జంగారెడ్డిగూడెం రూరల్ :అత్తింటివారు వరకట్న వేధింపులకు గురిచేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఒక వివాహిత జంగారెడ్డిగూడెంలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. ఈమెకు బంధువులతో పాటు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. లక్ష్మీభారతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన జరుగుతున్న సమయంలో భర్త రామ్మోహన్ ఇంట్లో లేరు. దీంతో అత్తమామలైన కేశనపల్లి రంగారావు, రత్నకుమారిలతో లక్ష్మీభారతి బంధువులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి..
బయ్యనగూడెంకు చెందిన కంభంపాటి వెంకటేశ్వరరావు కుమార్తె లక్ష్మీభారతి, జంగారెడ్డిగూడెంకు చెందిన కేశనపల్లి రంగారావు కుమారుడు రామ్మోహన్‌కు 2012 మార్చి 9వ తేదీన వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.15లక్షలు కట్నం అడిగారని, అయితే తాము రూ.5లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెప్పి అంతే ఇచ్చామని లక్ష్మీభారతి సోదరుడు తాతారావు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని నెలలు తరువాత భర్త, అత్తమామలు లక్ష్మీభారతిని తరచూ కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. భోజనం కూడా పెట్టకుండా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తూ వచ్చారని పేర్కొన్నారు. లక్ష్మీభారతిని పుట్టింటికి వెళ్లిపోమని అనేకమార్లు వేధిస్తూ ఇంటి నుంచి పంపించివేశారని ఆరోపించారు.
రూ. 10లక్షల రూపాయలు తీసుకువస్తే కాపురం ఉంటుందని, లేనిపక్షంలో తమ కుమారుడికి వేరొకరితో వివాహం చేస్తామని అనేకమార్లు అత్తమామలు బెదిరించి లక్ష్మీభారతిని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. దీంతో సంవత్సర కాలంగా లక్ష్మీభారతి పుట్టింటిలోనే ఉండిపోయిందని, అనేకమార్లు ఆమెను తీసుకువెళ్లాలని కోరినా స్పందన లేదని బంధువులు తెలిపారు. దీంతో తాము ఇలా నిరసనకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీభారతి మాట్లాడుతూ తమకు వివాహం జరిగిన నాటి నుంచి తన భర్త, అత్తమామలు అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. గదిలో నిర్భంధించి కొట్టేవారని పేర్కొంది. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో తనను అనేక విధాలుగా చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ వేడుకొంది. పెద్దల సమక్షంలో ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
న్యాయం చేయాలంటూ వివాహిత ఆందోళన
Published Tue, Apr 21 2015 4:34 AM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM
Advertisement
Advertisement