న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో అరెస్టయి బెయిలిచ్చేవారు లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్స్ ఖైదీలు భారత్‌లో ఎంతో మంది ఉన్నారు. జైళ్లలో ఊసలు లెక్కపెడుతున్న మొత్తం ఖైదీల్లో 62 శాతంకుపైగా ఖైదీలు వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఖైదీల్లో కూడా 53 శాతం మంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలేనని పేర్కొంది. మొత్తం దేశం జనాభాలో వీరు 39 శాతం ఉండగా, మొత్తం అండర్ ట్రయల్స్ ఖైదీల్లో వీరి శాతం 53 ఉండడం చాలా ఎక్కువని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. అండర్ ట్రయల్స్‌లో 29 శాతం మంది నిరక్షరాస్యులని, 42 శాతం మంది పదవ తరగతి కూడా పాస్‌కాని వారని పేర్కొంది.
నేషనల్ క్రైమ్ బ్యూరో, దేశంలోని 500లకుపైగా జిల్లాలు, కేంద్ర కరాగారాలు, మూడువేలకుపైగా సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించినట్లు ఆమ్నెస్టీ ప్రకటించింది. చాలా సందర్భాల్లో పోలీసు ఎస్కార్టులు అందుబాటులో లేక విచారణ ఖైదీలను కోర్టుల్లో హాజరుపర్చక పోవడం మరీ దారుణమని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జైలు నుంచే ఖైదీలను హాజరుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని కూడా జైలు అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించింది. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య 82,334 సందర్భాల్లో పోలీసు ఎస్కార్టు లేదన్న కారణంగా ఖైదీలను కోర్టుల్లో హాజరపర్చలేదు.
విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయ సలహా ఇచ్చేందుకు కూడా న్యాయవాదులు ఎవరూ జైళ్లను సందర్శించడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. జైలు అధికారులు న్యాయవాదులకు తగిన ఫీజులను చెల్లించక పోవడమే అందుకు కారణమని తెలిపింది. కొందరు న్యాయవాదులు జైలు అధికారుల నుంచి నయాపైసా రుసుం కూడా తీసుకోకుండా ఖైదీల తరఫున స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి వారి శాతం చాలా తక్కువ. విచారణలో ఉన్న ఖైదీలు తమ నేరం రుజువైతే పడే శిక్షాకాలంలో సగంకాలాన్ని జైల్లోనే గడిపితే వారిని చట్టంలోని 436ఏ నిబంధన కింద బెయిల్‌పై విడుదల చేయాలి. ఇలాంటి ఖైదీలను విడుదల చేయడం కన్నా అర్హతలేని ఖైదీలనే జైలు అధికారులు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. మరణశిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలను కూడా జైలు అధికారులు విడుదల చేస్తున్నారు. 436ఏ నిబంధన కింద వీరు విడుదలకు అనర్హులు. చట్టాల పట్ల సరైన అవగాహన లేకనో, అవినీతి కారణంగానో అధికారులు ఇలాంటి తప్పులు చేస్తున్నారు.
62 శాతానికిపైగా అండర్ ట్రయల్సా?
Published Thu, Jul 13 2017 5:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
Advertisement
Advertisement