జంగారెడ్డిగూడెం : దళిత బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీఎస్పీ జె.వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 14 సంవత్సరాల బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఆమె తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 19న బాలిక తల్లి తన కూతురు, మరో స్నేహితురాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందని, మరొక బాలిక 22వ తేదీన రాగా, ఆమె తల్లితండ్రులకు అప్పగించామన్నారు. అయితే శుక్రవారం తన బాలికపై అత్యాచారం జరిగిందని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
18న పట్టణానికి చెందిన ఆటోపై కూరగాయలు రవాణా చేసే గండ్రోతు లక్ష్మణ్ ఇద్దరు బాలికలను తాడేపల్లిగూడెం తీసుకువెళ్లి అందులో ఒక బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంచాడని, మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందన్నారు. మరో బాలికపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేశాడని, అతని స్నేహితుడు తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన బాలిక తిరిగి జంగారెడ్డిగూడెం వచ్చిందని, దీంతో ఆమెను తల్లితండ్రులకు అప్పగించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గండ్రోతు లక్ష్మణ్, శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిపై పోక్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అఫెన్సెస్ చట్టం) కింద , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తాను దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీ సూర్యచంద్రంపై బాలిక తల్లి ఫిర్యాదు చేశారని దానిపై శాఖాపరమైన విచారణ చేస్తామన్నారు.
ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు
బాలిక తల్లి విలేకరులతో మాట్లాడుతూ గండ్రోతు లక్ష్మణ్ ఆరు నెలలుగా తన కూతురుపై అత్యాచారం చేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. తన కూతురికి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టాడని, తన కూతురిపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేయడమే కాకుండా తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా అత్యాచారం చేశాడని వివరించారు. ఈ నెల 18వ తేదీన తన కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు సక్రమంగా స్పందించలేదని పేర్కొంది. హెచ్‌సీ సూర్యచంద్రం తనను అవమాన పరిచి అసభ్యకర పదజాలంతో తిట్టారని పేర్కొన్నారు. శుక్రవారం తన కూతురిపై జరిగిన అత్యాచార ఘటన, హెచ్‌సీ సూర్యచంద్రంపైనా పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రతులను జిల్లాకలెక్టర్‌కు, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రులకు పంపినట్టు తెలిపారు.
దళిత బాలికపై అత్యాచారం
Published Sat, Sep 26 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement