సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్స్ సంచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారంరోజుల క్రితమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. దీనితో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలు బయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థని మరో మారు మావోయిస్టులు టార్గెట్ చేసారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు చేస్తూ మాజీ మావోయిస్టులపై పోలీసులు కన్నేశారు. వారి కదలికలపై వారం నుంచి దృష్టి పెట్టారు. మావోయిస్టు టార్గెట్ లిస్ట్‌ల ఉన్న స్థానిక ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతానికి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీలో పర్యటించవద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడి పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పించిన పోలీసులు.. ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ వారికి మావోయిస్టులు తరస పడితే.. భారీ ఎన్‌కౌంటర్ జరిపేందుకు ప్రణాళిలు కూడా రచిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment