Jangareddigudem
-
జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. బాబు సర్కార్‌పై ట్రాక్టర్ డ్రైవర్లు సీరియస్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరు కారణంగా ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు.ఇదే సమయంలో ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించాలంటూ ప్రభుత్వాన్ని డ్రైవర్లు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రహదారిని దిగ్బంధం చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డ్రైవర్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’ -
ప్రేమ వివాహం.. మరొకరితో వివాహేతర సంబంధం..
సాక్షి, జంగారెడ్డిగూడెం: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మనస్తాపంతో భార్య ఈగలమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎం.సాగర్‌బాబు తెలిపిన వివరాలు ప్రకారం ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌తో అదే గ్రామానికి చెందిన దేవి (20)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడు నెలల పాప ఉంది. బుధవారం ఉదయం సతీష్ కూలిపనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సతీష్ పనికి వెళ్లిపోయాడు. గొడవ నేపథ్యంలో మనస్తాపం చెందిన దేవి ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దేవి అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి సోదరి ఎ.పోలవరానికి చెందిన తమ్మిశెట్టి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు దేవి, బావమరిది సతీష్‌ది ప్రేమ వివాహమని, అయితే సతీష్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఇటీవల ఫోన్ విషయమై గొడవ జరిగి తన చెల్లెలిని కొట్టాడని, దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో పేర్కొంది. సతీష్ బలవంతంగా తన చెల్లితో మందు తాగించాడనే అనుమానం ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!) -
అంతులేని విషాదం.. కుటుంబం మొత్తం..
సాక్షి, జంగారెడ్డిగూడెం: కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఒక కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులంతా మృతిచెందడంతో హృదయవిదారకర పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా మృతిచెందిన ఘటన ఇది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన నూక ఉమామహేశ్వరరావు(35), ఆయన భార్య రేణుక(28), వారి పిల్లలు షర్మిల(9), దుర్గాప్రసాద్(8) ఈ ప్రమాదంలో మృతిచెందారు. బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఈ నలుగురు ఒకే మోటార్‌సైకిల్‌పై తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. మరో బైక్‌పై ఉమామహేశ్వరరావు తండ్రి నూక గణపతి, తల్లి లక్ష్మిలు వెళ్తున్నారు. కామవరపుకోట మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న కారు ఉమామహేశ్వరరావు కుటుంబం ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఉమామహేశ్వరరావు రేవతిలను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఏలూరు సమీపంలోకి వెళ్లే సరికి ఉమామహేశ్వరరావు పరిస్థితి విషమించడంతో వెంటనే ఏలూరు జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఉమామహేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన భార్య రేవతిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబం మొత్తం మృతిచెందడంతో ఉమామహేశ్వరరావు తల్లితండ్రులు గణపతి, లక్ష్మిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్జాపురంలో ఉమామహేశ్వరరావు భార్య రేవతి పేరున జగనన్న కాలనీ మంజూరైంది. ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం కుటుంబసభ్యులతో ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. నిర్మాణం ప్రారంభించకుండానే కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉమామహేశ్వరరావు సొంతింటి కల నెరవేరకుండానే కుటుంబం అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసుల అదుపులో కారు డ్రైవర్ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వేముల బాల గంగాధర్ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రమాదంలో గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదం సమయంలో కారులో తనతోపాటు మరో ముగ్గురు ఉన్నారని అంతా భయపడి పారిపోయామని డ్రైవర్ తిలక్ చెబుతున్నాడు. ఘటనపై తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు చెప్పారు. డ్రైవర్ బాలగంగాధర్ తిలక్‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి కోలుకున్న తరువాత అరెస్టు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులు షర్మిల, దుర్గాప్రసాద్ మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో, ఉమామహేశ్వరరావు మృతదేహానికి ఏలూరు ఆసుపత్రిలో, రేవతి మృతదేహానికి విజయవాడ ఆసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాలను ఉమామహేశ్వరరావు తండ్రి గణపతికి అప్పగించినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
మరణాలపై టీడీపీ రాజకీయాలు
-
అసెంబ్లీ లో టీడీపీ రాద్ధాంతం
-
సహజ మరణాలపై టీడీపీ అపోహలు
-
జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్
జంగారెడ్డిగూడెం: జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ వెల్లడించారు. శనివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీల్లో భాగంగా సబ్‌డివిజన్ పరిధిలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది కన్నా ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. ఆస్తి చోరీలు 31 శాతం వరకు తగ్గాయన్నారు. అలాగే హౌస్ బ్రేకింగ్, డెకాయిట్ నేరాలు కూడా తగ్గినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కూడా 26 శాతం మేరకు తగ్గాయని, రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య కూడా తగ్గినట్టు చెప్పారు. అయితే కొద్దిమేర హత్య కేసులు పెరిగాయని ఎస్పీ తెలిపారు. ఫోక్స్, మహిళలపై వేధింపులు, అత్యాచారం కేసులు 25 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని రవిప్రకాష్ తెలిపారు. గల్ఫ్ దేశాలకు పంపుతామనే మోసం కేసులు కూడా తగ్గాయన్నారు. ఇక ఫోక్స్ చట్టం కిందకు వచ్చే కేసులు జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో ఎక్కువగా ఉన్నాయన్నారు. అత్యాచార కేసులు కూడా ఎక్కువయ్యాయన్నారు. తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో 95 శాతం కేసుల్లో 60 శాతం మైనర్ బాలికలపై అత్యాచారం కేసులు ఉన్నాయన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా రెండు కేసుల్లో ఉంటే సదరు ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రతిపాదన చేశామన్నారు. ఐదు చెక్ పోస్టుల ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. టి.నరసాపురంలో ఒకటి, చింతలపూడి మండలంలో రెండు, జీలుగుమిల్లిలో ఒకటి, కుక్కునూరులో ఒకటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నగదు, మద్యం రవాణాపై దృష్టిసారించామన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల రాకపోకలు అరికట్టేందుకు న్యూడెమోక్రసీ దళాల కార్యకలాపాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా మావోయిస్టులు పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపహాడ్ ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్ జోన్లుగా ఉపయోగపడుతున్నాయని, దీనిపై గట్టి నిఘా పెట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అదనంగా మరో రెండు పార్టీల సాయుధబలగాలను మోహరించామని తెలిపారు. మొత్తం 200 మందికి వరకు సాయుధ పోలీసులు పోలవరం ప్రాజెక్టు చుట్టూ పహారా కాస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ గార్డ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏపీ ఎస్పీ, ఏఆర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీఐపీలు ప్రయాణించే అన్ని రోడ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. 900 సీసీ కెమేరాల ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో 900 సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సీసీ కెమేరాల ఏర్పాట్లు త్వరితగతిన సాగుతున్నాయన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఉంటుందని, అది ఎస్పీ కార్యాలయానికి కూడా అనుసంధానం అవుతుందన్నారు. జనవరి కల్లా 900 కెమేరాల ఏర్పాట్లు పూర్తవుతుందని చెప్పారు. ఇవికాక ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 సీసీ కెమేరాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఆయా ప్రధాన షాపింగ్‌మాల్స్ వద్ద అపార్ట్మెంట్లలో కొన్ని సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. సంఘ వ్యతిరేక శక్తులపైనా, కార్యకర్తలపైనా గట్టినిఘా ఏర్పాటు చేశామన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, గుండాట, కోడిపందాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ రెండు చోట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో పోలీస్ స్టేషన్లు ఉండేలాగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు ఈ స్టేషన్లలో పనిచేస్తారన్నారు. జిల్లాలో పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణం, ఆధునికీకరణ, సర్కిల్ కార్యాలయాలు, క్వార్టర్ల నిర్మాణం వరుస క్రమంలో చేపట్టామన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తైందని, త్వరలో ప్రారంభిస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పశ్చిమ ఏజెన్సీలో కూంబింగ్
జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమ ఏజెన్సీలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేగాక ఇటీవల కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉందని ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క కేంద్రం ప్రకటన, మరోపక్క చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ప్రత్యేక బలగాలతో కూడిన ఒక బృందం కూంబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక పోలవరం జాతీయ ప్రాజెక్టు కారణంగా ఇక్కడ ఇప్పటికే ప్రత్యేక బలగాలు మోహరించి పహారా కాస్తున్నాయి. ప్రాజెక్టు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ పోలీసు బలగాలను మరింత అప్రమత్తం చేశారు. అలాగే ఏజెన్సీ పోలీస్‌స్టేషన్‌లైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. చత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నాయి. చత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తల దాచుకునేందుకు తూర్పుగోదావరి మీదుగా గోదావరి దాటి పశ్చిమలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉండేది. మావోయిస్టులు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించకపోయినా షెల్టర్ జోన్‌గా వాడుకుని వెళ్ళిపోయే వారు. అయితే ఇతర నక్సలైట్ వర్గాలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడంతో పలు ఎన్కౌంటర్లు జరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాను కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులలో గతంలో మావోయిస్టు కార్యకలాపాలు జరిగిన ఘటనల నేపథ్యం కూడా ఉంది. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ అటవీ ప్రాంతం అంతా పచ్చటి ఆకులతో దట్టంగా అలముకుని ఉంటుంది. దీంతో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోంది. -
రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడు
జంగారెడ్డిగూడెం : భార్య ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు ఆదివారం తెల్ల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మొదటి భార్య తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం టి.నరసాపురం మండలం వెంకటాపురానికి చెందిన తిరుక్కొవళ్లూరు రమేష్ ఆదివారం తెల్లవారుజామున రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి రమేష్ మొదటి భార్య ప్రసన్న లక్ష్మి, ఆమె తల్లిదండ్రులు వందవాసు మర్రీదురావు, అచ్చమాంబదేవీలు రమేష్, అతని తల్లిదండ్రులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. 2016లో పెళ్లి ప్రసన్న లక్ష్మి తల్లిదండ్రులది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నార్లు వల్లూరు. వారు తమ కుమార్తెను 2016లో టి.నరసాపురం మండలం తిరుక్కొవళ్లూరు రమేష్‌కిచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన కొంత కాలానికి ప్రసన్నలక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో రమేష్ పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో రమేష్‌కు మరో పెళ్లి చేస్తున్నారనే విషయం తెలిసి రమేష్ అతని, తల్లిదండ్రులను ప్రశ్నిస్తే ప్రసన్నలక్ష్మికి మానసిక స్థితి సరిగా లేదని, అందుకే తమ కుమారుడికి మరో పెళ్లి చేస్తున్నామని సమాధానమిచ్చారు. దీంతో తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఈ నెల 3న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో ప్రసన్నలక్ష్మి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా పెళ్లికి సిద్ధం కావడంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గోకుల పారిజాతగిరిలో పెళ్లి చేస్తున్నారని తెలిసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో రమేష్ తల్లిదండ్రులు ప్రసన్నలక్ష్మి తల్లిదండ్రులతో ఘర్షణకు దిగారు. ఈ సమయంలో కొత్త వధూవరులను వెంకటాపురానికి తరలించారు. దీంతో ప్రసన్న లక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు వెంకటాపురం వెళ్లి రమేష్, అతని తల్లితండ్రులు, బంధువులను నిలదీశారు. ఈ సమయంలో జరిగిన ఘర్షణలో ప్రసన్నలక్ష్మి తల్లితండ్రులు, బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసన్నలక్ష్మికి స్థానిక మహిళా సంఘాలు, సీఐటీయూ నాయకురాలు ఎస్కే సుభాషిని, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆరేషా దుర్గా, డీహెచ్‌పీఎస్ నాయకురాలు ఎస్కే షలీమా మద్దతు పలికారు. దీనిపై ఎస్సై జీజే విష్ణువర్థన్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరుగుతున్న పెళ్లిని అడ్డుకునేందుకు వచ్చిన ప్రసన్నలక్ష్మి బంధువులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ వివాదంపై టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో ఇది వరకే కేసు నమోదైనట్టు వెల్లడించారు. -
మాయా.. మర్మం..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ బ్యారెల్ ధరలు పెరుగుతున్నందున దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం తరచూ చెప్పేమాట. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నపుడు మన దగ్గర పెట్రోల్ ధర గరిష్టంగా 80 రూపాయలు ఉండేది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయింది. ఆ మేరకు మన దగ్గర పెట్రోల్ ధర కూడా సగానికి పైగా తగ్గాలి. అంటే లీటరు ధర 40 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. కానీ మార్కెట్లో లీటరు రూ.75 వరకు ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇందులో మాయామర్మం ఏమిటో పాలకులకే తెలియాలి. జంగారెడ్డిగూడెం: పెట్రోల్, డీజిల్ సమీక్షా విధానం గందరగోళంతో అమలవుతోంది. ఏరోజుకారోజు ధరలు నిర్ణయించడం అనే అంశం వినియోగదారుడికి కొంత తలనొప్పిగా మారింది. గతంలో 15 రోజులకోసారి పెట్రోల్ డీజిల్ ధరలు మారేవి. జూన్ 16 నుంచి ఏరోజు ధర ఆ రోజు మారుతోంది. ఈ మార్పు ఎలా జరుగుతుందో అర్థం కాక వినియోగదారుడు తికమకపడుతున్నాడు. ఈ విధానం ప్రకటించిన నాటి నుంచి ధరలు పైసల్లో పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 16న ప్రారంభమైన ఈ విధానంలో అప్పటికి పెట్రోల్ ధర రూ. 73.08, డీజిల్ రూ. 62.80 గా ఉంది. ఇది ఈ నెల 3వ తేదీ నాటికి పెట్రోల్ ధర రూ. 76.78, డీజిల్ రూ. 66.16కు చేరుకుంది. సమీక్షా విధానంలో పైసల చొప్పున పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా సవరణలు జరుగుతున్నాయని ప్రకటిస్తున్నా ఇది వినియోగదారుడికి అందడంలో ప్రభుత్వాల మ్యాజిక్కులు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ బాదుడు భారీగానే ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వీటిపై సుమారుగా రూ. 10 వరకు తేడా వస్తోంది. ఈ భారాన్ని వినియోగదారుడే భరించాల్సి వస్తోంది. బంక్‌ల మాయాజాలం ఇదిలా ఉంటే బంక్‌లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొలతల్లో తేడా ఉండటంతో వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. నాణ్యత విషయంలో, రీడింగ్‌లో తేడా ఉండటం వంటివి జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కల్తీ కూడా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల వాహనాలు చెడిపోయి మరమ్మతులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో 279 పెట్రోల్ బంక్‌లు జిల్లాలో ప్రభుత్వరంగ పెట్రోల్ బంకులు 279 ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 130, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ 79, హిందూస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ బంకులు 70 ఉన్నాయి. నెలలో జిల్లా మొత్తం మీద 1,05,80,000 కిలో లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. అలాగే 2,40,00,000 కిలో లీటర్ల డీజిల్‌ను వినియోగదారులు ఒక నెలలో వినియోగిస్తున్నారు. అంటే రోజు వారీ పెట్రోల్ వినియోగం 3,53,000 కిలో లీటర్లు, డీజిల్ 7,99,000 కిలో లీటర్లు వినియోగిస్తున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నెల 3న∙పెట్రోల్‌పై రూ.2, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ డీజిల్ ధరలు కొంతమేర తగ్గాయి. పన్నులతో కలిపి పెట్రోల్ రూ. 2.50, డీజిల్ రూ. 2.25 తగ్గింది. ఈ నెల 3న పెట్రోల్ ధర రూ. 76.78 ఉండగా, ప్రస్తుతం రూ. 74.24గా ఉంది. అలాగే డీజిల్ రూ. 66.16 నుంచి రూ. 63.84కు తగ్గింది. వ్యాట్ తగ్గించండి పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచిం చింది. ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న వ్యాట్‌ను 5శాతం తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ రాయనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రకటించారు. -
కామాంధుడి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం : కామాంధుడి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహతృ్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని తాడువాయికి చెందిన పగిళ్ల శైలజ (35)కు 11 ఏళ్ల క్రితం అమృతరావుతో వివాహమైంది. ఆమె తన భర్తతో కలిసి కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కలపాల జయరాజు కొంతకాలంగా కామవాంఛ తీర్చాలని శైలజను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈనెల 8న శైలజ గొల్లగూడెం గ్రామంలో పొలం పనులకు వెళ్లగా, అక్కడకు వెళ్లిన జయరాజు ఆమెను పామాయిల్ తోటలోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ అక్కడే పురుగుల మందు సేవించింది. ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకుంటుండగా, చుట్టుపక్కల వాళ్లు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. దీనిపై శైలజ తండ్రి పల్లంటి దుర్గారావు ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
జంగారెడ్డిగూడెం: తమకు రక్షణకావాలంటూ ఓ ప్రేమజంట స్థానిక డీఎస్పీ జె.వెంకటరావును ఆశ్రయించారు. కొవ్వూరుకు చెందిన తాపీమేస్త్రి జి.ఏసురాజు, డిగ్రీ పూర్తిచేసిన పి.లలిత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లలిత నివశించే మూడు డాబాల వీధిలో ఏసురాజు కొంత కాలం తాపీపనిచేశారు. ఆ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈక్రమంలో వారు వివాహానికి సిద్దపడగా, పెద్దలు తెలుసుకుని కొంతకాలం ఆగితే తామే చేస్తామని ఒప్పించారు. ఇటీవల లలితను అశ్వారావుపేటలోని తన మామయ్య ఇంట్లో దాచి ఉంచారు. అయితే బుధవారం ఏసు రాజు, లలిత జంగారెడ్డిగూడెం వచ్చి పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ డీఎస్పీ జె.వెంకటరావును ఆశ్రయించారు. దీంతో ఆయన వారికి ఒక కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్‌ను రక్షణగా ఇచ్చి కొవ్వూరు డీఎస్పీ వద్దకు పంపారు. ఇద్దరు మేజర్లు కావడంతో కొవ్వూరు డీఎస్పీ వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారని వెంకటరావు తెలిపారు. -
మార్చరు.. చేర్చరు
జంగారెడ్డిగూడెం : రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం వేలాది కుటుంబాలు దరఖాస్తులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 33 వేల మంది తమ రేషన్ కార్డుల్లో వివిధ రకాల చేర్పులు, మార్పులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా నెలల తరబడి ఎదురుచూస్తున్నా సవరణలు నమోదుకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిపేరు, వ్యక్తి పేరు, పుట్టిన తేదీ తదితర అంశాల్లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సవరింప చేసుకునే అవకాశం ఉంది. రేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఎవరైనా మృతిచెందితే ఆ పేరు తొలగించుకునేందుకు, కొత్తగా మరో పేరు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి సవరణల కోసం ఈ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు తహసిల్దార్ కార్యాలయానికి వెళుతుంది. సంబంధిత వీఆర్వో, సివిల్ సప్లైస్ డీటీ, తహసిల్దార్ విచారణ జరిపి ఆమోదించాలి. అలా ఆమోదించిన రేషన్‌కార్డు తిరిగి మీ-సేవ కేంద్రానికి చేరుతుంది. అక్కడి నుంచి కార్డును పొందవచ్చు. కొత్తగా ఎవరి పేరైనా నమోదు చేసుకోవాలంటే మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది తహసిల్దార్ కార్యాలయం నుంచి సివిల్ సప్లైస్ కమిషనర్ ఆమోదం కోసం వెళుతుంది. అక్కడ ఆమోదం పొందిన తరువాత తహసిల్దార్‌కు చేరుతుంది. ఇలా చేర్పులు, మార్పులు చేసిన పాత రేషన్ కార్డులను మార్చి, కొత్త కార్డులపై తహసిల్దార్ డిజిటల్ సంతకం చేయా ల్సి ఉంటుంది. సంతకం అనంతరం మీ-సేవ కేంద్రం ద్వారా కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో కొన్ని నెలలుగా దరఖాస్తు చేసుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 33 వేల మంది కార్డుదారులకు సవరణలతో కూడిన కొత్త కార్డులు ఇప్పటికీ అందలేదు. ఏదైనా పథకానికి సంబంధించి స్థానికతకు రేషన్‌కార్డు అవసరం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులను అడిగితే తామేమీ చేయలేమని, వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని, సర్వర్ పనిచేయడం లేదని సమాధానమిస్తున్నారు. రేషన్ కార్డుల్లో సవరణల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్చడం, రేషన్ కార్డులో గ్యాస్ వివరాల మార్పు, డూప్లికేట్ కార్డుల జారీ, కార్డు మరో ప్రాంతానికి బదిలీ తదితర 11 రకాల సేవల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో వాటిని పరిష్కరిం చాల్సి ఉన్నా.. అధికారులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల జన్మభూమి సభల్లో జారీ చేసిన కొత్త కార్డుల్లోనూ తప్పులు అధికంగా ఉండటంతో మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చాలా మందికి రేషన్ కార్డులను ఫొటోలు లేకుండా ఇచ్చారు. గత నవంబర్ నుంచి సర్వర్లు సరిగా పనిచేయక దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
తృటిలో తప్పిన ఎన్కౌంటర్!
జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో తృటిలో ఎన్కౌంటర్ తప్పింది. ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ చంద్రన్న వర్గం దళ సభ్యులు సుమారు 10 మంది సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. నిఘా విభాగం సమాచారం మేరకు బుట్టాయగూడెం మండలంలో చంద్రన్న వర్గందళ సభ్యులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు గత నెల 29న రాత్రి ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామంలో అర్ధరాత్రి తనిఖీలు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో దళ సభ్యులు ఉన్నారని తెలుసుకుని సాయుధ బలగాలు విసృ్తత కూంబింగ్ జరిపాయి. అదే సమయంలో ఉప్పరిల్ల అటవీప్రాంతంలో 9 మంది చంద్రన్న వర్గం దళ సభ్యులు రహస్య స్థావరంలో మకాం వేసినట్టు పోలీసులకు ఉప్పందింది. 9 మంది దళ సభ్యుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో దళ సభ్యులంతా నిద్రిస్తుండగా ఒకరు మాత్రం కాపలా కాస్తున్నట్టు తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులను కాపలా కాస్తున్న దళ సభ్యుడు గుర్తించి దళంలోని మిగతా వారందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారంతా కిట్ బ్యాగ్ ఆయుధాలను ధరించి గుంపుగా కాకుండా విడివిడిగా తలో వైపునకు తప్పించుకున్నట్టు సమాచారం. పోలీసులు ఆప్రాంతమంతా గాలించి వెనక్కి వచ్చినట్టు తెలిసింది. కూంబింగ్ చేస్తున్న పోలీసులు దళం ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉంటే పెద్ద ఎన్‌కౌంటరే జరిగి ఉండేదని చెబుతున్నారు. ముగ్గురి అరెస్ట్ : బుట్టాయగూడెం : అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు బుధవారం తెలిపారు. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన దళ కమాండర్ పల్లాల ప్రకాష్‌రెడ్డి, కొరియర్లుగా పనిచేస్తున్న మడకం రామారావు, నడపన సోమరాజు పట్టుబడ్డారని చెప్పారు. ఈ నెల 1వ తేదీన రాత్రి బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం ఉప్పరిల్లలో చంద్రన్న వర్గం దళ సభ్యులు సంచరిస్తున్నట్టు సమాచారం అందటంతో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఇన్చార్జి, ఆర్ఎస్ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపారన్నారు. పోలీసులను చూసి కొంతమంది పారిపోయారని, ప్రకాష్‌రెడ్డి, రామారావు, సోమరాజు పట్టుబడ్డారని తెలిపారు. వారినుంచి ఒక నాటు తుపాకీ, 6 రౌండ్ల బుల్లెట్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
పాఠశాల బస్సును ఢీకొన్న ట్రాలీ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలో ట్రాలీ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ పాఠశాల బస్సు రోడ్డు పక్కనున్న వాలులోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్ గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ పాఠశాల బస్సు 42 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం బుట్టాయగూడెం మండలం గంగవరం నుంచి స్కూలుకు బయలుదేరింది. పట్టెన్నపాలెం, శ్రీనివాసపురం మీదుగా స్థానిక రాష్ట్ర ప్రధాన రహదారిపైకి చేరుకుంది. గరుఢపక్షి నగర్లోకి మలుపు తిరుగుతుండగా.. కోదాడ నుంచి ఒరిస్సాకు సిమెంటు లోడుతో వెళుతున్న ట్రాలీ వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో పాఠశాల బస్సు రోడ్డుపక్కన ఉన్న లోతైన వాలులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గంగవరానికి చెందిన విద్యార్ధులు పి.దుర్గాప్రసాద్, పి.భావన, ఆర్.రేవతి, జి.సాయికుమార్, జి.హరిచందన, పట్టెన్నపాలెంకు చెందిన జి.వీరాంజనేయులు, బి.హర్షనందు, టి.భీష్మవెంకటసాయిచందు, టి.ఝాన్సీ, శ్రీనివాసపురానికి చెందిన ఎలికే ఈశ్వర శ్రీనాథ కిషోర్, పోల్నాటి తారక్, పోల్నాటి హైమావతి, పట్టణానికి చెందిన జి.నవదీప్, కె.భవ్యనాగార్షిత గాయపడ్డారు. బస్సు డ్రైవర్ దొండపాటి ఇజ్రాయేల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థుల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తనయుడు పోల్నాటి తారక్ ఉండడంతో ఆయన హుటాహుటిన కారులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారునితోపాటు మరికొందరు పిల్లలను కారులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కూడా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.భాస్కరరావు పర్యవేక్షణలో వైద్యులు విద్యార్థులకు చికిత్స చేశారు. ఆరుగురు విద్యార్థులకు ఓ మోస్తరుగా గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ ఇజ్రాయేల్ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏరియా ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద తరలివచ్చారు. దీంతో ఆస్పత్రి ఆవరణ రోదనలతో మిన్నంటింది. చికిత్స పూర్తయిన తర్వాత తమ పిల్లలను వారు ఇళ్లకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీని, దాని డ్రైవర్ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురి పరామర్శ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పలువురు పరామర్శించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, పీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు, కరాటం రాంబాబు, వైఎస్సార్ సీపీ అధికారప్రతినిధి పోల్నాటి బాబ్జి, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తిరామ్కుమార్, కాంగ్రెస్ నాయకులు పీపీఎన్ చంద్రరావు, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, డీవైఈవో తిరుమలదాసు, ఎంఈవో ఆర్.రంగయ్య , బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, సీపీఐ నాయకులు బూరుగుపల్లిసూరిబాబు, పాఠశాల కరస్పాండెంట్ పి.సతీష్ చంద్, ఆయా పాఠశాలల ప్రతినిధులు పరామర్శించారు. -
రోడ్డెక్కిన రైలింజన్
పట్టాల మీదు దౌడు తీయాల్సిన రైలింజన్ 106 చక్రాల ట్రాలీ లారీపై ఎక్కి రోడ్లపై షికారు చేసింది. బెంగళూరులోని రైలింజిన్ల ఉత్పత్తి సంస్థ శాన్ ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ తయారు చేసిన 805 మోడల్ డీజిల్ హైడ్రాలిక్ ఇంజిన్‌ను ఓ విదేశీ సంస్థ తన అవసరాల కోసం కొనుగోలు చేసింది. దీనిని విశాఖపట్నం షిప్ యార్డు నుంచి ఓడ ద్వారా తీసుకెళుతోంది. ఓడ ఎక్కించేందుకు 106 చక్రాల ట్రాలీ లారీపై విశాఖకు తరలిస్తుండగా జంగారెడ్డిగూడెం వద్ద తీసిన చిత్రమిది. - జంగారెడ్డిగూడెం రూరల్(పశ్చిమగోదావరి జిల్లా) -
‘పుంజు’కున్న ఏర్పాట్లు
కోడిపందేలకు సమాయత్తమవుతున్న పందెగాళ్లు ఆ మూడురోజులూ జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు మరోపక్క హైకోర్టు ఆదేశాలు, ఎస్పీ వ్యాఖ్యలతో ఉత్కంఠ జంగారెడ్డిగూడెం :కోడిపందేలు, జూదాలకు పోలీసులు ‘నై’ అంటున్నా పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్లో పండగకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు చేయడం, వాటిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తరువాత పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలివేయడం షరా మామూలైంది. ఈ నేపథ్యంలో పండగ మూడురోజులు కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయాత్తమవుతున్నారు. ఆ మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లోను కోడిపందేలు జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు బరులు సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, బైపాస్‌రోడ్డు జంక్షన్లో ఏటా భారీఎత్తున కోడిపందేలు నిర్వహిస్తారు. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో భారీగా కోడిపందేలు జరుగుతాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచే గాక పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పందెగాళ్లు వస్తుంటారు. భారీ, మధ్యతరహా, చిన్న స్థాయి పందేలకు వేరువేరుగా బరులు ఏర్పాటు చేస్తుంటారు. ఆ మూడురోజులు జరుగుతాయని ధీమా ఒకపక్క జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతం కాదు, ఇప్పుడు చూడండి అని కోడిపందేలపై వ్యాఖ్యానించడం, మరోపక్క హైకోర్టు కోడిపందేలు జరగకుండా నిరోధించమని ప్రభుత్వాన్ని ఆదేశించడం, ఈ ఏడాది కోడిపందాలు జరగడంపై సందిగ్ధత నెలకొందని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఏదిఏమైనా ఆ మూడు రోజులు జరిగి తీరుతాయని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఏర్పాట్లు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చాలాచోట్ల ఒక మోస్తరు కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం,గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చేసరికి లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో అన్న ఉత్కంఠ పందెగాళ్లలో ఉంది. -
మద్యం మత్తులో కోడికత్తితో దాడి
పేగులు బయటపడి మృత్యువుతో పోరాడుతున్న రామకృష్ణ తనను తాను గాయపర్చుకుని ఆసుపత్రిలో చేరిన రమణయ్య జంగారెడ్డిగూడెం : మద్యం మత్తులో, పాత గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై కోడికత్తితో దాడిచేయడంతో గాయపడిన వ్యక్తి పేగులు బయటకు వచ్చి మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రాజరాజేశ్వరి థియేటర్ సమీపంలోని ముత్తరాసిపేటలో గురువారం ఒక ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముత్తరాసిపేటలోని బంధువులంతా దీనికి హాజరయ్యారు. వీరిలో కొంతమంది మద్యం సేవించి ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల సమయంలో వాసుబోయిన రమణయ్య భోజనానికి కూర్చొన్నాడు. మారుబోయిన రామకృష్ణ భోజనాలు వడ్డిస్తున్నాడు. వడ్డన సమయంలో రామకృష్ణ, రమణయ్యల మధ్య మాటామాటా పెరిగింది. అంతేగాక వీరిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాసుబోయిన రమణయ్య కోడికత్తి తీసుకుని రామకృష్ణ కడుపులో పొడిచి చీరేశాడు. దీంతో రామకృష్ణ పేగులు బయటపడ్డాయి. వెంటనే అతన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాసుబోయిన రమణయ్య తాను దాడిచేసిన కత్తితోటే తన చేతిపైన, కాలిపైన పొడుచుకుని తనను రామకృష్ణే పొడిచాడని ఆసుపత్రికి చికిత్సకు వెళ్లాడు. రమణయ్యకు చికిత్స చేసిన అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రామకృష్ణకు ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమించడంతో ఏలూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదలకు సంక్షేమ పథకాలు
జంగారెడ్డిగూడెం:ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది , సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరే విధంగా కృషిచేస్తున్నామని రాష్ట్రమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శనివారం నగర పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరపంచాయతీ భవన నిర్మాణానికి గతంలో రూ. 50లక్షలు మంజూరయ్యాయని, తాజా అంచనాల ప్రకారం 1.65 కోట్ల రూపాయలు మంజూరవుతాయని చెప్పారు. 7వ వా ర్డులో రూ. 3 లక్షలతో సీసీరోడ్డు, డ్రైన్, 14వ వార్డులో రూ. 5లక్షలతో సీసీరోడ్డు, బుట్టాయగూడెంలో రూ. 5లక్షలతో సీసీ రోడ్డు, 13వ వార్డులో రూ. 4లక్షలతో కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. 17వ వార్డులో రూ. 8లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, 2వ వార్డులో రూ. 5లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, బాలికల జెడ్పీహైస్కూల్ పాఠశాలలో రూ. 14.80 లక్షలతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో దీపం గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, టీడీపీ పట్టణ , మండల కమిటీ అధ్యక్షులు షేక్ ముస్త ఫా, ముళ్లపూడి గంగాధర శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్‌కుమార్, నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు వందనపు హరికృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
దళిత బాలికపై అత్యాచారం
జంగారెడ్డిగూడెం : దళిత బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీఎస్పీ జె.వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 14 సంవత్సరాల బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఆమె తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 19న బాలిక తల్లి తన కూతురు, మరో స్నేహితురాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందని, మరొక బాలిక 22వ తేదీన రాగా, ఆమె తల్లితండ్రులకు అప్పగించామన్నారు. అయితే శుక్రవారం తన బాలికపై అత్యాచారం జరిగిందని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 18న పట్టణానికి చెందిన ఆటోపై కూరగాయలు రవాణా చేసే గండ్రోతు లక్ష్మణ్ ఇద్దరు బాలికలను తాడేపల్లిగూడెం తీసుకువెళ్లి అందులో ఒక బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంచాడని, మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందన్నారు. మరో బాలికపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేశాడని, అతని స్నేహితుడు తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన బాలిక తిరిగి జంగారెడ్డిగూడెం వచ్చిందని, దీంతో ఆమెను తల్లితండ్రులకు అప్పగించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గండ్రోతు లక్ష్మణ్, శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిపై పోక్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అఫెన్సెస్ చట్టం) కింద , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తాను దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీ సూర్యచంద్రంపై బాలిక తల్లి ఫిర్యాదు చేశారని దానిపై శాఖాపరమైన విచారణ చేస్తామన్నారు. ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు బాలిక తల్లి విలేకరులతో మాట్లాడుతూ గండ్రోతు లక్ష్మణ్ ఆరు నెలలుగా తన కూతురుపై అత్యాచారం చేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. తన కూతురికి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టాడని, తన కూతురిపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేయడమే కాకుండా తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా అత్యాచారం చేశాడని వివరించారు. ఈ నెల 18వ తేదీన తన కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు సక్రమంగా స్పందించలేదని పేర్కొంది. హెచ్‌సీ సూర్యచంద్రం తనను అవమాన పరిచి అసభ్యకర పదజాలంతో తిట్టారని పేర్కొన్నారు. శుక్రవారం తన కూతురిపై జరిగిన అత్యాచార ఘటన, హెచ్‌సీ సూర్యచంద్రంపైనా పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రతులను జిల్లాకలెక్టర్‌కు, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రులకు పంపినట్టు తెలిపారు. -
వివాహిత హత్య
తీవ్రంగా కొట్టి, బ్లేడ్‌తో పీక కోసిన వైనం జంగారెడ్డిగూడెంలో ఘటన జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత హత్యకు గురైంది. దుండగులు ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చారు. వివరాలు ఇలా ఉన్నారుు. స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న రొంగల అప్పారావు, సుబ్బలక్ష్మి దంపతుల రెండో కుమార్తె రొంగల దివ్య (18)ను 2013లో టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన నీరుకొండ రాజేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం క్రితం రాజేష్, దివ్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమె పుట్టింట్లో ఉంటోంది. రెండు నెలల క్రితం రాజేష్, దివ్యలు విడాకులు తీసుకున్నారు. దివ్య తల్లిదండ్రుల వద్ద ఉంటూ జంగారెడ్డిగూడెంలోని ఒక దుకాణంలో పనిచేస్తోంది. దివ్య తల్లిదండ్రులు కాఫీ హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు. శనివారం రాత్రి షాపు నుంచి ఇంటికి వచ్చిన దివ్య భోజనం చేసి నిద్రించిందని, అయితే రాత్రి 1.30 గంటలకు లేచిచూడగా తన కూతురు కనిపించ లేదని ఆమె తల్లి సుబ్బలక్ష్మి తెలిపింది. దివ్య కోసం గాలిస్తుండగా ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని రైస్‌మిల్లు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో శవమై కనిపించిందని తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఎ.ఆనందరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని దివ్య మృతదేహాన్ని పరిశీలించారు. ముఖంపై గట్టిగా కొట్టినట్టు గాయూలను, పీకపై బ్లేడ్‌తో కోయడాన్ని గుర్తించారు. పథకం ప్రకారమే దివ్యను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దివ్యను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు అప్పారావు, సుబ్బలక్ష్మి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఒకేరోజు 16 మంది మృతి
జంగారెడ్డిగూడెం రూరల్:జిల్లాలో మండుతున్న ఎండలతో వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండ, వేడి గాలులతో పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం 16 మంది వడదెబ్బతో ప్రాణాలు విడిచారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన వామిశెట్టి సాయిబు (68) పొలం పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొవ్వలిలో.. కొవ్వలి (దెందులూరు) : మూడు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు కొవ్వలిలో గొరిపర్తి గంగారత్నం(60) శుక్రవారం రాత్రి మృతిచెందినట్టు ఆమె కుమారుడు గొరిపర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న గంగారత్నం వేడిగాల్పులకు తాళలేని కన్నుమూశారని చెప్పారు. నరసాపురంలో.. నరసాపురం అర్బన్: పట్టణంలోని జవదాలవారిపేటకు చెందిన ఈదా ఆశీర్వాదం (66) శనివారం వడదెబ్బకు మృతిచెందారు. ఇంట్లో కార్యక్రమం నిమిత్తం శుక్రవారం ఆశీర్వాదం ఎండలో తిరిగారని.. అస్వస్థతకు గురైన ఆయన శనివారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. పైడిచింతపాడులో.. పైడిచింతపాడు (ఏలూరు రూరల్ ): పైడిచింతపాడు గ్రామానికి చెందిన రేలంగి శామ్సన్ (70) వడదెబ్బకు మృతిచెందారు. మూడు రోజులుగా వీస్తున్న వడగాల్పులతో అస్వస్థతకు గురైన శామ్సన్ను శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. వడ్లపట్లలో.. భీమడోలు: మండలంలోని అంబర్‌పేట పంచాయతీ శివారు వడ్లపట్లలో శృంగవృక్షం సుబ్బారావు (74) అనే వృద్ధుడు వడదెబ్బకు మృతిచెందారు. ఆయన సొంతం పొలంలో పని చేస్తూ కుప్పకూలిపోయూరు. కొద్దిసేపటికి ఆయన కుటుంబసభ్యులు పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుర్వాయిగూడెంలో.. జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంకు చెందిన దల్లి కనకరాజు (69) శనివారం వడదెబ్బ తగిలి మృతిచెందారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కనకరాజు తన ఇంట్లో మృతిచెందారు. గోపాలపురంలో.. గోపాలపురం: గ్రామంలోని రొంగలవారి వీధికి చెందిన రొంగల అచ్చాయమ్మ (70) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం నుంచి చలాకీగా ఉన్న ఆమె సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిందని చెప్పారు. పండితవిల్లూరులో.. పండితవిల్లూరు: గ్రామంలోని పెదపేటలో సదమళ్ల వెంకమ్మ (74) ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా వడగాల్పులతో అస్వస్థతకు గురైన ఆమె కన్నుమూశారు. చింతంపల్లిలో.. చింతలపూడి: చింతలపూడి మండలం చింతంపల్లిలో కొండారు ఆనందరావు (40) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్టు వీఆర్వో వీర్రాజు తెలిపారు. ఉదయం ఏలూరు వెళ్లిన ఆనందరావు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి కుప్పకూలిపోయూడని కుటుంబ సభ్యులు తెలిపారు. పేరుపాలెంలో.. మొగల్తూరు: మండలంలోని పేరుపాలెం గ్రామానికి చెందిన పావురాల ముత్యాలరావు (56) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. అప్పనవీడులో.. పెదపాడు: పెదపాడు మండలం అప్పనవీడులో మండపాటి జ్ఞానేశ్వరరావు శనివారం వడదెబ్బతో గుడివాడ రోడ్డులో అపస్మారక స్థితిలో పడిపోయి చనిపోయూరు. మోగల్లులో.. పాలకోడేరు : మండలంలోని మోగల్లులో కొడమంచిలి గ్రేసమ్మ (60) అనే వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతిచెందారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఇంట్లో సొమ్ముసిల్లి పడి మృతిచెందారు. మరో ఇద్దరు.. ఏలూరు(సెంట్రల్)/ పెనుమంట్ర: దెందులూరు గ్రామానికి చెందిన తెళ్ళ దమయంతి (60) శనివారం వడగాల్పులకు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఆమె మృతిచెందారు. పెనుమంట్ర మండలం పొలమూరులో శనివారం సాయంత్రం సారిపల్లి రమణమ్మ (45) అనే మహిళ వడగాల్పులతో మృతిచెందినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. గూడెంలో తాపీ కార్మికుడు.. తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): పట్టణంలోని నాలుగో వార్డు గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన తాపీ కార్మికుడు కొంతల శ్రీనివాస్ (43) వడదెబ్బతో మృతిచెందారు. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం స్థానికంగా తాపీ పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యూరు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అర్ధరాత్రి సమయంలో ప్రాణాలు విడిచారు. తహసిల్దార్ పాశం నాగమణి ఆదేశాల మేరకు వీఆర్వో కృష్ణస్వామి శనివారం మృతుని కుటుంబ సభ్యులను కలిశారు. అయితే కేసు నమోదు, పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వడదెబ్బ మృతిగా అధికారులు నమోదు చేయలేదు. దప్పికతో వృద్ధురాలు.. కొయ్యలగూడెం: వడదెబ్బ, దప్పికతో కొయ్యలగూడెంలో ఓ వృద్ధురాలు కన్నుమూసింది. వీఆర్వో అడపా రాంబాబు తెలిపిన వివరాలు ప్రకారం.. కొయ్యలగూడెం వడ్డీలపేటకు చెందిన జలశూత్రం బోదెమ్మ (65) అనే వృద్ధురాలు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామ శివారున ఉన్న జయప్రద హాస్పటల్ వద్దకు కాగితాలు ఏరుకునేందుకు వెళ్లి వడదెబ్బ బారిన పడ్డారు. దప్పిక తీర్చుకునేందుకు సమీపంలోని సీసాలో ఉన్న మడ్డి ఆయిల్ తాగి ఆమె మృతిచెందినట్టు పోలీసులు, రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఒక ఇంట్లో 16 సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన దాసరి మహాలక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె దాసరి చిట్టెమ్మను, జంగారెడ్డిగూడెం శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు పీవీ మల్లేశ్వరరావు పెంచుకుంటున్నారు. మూడు సంవత్సరాలుగా చిట్టెమ్మ డాక్టర్ మల్లేశ్వరరావు వద్దే ఉంటోందని తల్లితండ్రులు తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తాను తనభార్యతో విజయవాడ శుభాకార్యానికి వెళ్లినట్లు డాక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. అయితే ఇంట్లో చిట్టెమ్మ ఉరి వేసుకున్న విషయం తన బావమరిది అయిన విజయకృష్ణ, కిషోర్ ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇంట్లో బెడ్రూమ్లో ఫ్యాన్‌కు చున్నితో వేలాడుతూ చిట్టెమ్మ మృతదేహం కనిపించింది. కాళ్లు కూడా నేలకు ఆనించి ఉండటంతో చిట్టెమ్మే ఉరివేసుకుని ఉంటుందా, లేక వేరే ఏదైనా ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఆనందరెడ్డిలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చిట్టెమ్మ మృతితో తల్లితండ్రులతో పాటు, బంధువుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్న రాత్రే తన కూతురు చిట్టెమ్మ ఫోన్లో మాట్లాడిందని చెబుతూ తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
న్యాయం చేయాలంటూ వివాహిత ఆందోళన
జంగారెడ్డిగూడెం రూరల్ :అత్తింటివారు వరకట్న వేధింపులకు గురిచేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక వివాహిత జంగారెడ్డిగూడెంలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. ఈమెకు బంధువులతో పాటు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. లక్ష్మీభారతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన జరుగుతున్న సమయంలో భర్త రామ్మోహన్ ఇంట్లో లేరు. దీంతో అత్తమామలైన కేశనపల్లి రంగారావు, రత్నకుమారిలతో లక్ష్మీభారతి బంధువులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బయ్యనగూడెంకు చెందిన కంభంపాటి వెంకటేశ్వరరావు కుమార్తె లక్ష్మీభారతి, జంగారెడ్డిగూడెంకు చెందిన కేశనపల్లి రంగారావు కుమారుడు రామ్మోహన్‌కు 2012 మార్చి 9వ తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.15లక్షలు కట్నం అడిగారని, అయితే తాము రూ.5లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెప్పి అంతే ఇచ్చామని లక్ష్మీభారతి సోదరుడు తాతారావు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని నెలలు తరువాత భర్త, అత్తమామలు లక్ష్మీభారతిని తరచూ కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. భోజనం కూడా పెట్టకుండా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తూ వచ్చారని పేర్కొన్నారు. లక్ష్మీభారతిని పుట్టింటికి వెళ్లిపోమని అనేకమార్లు వేధిస్తూ ఇంటి నుంచి పంపించివేశారని ఆరోపించారు. రూ. 10లక్షల రూపాయలు తీసుకువస్తే కాపురం ఉంటుందని, లేనిపక్షంలో తమ కుమారుడికి వేరొకరితో వివాహం చేస్తామని అనేకమార్లు అత్తమామలు బెదిరించి లక్ష్మీభారతిని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దీంతో సంవత్సర కాలంగా లక్ష్మీభారతి పుట్టింటిలోనే ఉండిపోయిందని, అనేకమార్లు ఆమెను తీసుకువెళ్లాలని కోరినా స్పందన లేదని బంధువులు తెలిపారు. దీంతో తాము ఇలా నిరసనకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీభారతి మాట్లాడుతూ తమకు వివాహం జరిగిన నాటి నుంచి తన భర్త, అత్తమామలు అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. గదిలో నిర్భంధించి కొట్టేవారని పేర్కొంది. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో తనను అనేక విధాలుగా చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ వేడుకొంది. పెద్దల సమక్షంలో ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. -
ప్రేమను పెద్దలు కాదన్నారని...
ఏలూరు (వన్ టౌన్) :తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు మృతిచెందగా ఒక యువతి పరిస్థితి విషమంగా ఉంది. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలలో జరిగిన ఈ ఘటనలపై బాధితులు, వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దలు నిరాకరించారని.. కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో నివాసం ఉండే వై వెంకటేశు(23) గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. అదే గ్రామంలో నివాసం ఉండే మూలం శైలజ ఇంటర్ పూర్తి చేసి గ్రామంలోనే ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలోని వేబ్రిడ్జిలో పనిచేస్తోంది. శైలజ తండ్రి ఊరూరా తిరిగి నవారు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నుంచి వెంకటేశు, శైలజలు ప్రేమించుకుంటున్నారు. శైలజకు వెంకటేశు వరసకు బావ అవుతాడు. ప్రేమించుకునే క్రమంలో పలుమార్లు వీరి ప్రేమ విషయం పెద్దల దగ్గర ప్రస్తావించారు. అయితే కట్నం కావాలని పెద్దలు కోరడంతో పెళ్లి వ్యవహారం కొన్నాళ్లు మరుగున పడింది. ఈ నేపథ్యంలో గురువారం వెంకటేశు కుటుంబ సభ్యులను నిలదీయడంతో కట్నం లేనిదే పెళ్లి కుదరదని తెగేసి చెప్పేశారు. దీంతో విసిగిపోయిన యువకుడు ప్రియురాలికి ఫోన్ చేసి ఇక మనపెళ్లి జరగదు వీళ్లు జరగనిచ్చేలా లేరు నువులేని జీవితం నాకెందుకు నేను చచ్చిపోతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తరువాత కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ చేసి నేను వెళ్లిపోతున్నాను. నువ్వైనా సుఖంగా జీవించు. పురుగు మందు తాగేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో యువతి కూడా వేబ్రిడ్జి కార్యాలయంలో ఉన్న సల్ఫర్ తాగేసింది. వెంకటేశును బంధువులు ఆటోలో, యువతిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. తడికలపూడి ఎస్సై కె.గురవయ్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన వ్యక్తితో వివాహం ఏమిటని పెద్దలు మందలించారని.. జంగారెడ్డిగూడెం కొత్తపేట ఇందిరాకాలనీలో నివాసం ఉండే నగరపు సింహాద్రి, అప్పాయమ్మలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం విజయనగరం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలలో శిరీష (19) ఆఖరి సంతానం. హైస్కూల్ వరకూ చదువుకుని తరువాత మానేసి ఇంటివద్దనే ఉంటోంది. కాలనీలో నివాసం ఉండే సూరిబాబు అనే తాపీమేస్త్రీతో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే సూరిబాబు పది నెలల క్రితం వేరే పెళ్లి చేసుకున్నాడు. తనకు అతనితోనే పెళ్లి జరిపించాలని యువతి పట్టుబట్టింది. తల్లిదండ్రులు.. అతనికి పెళ్లైపోయింది నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి అతనితో పెళ్లి వద్దూ అని పలుమార్లు చెప్పి చూశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఏమైందో ఏమో తెలీదు కానీ తల్లిదండ్రులు పనికి వెళ్లాక యువతి తాడుతో ఇంట్లోనే ఉరి వేసుకోగా స్థానికులు చూసి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించగా పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు తరలించాలని చెప్పడంతో అక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్లారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం చేశారు. ఈమె సాయంత్రం సమయంలో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. జంగారెడ్డిగూడెం ఎస్సై కె.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.