కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మహిళా నేతల డిమాండ్..రోడ్డుపై భైఠాయింపు
అడ్డుకున్న పోలీసులు.. కొద్దిసేపు ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్/మణికొండ: మహిళలను కించపరిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. ఖబడ్దార్ కౌశిక్‌రెడ్డి అంటూ కల్వ సుజాతతోపాటు పలువురు మహిళా నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు.
ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భవన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా చీర, గాజులను చూపారని ధ్వజమెత్తారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కౌశిక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌశిక్ క్షమాపణ చెప్పకపోతే గవర్నర్‌ను, స్పీకర్‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
కౌశిక్‌రెడ్డి.. ఖబడ్దార్
కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లో తిరిగే పరిస్థితి ఉండదని ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్‌గౌడ్ హెచ్చరించారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి సంఘీభావం తెలిపేందుకు వారు తమ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి పిల్ల బచ్చా అని, తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని, వారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ యత్నిస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.
రాష్టం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేçశం, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ పాల్గొన్నారు.
కేసీఆర్ స్పందించాలి: అద్దంకి దయాకర్
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న కౌశిక్ మాట లు హాస్యాస్పదమని, ఈ మాటలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదేళ్లు అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడని, అప్పుడు ఆంధ్రోడని ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. సెంటిమెంట్‌ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు.
కౌశిక్ లాంటి కమెడియన్‌ను ఎందుకు ఎన్నుకున్నామా అని హుజూరాబాద్ ఓటర్లు ఫీలవుతున్నారని పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర.. తెలంగాణ లొల్లి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
కౌశిక్ ఆంధ్రోళ్ల పేరుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలను సమర్థించకపోతే కేసీఆర్ ఆయనను బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment