జంగారెడ్డిగూడెం : భార్య ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు ఆదివారం తెల్ల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మొదటి భార్య తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం టి.నరసాపురం మండలం వెంకటాపురానికి చెందిన తిరుక్కొవళ్లూరు రమేష్ ఆదివారం తెల్లవారుజామున రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి రమేష్ మొదటి భార్య ప్రసన్న లక్ష్మి, ఆమె తల్లిదండ్రులు వందవాసు మర్రీదురావు, అచ్చమాంబదేవీలు రమేష్, అతని తల్లిదండ్రులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది.
2016లో పెళ్లి
ప్రసన్న లక్ష్మి తల్లిదండ్రులది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నార్లు వల్లూరు. వారు తమ కుమార్తెను 2016లో టి.నరసాపురం మండలం తిరుక్కొవళ్లూరు రమేష్‌కిచ్చి వివాహం జరిపించారు. పెళ్‌లైన కొంత కాలానికి ప్రసన్నలక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో రమేష్ పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో రమేష్‌కు మరో పెళ్లి చేస్తున్నారనే విషయం తెలిసి రమేష్ అతని, తల్లిదండ్రులను ప్రశ్నిస్తే ప్రసన్నలక్ష్మికి మానసిక స్థితి సరిగా లేదని, అందుకే తమ కుమారుడికి మరో పెళ్లి చేస్తున్నామని సమాధానమిచ్చారు. దీంతో తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఈ నెల 3న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌లో ప్రసన్నలక్ష్మి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా పెళ్లికి సిద్ధం కావడంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గోకుల పారిజాతగిరిలో పెళ్లి చేస్తున్నారని తెలిసి వచ్చి అడ్డుకున్నారు.
దీంతో రమేష్ తల్లిదండ్రులు ప్రసన్నలక్ష్మి తల్లిదండ్రులతో ఘర్షణకు దిగారు. ఈ సమయంలో కొత్త వధూవరులను వెంకటాపురానికి తరలించారు. దీంతో ప్రసన్న లక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు వెంకటాపురం వెళ్లి రమేష్, అతని తల్లితండ్రులు, బంధువులను నిలదీశారు. ఈ సమయంలో జరిగిన ఘర్షణలో ప్రసన్నలక్ష్మి తల్లితండ్రులు, బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసన్నలక్ష్మికి స్థానిక మహిళా సంఘాలు, సీఐటీయూ నాయకురాలు ఎస్‌కే సుభాషిని, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆరేషా దుర్గా, డీహెచ్‌పీఎస్ నాయకురాలు ఎస్‌కే షలీమా మద్దతు పలికారు. దీనిపై ఎస్సై జీజే విష్ణువర్థన్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరుగుతున్న పెళ్లిని అడ్డుకునేందుకు వచ్చిన ప్రసన్నలక్ష్మి బంధువులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ వివాదంపై టి.నరసాపురం పోలీస్‌స్టేషన్లో ఇది వరకే కేసు నమోదైనట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment