
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్‌లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్‌లు జూన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్‌ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు.