రంజిత్‌కు చెక్ అందజేస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/మద్దూరు(హుస్నాబాద్): దళంలో పుట్టిపెరిగిన రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ అనే మావోయిస్టు తాజాగా జనజీవనస్రవంతిలో కలిశాడు. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా ఉండి మృతి చెందిన రామన్న కుమారుడే రంజిత్. అతడు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వద్ద బుధవారం హైదరాబాద్‌లో లొంగిపోయాడు. రంజిత్ మావోయిస్టు దంపతులు సావిత్రి– రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్నలకు 1998లో దండకారణ్యంలో జన్మించాడు. ‘‘సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రామన్న 1982లో పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అక్కడే సావిత్రిని వివాహం చేసుకున్నాడు. సావిత్రి ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం డివిజనల్ కమిటీ మెంబర్‌గా ఉంది.
రంజిత్ దండకారణ్యంలోని జనతన సర్కారు పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లోని కాకతీయ స్కూల్‌లో శ్రీకాంత్ అని పేరు మార్చుకుని 10వ తరగతి వరకు చదివాడు. 2017లో తండ్రి ఆదేశాల మేరకు పార్టీలో చేరాడు. 2019లో రామన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం పార్టీలో రంజిత్‌కు అవమానాలు, వేధింపులు ఎక్కువకావడంతో తాళలేక పోలీసులకు లొంగిపోదామని తల్లి వద్ద ప్రతిపాదించగా ఆమె తిరస్కరించింది’’అని డీజీపీ వివరించారు.
రంజిత్‌కు సాయం
రంజిత్‌కు పునరావాసం కింద రూ.4 లక్షలు, తక్షణ ఆర్థిక అవసరాల కింద రూ.ఐదువేలను డీజీపీ అందజేశారు. కాగా, హరిభూషణ్ స్థానంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా దామోదర్ బాధ్యతలు తీసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు.
మాకు సంతోషంగా ఉంది...
‘మా తమ్ముడు రావుల రామన్న 12 ఏళ్లప్పుడు కుటుంబాన్ని వదిలి ఉద్యమంలోకి వెళ్లాడు. తర్వాత తిరిగి రాలేదు. 2019లో అనారోగ్యంతో బాధపడుతూ చనిసోయాడని పోలీసుల ద్వారా తెలిసింది. మా తమ్ముడికి కొడుకు రంజిత్ ఉన్నాడని పోలీసుల ద్వారానే తెలిసింది. అతడు ఉద్యమ బాటను విడిచి జనజీవితంలో కలవడం మాకు సంతోషంగా ఉంది.
–రావుల చంద్రయ్య (రావుల శ్రీనివాస్ అన్న)
Comments
Please login to add a commentAdd a comment