కిడ్నాప్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఘటన
ఆయనో ఐఏఎస్ అధికారి. తన కళ్లెదుటే భార్య విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆయన ఏమాత్రం కనికరం చూపించలేదు. ఆమె మృతదేహాన్ని సైతం ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ అధికారి నిరాకరించారు. ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీలో కమిషన్‌లో పని చేసే ఉన్నతాధికారి రంజిత్ కుమార్(తమిళనాడు). ఆయన భార్య సూర్య జై. తొమ్మిది నెలల నుంచి ఆమె కనిపించకుండా పోయారు. అయితే భార్య మిస్సింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించలేదు. పైగా విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. తాజాగా.. ఆమె ఓ కిడ్నాప్ కేసులో నిందితురాలు అని తేలింది. ఇంకో భారమైన విషయం ఏంటంటే.. ఓ గ్యాంగ్‌స్టర్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయారని తేలింది.
మహారాజ హైకోర్టు అనే గ్యాంగ్‌స్టర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సూర్య జై.. తొమ్మిది నెలల కిందట ఓరోజు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అయితే ఈ నెల 11వ తేదీన తమిళనాడు మధురై పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో సూర్య జైని నిందితురాలిగా చేర్చారు. మహారాజ, అతని అనుచరుడు సెంథిల్ కుమార్‌తో కలిసి మధురైకి చెందిన ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేసిందామె. పోలీసులు ఆ కుర్రాడిని రక్షించినా.. నిందితులు మాత్రం తప్పించుకున్నారు.
పరారీలో ఉన్న సూర్య జై సడన్‌గా గత శనివారం గాంధీనగర్‌లోని రంజిత్ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. తన తప్పు తెలుసుకున్నానని, విడాకులు వద్దంటూ, తనను రక్షించమని, కలిసి జీవిద్దామని భర్తను బతిమాలుకుంది. అయితే తన పరువు పోయిందంటూ ఆమె దూషిస్తూ.. ఇంట్లోకి అనుమతించలేదాయన. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడే విషం తాగి కుప్పకూలింది.
స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆదివారం ఆమె కన్నుమూసింది. విషయం తెలిసిన ఆయన ఆస్పత్రికి వెళ్లారే తప్ప.. భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. పని మనుషులతో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి వెళ్లిపోయారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ సారాంశాన్ని వివరించేందుకు మాత్రం నిరాకరించారు.
సీఎంకు సూర్య లేఖ!
అయితే మధురై బాలుడి కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదని ఆమె రాసిన లేఖ సోమవారం మధురై పోలీసులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. అందులో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన మదురైలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆ బాలుడి తల్లి మైథిలీ రాజలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో మదురై పోలీసులు రంగంలోకి దిగారు. తిరునల్వేలికి చెందిన మహారాజ్‌తో పాటు మరికొందరి ద్వారా ఈ కిడ్నాప్‌ను గుజరాత్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి రంజిత్ సతీమణి సూర్య ప్రమేయం కిడ్నాప్‌లో ఉన్నట్టుగా బాలుడి తల్లి ఆరోపించారు.
ఈ కేసును దర్యాప్తు చేపట్టిన మదురై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఐఏఎస్ అధికారి సతీమని సూర్య, ఆ బాలుడి తల్లి మైథిలీ మధ్య నగదు లావాదేవీల వివాదం ఉన్నట్లుగా వారు వాగ్మూలం ఇచ్చినట్టు వెలుగు చూసింది. అయితే.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, మైథిలీ రాజలక్ష్మి ఆరోపణల కారణంగా తన భర్తకు తీవ్ర తలవంపులు వచ్చినట్టు, ఈ వ్యవహారంలో సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ ఆమె రాసిన లేఖ సోమవారం మదురై పోలీసులకు చేరడం చర్చకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment