్టయి బెయిలిచ్చేవారు లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్స్ ఖైదీలు భారత్‌లో ఎంతో మంది ఉన్నారు. జైళ్లలో ఊసలు లెక్కపెడుతున్న మొత్తం ఖైదీల్లో 62 శాతంకుపైగా ఖైదీలు వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఖైదీల్లో కూడా 53 శాతం మంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలేనని పేర్కొంది. మొత్తం దేశం జనాభాలో వీరు 39 శాతం ఉండగా, మొత్తం అండర్ ట్రయల్స్ ఖైదీల్లో వీరి శాతం 53 ఉండడం చాలా ఎక్కువని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. అండర్ ట్రయల్స్‌లో 29 శాతం మంది నిరక్షరాస్యులని, 42 శాతం మంది పదవ తరగతి కూడా పాస్‌కాని వారని పేర్కొంది. నేషనల్ క్రైమ్ బ్యూరో, దేశంలోని 500లకుపైగా జిల్లాలు, కేంద్ర కరాగారాలు, మూడువేలకుపైగా సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించినట్లు ఆమ్నెస్టీ ప్రకటించింది. చాలా సందర్భాల్లో పోలీసు ఎస్కార్టులు అందుబాటులో లేక విచారణ ఖైదీలను కోర్టుల్లో హాజరుపర్చక పోవడం మరీ దారుణమని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జైలు నుంచే ఖైదీలను హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని కూడా జైలు అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించింది. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య 82,334 సందర్భాల్లో పోలీసు ఎస్కార్టు లేదన్న కారణంగా ఖైదీలను కోర్టుల్లో హాజరపర్చలేదు. విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయ సలహా ఇచ్చేందుకు కూడా న్యాయవాదులు ఎవరూ జైళ్లను సందర్శించడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. జైలు అధికారులు న్యాయవాదులకు తగిన ఫీజులను చెల్లించక పోవడమే అందుకు కారణమని తెలిపింది. కొందరు న్యాయవాదులు జైలు అధికారుల నుంచి నయాపైసా రుసుం కూడా తీసుకోకుండా ఖైదీల తరఫున స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి వారి శాతం చాలా తక్కువ. విచారణలో ఉన్న ఖైదీలు తమ నేరం రుజువైతే పడే శిక్షాకాలంలో సగంకాలాన్ని జైల్లోనే గడిపితే వారిని చట్టంలోని 436ఏ నిబంధన కింద బెయిల్‌పై విడుదల చేయాలి. ఇలాంటి ఖైదీలను విడుదల చేయడం కన్నా అర్హతలేని ఖైదీలనే జైలు అధికారులు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. మరణశిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలను కూడా జైలు అధికారులు విడుదల చేస్తున్నారు. 436ఏ నిబంధన కింద వీరు విడుదలకు అనర్హులు. చట్టాల పట్ల సరైన అవగాహన లేకనో, అవినీతి కారణంగానో అధికారులు ఇలాంటి తప్పులు చేస్తున్నారు.