combing operation
-
కశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. బారాముల్లాలోని వాటర్‌గామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకొన్నారనే సమాచారంతో బుధవారం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని, తీవ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైందని అధికారవర్గాయి తెలిపాయి. కాల్పుల్లో మరణించిన తీవ్రవాదుల పేర్లు, వారు ఏ సంస్థకు చెందిన వారనే విషయాలను ఆరాతీస్తున్నారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు, మరో జవానుకు గాయాలయ్యాయని వెల్లడించారు. -
బోథ్ అడవుల్లో మావోయిస్టులు? పోలీసుల అలెర్ట్!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అడవుల్లో మావోయిస్టులు సంచరించినట్లు తెలుస్తోంది. 20 రోజుల క్రితం బోథ్ మండలంలోని కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం బోథ్ సీఐ నైలు నాయక్ ఆధ్వర్యంలో కైలాస్ టెకిడి అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ గుట్ట వద్ద గ్రెనేడ్ పడి ఉండడాన్ని పోలీసులు గమనించి వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. కైలాస్టెకిడి అటవీ ప్రాంతం ఆగస్టులోనే వచ్చారా..? కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ లభిచండంతో ఆ గ్రెనేడ్ నేలపై ఎన్ని రోజుల క్రితం పడిందని పోలీసులు లెక్కలేస్తున్నారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలోనే మావోల బ్యాగుల నుంచి ఇది నేల మీద పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చారా? లేక తిర్యాణి అడవుల్లో ఉన్నట్లు భావిస్తున్న అడెల్లు దళం వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడెల్లు స్వస్థలం బోథ్ మండలంలోని పొచ్చర కావడంతో అతనే వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జారి పడిందా? విడిచి వెళ్లారా? అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ మావోయిస్టుల బ్యాగులో నుండి జారి పడిందా? లేదా కావాలని విడిచి వెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దృష్టిని మరల్చడానికి విడిచివెళ్లారన్న వాదన వినిపిస్తున్నా పోలీసులు మాత్రం కచ్చితంగా మావోయిస్టుల వద్ద నుండే గ్రెనేడ్ కింద పడి ఉంటుందని పేర్కొంటున్నారు. వివరాలు వెల్లడించని పోలీసులు గ్రెనెడ్ లభ్యమైందని పోలీసులు అనధికారికంగా ధృవీకరించినా వివరాలు మాత్రం వెల్లడించలేదు. న్నతాధికారులే పూర్తి వివరాలు వెల్లడిస్తారని బోథ్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి గ్రెనేడ్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ప్రజాప్రతినిధులు అలర్ట్‌గా ఉండాలి ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బోథ్ అడవుల్లో గ్రెనేడ్ లభ్యం బోథ్ మండలం నిగిని గ్రామ సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో సీఐ నైలునాయక్ ఆధ్వర్యంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తుండగా భూమిపై పడి ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఉన్నతాధికారులకు పంపించారు. ఎలా వచ్చిందో విచారణ చేపడుతున్నారు. 15 నుంచి నెల రోజుల మధ్య అటవీ ప్రాతంలో పడి ఉన్నట్లు భావిస్తున్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో హైటెన్షన్.. కొనసాగుతున్న పోలీసుల వేట
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దీంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బోథ్ మండలంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కూంబింగ్‌లో మావోలకు సంబంధించిన గ్రెనేడ్ లభ్యమైంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం) -
విశాఖపట్నం: మావోయిస్టు అరెస్టు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావును శనివారం కూంబింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, రెండు మందుపాతరలు పేల్చిన ఘటనలు, రెండు కిడ్నాప్‌లు, ఐదు ఎదురుకాల్పుల ఘటనల్లో సుందరరావు నిందితుడని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కొండసువ్వాపల్లి గ్రామానికి చెందిన కొర్రా సింగ్రు రెండువేల సంవత్సరంలో రైతు కూలి సంఘంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ప్రస్తుతం పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో తిరుగుతూ పలునేరాల్లో పాల్గొన్నాడు. కొర్రాసింగ్రుపై ఏపీలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోను సుమారు 70కు పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు పట్టుబడిందిలా.. కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీలపై మందుపాతరను పేల్చి హతమార్చాలన్న లక్ష్యంతో కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావు, మరికొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులతో కలిసి కోరుకొండ ప్రాంతం నుంచి గాలికొండ ప్రాంతానికి మందుపాతరలు తీసుకువెళ్తూ పట్టుబడ్డాడు. సప్పర్ల జంక్షన్ వద్ద సంచితో ఉన్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతనితో వచ్చిన మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. అతని వద్ద సంచిలో కంట్రీమేడ్ పిస్టల్ ఒకటి, 7.65 ఎంఎం లైవ్‌రౌండ్స్ ఐదు, రెండు కిలోల లైవ్ మైన్‌తో ఉన్న స్టీల్ క్యారేజ్ ఒకటి, డిటోనేటర్లు రెండు, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్, 4 నిప్పో బ్యాటరీలు ఉన్నట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నాలుగు హత్య కేసుల్లో.. ►డిసెంబర్ 23, 2020న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ చింతగరువు గ్రామానికి చెందిన చిక్కుడు సత్యారావు అలియాస్ సతీష్‌ను పోలీసు ఇన్ఫార్మర్గా ముద్రవేసి హత్యకు పాల్పడ్డాడు. ►అక్టోబర్ 20, 2019న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ లండులు గ్రామానికి చెందిన కొర్రా రంగారావును చిట్రకాయల పుట్రువద్ద పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు. ►జూన్ 28, 2019న పెదబయలు మండలం, బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా సత్తిబాబును అర్ధరాత్రి ఇంటికి వెళ్లి చంపాడు. ►డిసెంబర్ 9, 2017న జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ మద్దిగరువు గ్రామానికి చెందిన కొలకాని సూర్యచంద్రబాబు, ముక్కాల కిషోర్‌లను మద్దిగరువు గ్రామ శివారులో హతమార్చాడు. చదవండి: మరణ మృదంగం! ఒక్కరోజులోనే 15 మంది మృతి.. కారణాలేవేర్వేరు! -
మన్యంలో మళ్లీ అలజడి
సాక్షి, ములుగు/మంగపేట: ములుగు జిల్లాలో వారం రోజుల్లో రెండోసారి అలజడి రేగింది. మంగపేట మండలం నర్సింహసాగర్ పరిధి ముసలమ్మగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం జరిగిన ఎదు రు కాల్పుల్లో మావోయిస్టు మణుగూరు ఏరియా దళ కమాండర్ సుధీర్ అలియస్ రాముతో పాటు ఒక దళ సభ్యుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. వారి వద్ద ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇతర వెపన్స్ లభించినట్లు చెప్పారు. ఇటీవల వెంకటాపురం(కె) మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మాడూరి భీమేశ్వరావు(48)ను మావోలు హతమార్చారు. తాజా ఎన్కౌంటర్ ఘటన మన్యంలో మళ్లీ అలజడి నెలకొంది. వరుస ఘటనలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్టలో మొదటి ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో మావోయిస్టులు శృతి, విద్యాసాగర్ హతం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఎన్కౌంటర్లు జరగలేదు. మధ్యమధ్యలో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా సరిహద్దులోని వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో పలు చోట్ల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. అయినా ఆ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఈనెల 10న జరిగిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు వెంకటాపురం(కె) మండలంలోని బోధాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, పురుగు మందుల వ్యాపారి భీమేశ్వర్‌రావును కత్తులతో పొడిచి చంపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కూంబింగ్ చేపట్టింది. ఈక్రమంలో తిప్పాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు చిన్నలక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు సోదాలు.. మావోయిస్టు మిలీషియా సభ్యుడు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు కేంద్ర బలగాలు నర్సింహసాగర్, కొప్పుగుట్ట, దోమెడలోని దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున అటవీలోకి ప్రవేశించిన పోలీసు బలగాలు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఎన్కౌంటర్లో మరికొంత మంది తప్పించుకున్నారనే సమాచారం మేరకు గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఏజెన్సీలో ఉలికిపాటు.. ఎన్కౌంటర్ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసులు ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట మండలాలతో పాటు పొరుగున ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం, పినపాక మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడపడుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
ఏజెన్సీలో ముమ్మర కూంబింగ్
పాచిపెంట: ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి గిరిజన గూడ బూట్ల చప్పుళ్లతో మార్మోగింది. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా వటాఫ్ ప్రాంతంలోని ముకుడుపల్లి, విశా ఖ ఏజెన్సీ పెదబయలు మండలంలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మండ లంలోని ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన బంగారుగు డ్డి, అడారుపాడు, కాట్రాగుడ్డి కుంతాం తదితర ప్రాంతాల్లో డేగ కన్నుతో జల్లెడ పడుతున్నాయి. అ టు వైపు నుంచి ఒడిశా పోలీసు బలగాలు కూడా కూ బింగ్‌లో నిమగ్నయయ్యాయి, మండల కేంద్రాలు ప్రధాన రోడ్డలో వాహనాల తనిఖీని విస్తృతం చేసి నట్లు ఎస్ఐ సీహెచ్. గంగరాజు తెలిపారు. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎన్‌కౌంటర్‌కు ప్లాన్
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్స్ సంచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారంరోజుల క్రితమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. దీనితో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివాసీలు బయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇన్ఫార్మర్ వ్యవస్థని మరో మారు మావోయిస్టులు టార్గెట్ చేసారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, పస్రా, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు చేస్తూ మాజీ మావోయిస్టులపై పోలీసులు కన్నేశారు. వారి కదలికలపై వారం నుంచి దృష్టి పెట్టారు. మావోయిస్టు టార్గెట్ లిస్ట్‌ల ఉన్న స్థానిక ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతానికి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీలో పర్యటించవద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడి పోలీస్ స్టేషన్లకు అదనపు భద్రత కల్పించిన పోలీసులు.. ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ వారికి మావోయిస్టులు తరస పడితే.. భారీ ఎన్కౌంటర్ జరిపేందుకు ప్రణాళిలు కూడా రచిస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. -
ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?
సాక్షి, రాయగడ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్లు సమాచారంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో జవాన్ల కూంబింగ్ ఉద్ధృతంగా సాగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో త్రిలోచనపూర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చగా...జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో కల్యాణ సింగుపురం ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ నాల్గవ బెటాలియన్, ముకుందపుర్ సీఆర్పీఎఫ్ బెటాలియన్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని భారీగా కూంబింగ్ చేపట్టారు. కాగా ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌మైన్ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు తరలించారు. -
ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి
చర్ల/మల్కన్‌గిరి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ– చింతల్నార్ పోలీస్ స్టేషన్ల సరిహద్దులోని బీమాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మాటువేసి ఉన్న మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో, పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. కాల్పుల అనంతరం మృతదేహాల వద్ద ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు .303 రైఫిళ్లు, ఒక బర్మార్ తుపాకీ, పేలుడు సామగ్రి,, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నలుగురిలో దుధి హిడ్మా, ఆయ్‌తే అనే ఇద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు కూడా ఉందని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని దక్షిణ బస్తర్ డీఐజీ సుందర్రాజ్ తెలిపారు. -
సరిహద్దుల్లో హై టెన్షన్
చింతూరు (రంపచోడవరం): ఇటీవల దండకారణ్యంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు భారీ సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది. దీంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగిన అనంతరం దంతెవాడ జిల్లా ఆరన్‌పూర్, సుక్మా జిల్లా సక్లేర్ వద్ద జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇదే సమయంలో ఆ రాష్ట్ర పోలీసులు పలువురు మావోయిస్టులను అరెస్టు చేశారు. దీంతో సేఫ్‌జోన్ కోసం మావోయిస్టులు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో మకాం వేసే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని సరిహద్దు పోలీస్స్టేషన్లను సందర్శించారు. సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని, నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకుని మావోయిస్టుల కదలికలను గుర్తించాలని ఆయన సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సరిహద్దుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. మావోయిస్టుల అడ్డుకట్టకు సరిహద్దుల్లో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు సమాచార వ్యవస్థను మెరుగు పరుచుకుని మావోయిస్టుల జాడ కనుగొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసేలా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా విలీన మండలాల్లో చర్ల, శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున సరిహద్దు గ్రామాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి వాహనాల తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలే టార్గెట్‌గా: కాగా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలో ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ ఎన్నికలను టార్గెట్ చేయవచ్చని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ప్రచారం నిమిత్తం సరిహద్దు మండలాలకు వచ్చే నేతలను టార్గెట్ చేసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా వుంది. ఇప్పటికే మావోయిస్టులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మంత్రితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. మరోవైపు మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ శాంబయ్య అలియాస్ ఆజాద్ భార్య సుజాతక్కను రెండ్రోజుల క్రితం పోలీసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. దీనికి నిరసనగా ఆజాద్ ఎన్నికల వేళ దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ ప్రహార్–4 పేరుతో పోలీసులు వరుస ఎన్కౌంటర్లు జరుపుతున్నారు. దీంతో దండకారణ్యం పరిధిలోని మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో ఓ వైపు పోలీసులు, తమ ఉనికిని చాటుకునేందుకు మరోవైపు మావోయిస్టులు వ్యూహాలు రచిస్తుండడంతో ఆదివాసీ పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. -
‘ముందస్తు’ అలర్ట్
సాక్షి, ఆసిఫాబాద్: ముందస్తు ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత పది రోజుల నుంచి జిల్లా సరిహద్దు ప్రాం తాలైన ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసులతోపాటు గ్రేహౌండ్స్, స్పె షల్ ప్రొటెక్షన్ పోర్స్ దళాలతోపాటు శిక్షణ కోసం వచ్చిన దళాలు రంగంలోకి దిగా యి. ఈ బలగాలు అటవీ ప్రాంతాలన్నింటి ని రోజు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఎవరైనా సంచరిస్తున్నారనే అనుమానంతో నిత్యం రాత్రింబగళ్లు గస్తీ కాస్తున్నాయి. జిల్లాకు సరిహద్దు గ్రామాలైన పెంచికల్‌పేట మండలం లోని నందిగాం, కమ్మర్గాం, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్, చింతలమానెపల్లి గూ డెం, ప్రాణహిత పరిసరాలు, వాంకిడి మండలం సర్కపల్లితోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతా లు, కెరమెరి అడవులు, తిర్యాణి మండలం మంగి, గుండాల తదితర ప్రాంతాలపై గట్టి నిఘా జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం తో సహా కాగజ్‌నగర్ పట్టణంలో తనిఖీలు ము మ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్‌తో రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేబీఎం కమిటీపై ప్రత్యేక దృష్టి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రెండు దళాలు చురకుగా పనిచేసేవి. అందులో ఒకటి ఇంద్రవెల్లి ఏరియా దళం, రెండోది మంగి ఏరియా దళం. అయితే కాలక్రమేణా మావోల ప్రబల్యం తగ్గిపోవడంతో ప్రస్తుతం ఇంద్రవెల్లి దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఎక్కడా ఉమ్మడి జిల్లా పరి«ధిలో ఈ దళాల సారధ్యంలో ఎటువంటి ఘటన జరగలేదు. ఇక రెండోది తిర్యాణి మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన మంగి ఏరియా కమిటీ. ఈ దళం కూడా పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. అయితే మావోయిస్టులు ప్రస్తుతం మంగి ఏరియా కమిటీ స్థానంలో కేబీఎం(కుమురంభీం, మంచిర్యాల) కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీకి ఇన్‌చార్జీగా మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, అలియాస్ నర్సన్న, అలియాస్ క్రాంతి పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. ఈయనతోపాటు బండి ప్రకాశ్ అలియాస్ బీపీ అలియాస్ ప్రభాకర్ అలియాస్ బండి దాదా ఈ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. వీరిద్దరూ సెంట్రల్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. వీరివురు ప్రస్తుతం చత్తీస్ గడ్‌లో దండకారణ్యంలో ఉన్నట్లు నిఘా వర్గాల అంచనా. మైలారపు అడెల్లు ‘దండకారాణ్యం స్పెషల్ జోన్ కమిటీ’ (డీకేఎస్జెడ్సీ)ని ఏర్పాటు చేసి కొత్తవారిని మావోయిస్టు పార్టీలోని నియమిస్తూ రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలపై తమ ప్రతాపం చూపాలని ఆరాటపడుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాక ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాల్లో జిల్లా నుంచి మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కేబీఎం కమిటీ పేర ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జిల్లా పోలీసు అప్రమత్తమైంది. గిరిజన యువత, ఆవాసాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఆవాసం నుంచి పోలీసులకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొత్తవారు ఎవరూ వచ్చిన తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అంతేకాక గతంలో జరిగిన సంఘటనలు, మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు ఇతర అంశాలతో ఓ కరపత్రికను విడుదల చేయనున్నారు. అంతేకాక గోడప్రతుల ద్వారా గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించారు. పది రోజులుగా కూంబింగ్ జిల్లా అటవీ ప్రాంతాల్లో సమీప పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్సై సహా అందరూ వివిధ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నారు. నక్సల్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతోపాటు జిల్లా స్పెషల్ బ్రాంచితో ఎప్పటికప్పుడు సమచారం సేకరణ పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో మినహా దాదాపు మండల అన్ని కేంద్రాల్లోనూ సెల్ ఫోన్ పనిచేసేలా నెట్వర్క్ ఉంది. ఆయా మండల పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత పది రోజులుగా నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్వోపీ)తో రోడ్లకు ఇరువైపు ఉన్న ప్రాంతాలను, కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబ్ డిస్పోజబుల్ పార్టీ కూడా పనిచేస్తోంది. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో తిర్యాణి మండలం దేవాపూర్ ప్రాంతంలో, మంగి మండలం పంగిడి మాదర ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డారు. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న గూడెం, అహెరి బ్రిడ్జి పనులు అడ్డగిస్తూ అక్కడ పొక్లెనర్లను, ఇతర వాహనాలు తగలబెట్టారు. అంతకు ముందు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 1న వాంకిడి మండలం సర్కపల్లి వద్ద పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆస్థాయిలో ఘటనలు ఎప్పుడు జరగలేదు. రాష్ట్రమేర్పడినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టుల ఉనికి పెద్దగా కనిపించలేదు. అయినప్పటి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్స్టేషన్లను గుర్తించారు. వామపక్ష ప్రభావం ఉన్న పోలింగ్స్టేషన్లు 58, వామపక్ష ప్రభావం ఉన్న ప్రాంతాలు 53 వరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి ఎన్నికల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. కూంబింగ్ కొనసాగుతోంది జిల్లాలో ముందస్తు ఎన్నికల సందర్భం గా ఎటువంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా గత పది రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాణహిత నది పరిసర ప్రాంతాలతోపాటు మంగి ఏరియాలో తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుస్తుగా భద్రతపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– మల్లారెడ్డి, ఎస్పీ -
ప్రెషర్ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు (ఐఈడీ) పేలి డీఆర్జీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్పీ మోహిత్ గార్గ్ కథనం ప్రకారం.. జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముగించుకొని బేస్ క్యాంపునకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరెడా గ్రామ సమీపంలో డీఆర్జీ జవాను కమ్లూ హేమ్లా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో తీవ్ర గాయాలైన హేమ్లా ను ముందుగా బేస్ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, అనంతరం బీజాపుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
ఏవోబీలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌తో గిరిజన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఓ వైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కిడారి హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు. ప్రత్యక బృందం (సిట్) అధికారి ఫకీరప్ప నేతృత్వంలో స్థానికులను విచారిస్తూ.. ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కిడారి డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. డీజీపీ ఠాకుర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి.. దర్యాప్తుపై వివరాలు సేకరించనున్నారు. కిడారి హత్య అనంతరం మావోయిస్టులు ఎటు వైపుకు వెళ్లారు.. హత్యలో స్థానికుల ప్రేమేయం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్యలో ఇప్పటికే పలువురు మావోయిస్టులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. -
కూంబింగ్ నిలిపివేయడంతోనే..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్ (ఏవోబీ) మావోయిస్టులకు సురక్షిత స్థావరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, అసలు ఇక్కడ మావోల సంచారమే లేదంటూ రాష్ట్ర హోం మంత్రి నుంచి కిందిస్థాయి పోలీసు అధికారులు ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అడపాదడపా చిన్న ఘటనలు జరిగినపుడు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మావోలు చేసిన పని అని పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. 2016 అక్టోబర్‌లో రామ్‌గుడా ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నాతో పాటు 32 మంది కీలక మావో నేతలు నేలకొరిగారు. ఆ తర్వాత కొంతకాలం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఇక మావోల జాడలేదని నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే గత ఏడాదిన్నరగా విశాఖ మన్యంలోనే కాదు.. ఏవోబీలోనే కూంబింగ్ ఆపరేషన్లు క్రమేపీ తగ్గించేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఎక్కడైనా ఒకరిద్దర్ని మావోలు మట్టుబెట్టినా, లేదా ఎక్కడైనా వాహనాలకు నిప్పుపెట్టినా ఒకటి రెండు పార్టీలతో గాలింపు చర్యలు చేపట్టడం.. ఆ తర్వాత మానివేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఏడాదిగా ఎలాంటి ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్స్ చేయలేదు. ఇదే మావోలకు కలిసొచ్చిందని చెబుతున్నారు. విశాఖలో ప్రత్యేక బలగాలు.. విశాఖలో గ్రేహౌండ్స్ దళాలు, ప్రత్యేక పోలీస్ బలగాలు ఉన్నాయి. పైగా 16వ ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఉంది. బెటాలియన్‌లో ఏ నుంచి హెచ్ వరకు కంపెనీకి 128 మంది చొప్పున ఎనిమిది కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలున్నాయి. అలాగే గ్రే హౌండ్స్‌లో 1ఏ,1బీ,1సీ,1డీ నుంచి 4ఏ,4బీ,4సీ,4డీ చొçప్పున యూనిట్‌కు 30 మంది చొప్పున 16 యూనిట్లు ఉన్నాయి. యాంటీనక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) కంపెనీ (128 మందితో) ఉంది. పాడేరులో ఏఎస్పీ, నర్సీపట్నంలో ఓఎస్డీ, విశాఖలో ఎస్పీ, ఏఎస్పీ (అడ్మిన్), ఏఎస్పీ (ఆపరేషన్), డీఐజీ, ఇంటిలిజెన్స్ ఎస్పీ, గ్రేహౌండ్స్ ఎస్పీ విశాఖ కేంద్రంగానే పనిచేస్తుంటారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు.. ఇన్ని బలగాలు ఉన్నా విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఇటీవల మావో అగ్రనేత చలపతి ఏవోబీలోనే ఉన్నాడని సమాచారం ఉందని పోలీసులు ప్రకటన కూడా చేశారు. అయినా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మావో అగ్రనేత కదిలికలు ఉన్నప్పుడు కూంబింగ్ ఆపరేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు పట్టపగలు సులువుగా హతమార్చారని చెబుతున్నారు. విశాఖ మన్యంలోనే కాదు ఏవోబీలో కూడా మావోల కదలికలులేవని, రామ్‌గుడ ఎన్కౌంటర్ తర్వాత మావోలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయారని హోంమంత్రి, కిందిస్థాయి పోలీసుల అధికారి వరకూ ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ప్రకటనలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన మావోలు.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వాడుకోలేదా? ఉరుములు, పిడుగులను ముందుగానే గుర్తిస్తాం. ప్రజలను అప్రమత్తం చేస్తాం. ప్రాణాపాయం నుంచి రక్షిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో కూర్చుని మన రాష్ట్రంలో ఎవరితోనైనా ముచ్చటిస్తారు. మారుమూల ప్రాంతాల్లోని జనం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వీధి దీపం వెలిగిందో లేదో ముఖ్యమంత్రి కోర్ డ్యాష్‌బోర్డులో వెంటనే తెలుసుకోవచ్చు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై సందర్భం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలవీ.. సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నామని ఊదరగొడుతున్న టీడీపీ ప్రభుత్వం 50 మంది సాయుధ మావోయిస్టుల కదలికలను ఏమాత్రం గుర్తించలేకపోయింది. శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టి తీసుకెళ్లి మట్టుబెట్టినా ప్రభుత్వానికి తెలియలేదు. అదేదో అత్యంత మారుమూల ప్రాంతమేమీ కాదు. మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జనసంచారం ఉన్నచోటే ఘాతుకం చోటుచేసుకుంది. మన్యంలో మావోయిస్టుల తాజా దుశ్చర్య వెనుక ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. తమ నాయకులను మావోయిస్టులు మట్టుబెట్టిన తీరును, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అరకు, పాడేరు ప్రాంత వాసులు తూర్పారపడుతున్నారు. సమాచారం అందినా నిర్లక్ష్యమేనా? అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని ప్రభుత్వం నిత్యం చెప్పుకుంటోంది. అయితే, విశాఖ మన్యంలో మావోయిస్టుల రాకను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పదేళ్ల కిందటే రాష్ట్రంలో తీవ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా ఒక శాటిలైట్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అడవుల్లో బృందాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? ఎంతెంతమంది తిరుగుతున్నారు? వారి వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయనేది ఆ నెట్వర్క్ ద్వారా గుర్తించి ప్రతిదాడులు నిర్వహించారు. ఈ టెక్నాలజీ ఆధారంగానే మావోయిస్టుల కదలికలను గుర్తించి, పలు ఎన్కౌంటర్లు చేశారు. ఇప్పుడు అంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. అరకు ప్రాంతంలోని దాదాపు అన్ని గిరిజన గూడేల్లో సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. పైగా గిరిజన ప్రాంతాలపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది. అయినా మావోయిస్టుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో పోలీసులకు, మావోయిస్టులకు నిత్యం అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయని, మూడు నెలలుగా అరకు కేంద్రంగా వారి కార్యకలాపాలు పెరిగాయని సమాచారమున్నా పోలీసు విభాగం పెడచెవిన పెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో పలువురికి నోటీసులు గుంటూరు : మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందిన నేపథ్యంలో గంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా గతంలో మావోయిస్టు షెల్టర్ జోన్లుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉన్న పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు అచ్చంపేట మండలంలో చేçపట్టనున్న పాదయాత్రను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ముగించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లోని కొకేర్‌నాగ్ వద్ద భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ భవనంలో దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా వారిపై ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలిన ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈద్ వేళ ఉగ్ర ఘాతుకం... -
పశ్చిమ ఏజెన్సీలో కూంబింగ్
జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమ ఏజెన్సీలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేగాక ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉందని ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క కేంద్రం ప్రకటన, మరోపక్క చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో కూడిన ఒక బృందం కూంబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక పోలవరం జాతీయ ప్రాజెక్టు కారణంగా ఇక్కడ ఇప్పటికే ప్రత్యేక బలగాలు మోహరించి పహారా కాస్తున్నాయి. ప్రాజెక్టు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ పోలీసు బలగాలను మరింత అప్రమత్తం చేశారు. అలాగే ఏజెన్సీ పోలీస్‌స్టేషన్‌లైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. చత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నాయి. చత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తల దాచుకునేందుకు తూర్పుగోదావరి మీదుగా గోదావరి దాటి పశ్చిమలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉండేది. మావోయిస్టులు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించకపోయినా షెల్టర్ జోన్‌గా వాడుకుని వెళ్ళిపోయే వారు. అయితే ఇతర నక్సలైట్ వర్గాలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడంతో పలు ఎన్కౌంటర్లు జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాను కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులలో గతంలో మావోయిస్టు కార్యకలాపాలు జరిగిన ఘటనల నేపథ్యం కూడా ఉంది. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ అటవీ ప్రాంతం అంతా పచ్చటి ఆకులతో దట్టంగా అలముకుని ఉంటుంది. దీంతో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోంది. -
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోల మృతి
మల్కన్‌గిరి: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా డోగ్రీఘాట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు ఐజీ ఎస్ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో కిట్ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. కొరాపుట్ జిల్లాలో 24 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. -
మావోయిస్టుల కోసం భారీగా పోలీసులు కూంబింగ్
ఆదిలాబాద్: జిల్లాలో మావోయిస్టుల సంచరిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులుకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో జిల్లాలోని కోతపల్లి, వేమనపల్లి, దేహగాం, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. అలాగే ప్రాణహిత నదీపరివాహక ప్రాంతంలో కూడా పోలీసులు వేట కొనసాగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి జిల్లాలోకి భారీగా మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు పోలీసులుకు వెల్లడించాయి. -
ముంబై ఐఐటీలో 'క్యాట్' వాక్
కష్టమైన ఎంట్రెన్స్ టెస్టులేవీ పాసవ్వకుండానే ఏకంగా ప్రతిష్ఠాత్మక ముంబై ఐఐటీలో అడుగుపెట్టి.. గుబులు రేపిందో ఓ చిరుత పులి. అక్కడివారిని గడగడలాడించిన అనుకోని అతిథి ఎట్టకేలకు తనంతట తానే వీడ్కోలు తీసుకుంది. నాలుగు రోజుల క్యాంపస్ విహరం అనంతరం తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయింది. దీంతో ఈ నాలుగు రోజులూ బిక్కుబిక్కుమంటూ గడిపిన ఐఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేనేజ్మెంట్ ఊపిరి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ చిరుత గత బుధవారం జనారణ్యంలోకి వచ్చింది. అక్కడా ఇక్కడా కాకుండా... ఏకంగా ఐఐటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. ఆహారం కోసం ఓ కుక్కను వేటాడుతూ సమీప అడవిలో నుంచి నేరుగా క్యాంపస్ ప్రాంగణంలోకి వచ్చేసింది. వచ్చిన అతిథిని చూసి క్యాంపస్ అంతా కలకలం రేగింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా భయంతో క్యాంపస్ లోని వారంతాప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. చిరుతను పట్టుకోవడానికి సంజయ్‌గాంధీ జాతీయ పార్కు, థానె అటవీ అధికారులను రంగంలోకి దింపారు. దాన్ని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించినా చిరుత దగ్గర ఆ పప్పులేమీ ఉడకలేదు. వారికి చిరుత ఆనవాళ్లు కూడా చిక్కలేదు. దాని కాలి గుర్తులు, అది తిరిగిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకపోయింది. 550 ఎకరాల విస్తారమైన ఐఐటీ క్యాంపస్‌లో దాదాపు నాలుగు రోజులపాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించి, దాగుడుమూతలు ఆడిన చిరుత ఎట్టకేలకు విన్న పాఠాలు చాలనుకుందేమో తన ఆవాసానికి వెళ్లిపోయింది. క్యాంపస్ మొత్తం అంజనం వేసి గాలించినా.. చిరుతపులి కనిపించకపోవడంతో అది అడవిలోకి వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు గాలింపును నిలిపివేసి బచ్ గయా అనుకున్నారు. మరోవైపు ఎలాంటి ఎంట్రెన్స్‌లు రాయకుండానే..‘క్యాట్’ పాసవ్వకుండానే ఐఐటీలో అడుగుపెట్టిన ‘క్యాట్’ (చిరుత)దేమీ భాగ్యమోనంటూ ట్విట్టర్లో హాస్యోక్తులు పేలాయి.