జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమ ఏజెన్సీలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేగాక ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉందని ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క కేంద్రం ప్రకటన, మరోపక్క చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో కూడిన ఒక బృందం కూంబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక పోలవరం జాతీయ ప్రాజెక్టు కారణంగా ఇక్కడ ఇప్పటికే ప్రత్యేక బలగాలు మోహరించి పహారా కాస్తున్నాయి. ప్రాజెక్టు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ పోలీసు బలగాలను మరింత అప్రమత్తం చేశారు. అలాగే ఏజెన్సీ పోలీస్‌స్టేషన్‌లైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. చత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నాయి. చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తల దాచుకునేందుకు తూర్పుగోదావరి మీదుగా గోదావరి దాటి పశ్చిమలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉండేది.
మావోయిస్టులు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించకపోయినా షెల్టర్ జోన్‌గా వాడుకుని వెళ్ళిపోయే వారు. అయితే ఇతర నక్సలైట్ వర్గాలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడంతో పలు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాను కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులలో గతంలో మావోయిస్టు కార్యకలాపాలు జరిగిన ఘటనల నేపథ్యం కూడా ఉంది. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ అటవీ ప్రాంతం అంతా పచ్చటి ఆకులతో దట్టంగా అలముకుని ఉంటుంది. దీంతో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment