జంగారెడ్డిగూడెం : ఏజెన్సీ మూడు మండలాల్లో గత ఏడాది ఆర్తీ స్వచ్ఛంద సేవా సంస్థ సికిల్‌సెల్ అనీమియాపై సర్వే చేసి అనేకమందికి రక్తపరీక్షలు నిర్వహించింది. దానికి సంబంధించిన నివేదికను కనీసం వైద్యాధికారులు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాధిపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో అనీమియా కాకుండా తలసేమియా, సెప్టోమేసియా, జువైనల్ డయాబెటిక్ కేసులు కూడా అత్యధికంగా నమోదు అవుతున్నట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యాధిన బారిన పడేవారు ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు.
పౌష్టికాహార లోపమే కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాలు, అమృతహస్తం, హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్‌లు ఏర్పాటు చేసి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా ఇంకా రక్తహీనతతో ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో కూడా సికిల్‌సెల్ అనీమియా లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయూంలో జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రోగాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకునేవారు. దీనికోసం ప్రత్యేక కమిటీలు వేసి నిధులు కూడా కేటాయించారు. అయితే ఈ కార్యక్రమం అమలుపై దృష్టి సారించే అధికారులు కానరావడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు రక్తహీనతతో బాధపడే వారికి సరైన పరీక్షలు జరిపించి అది ఏ వ్యాధో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని పేరు జి.నాగదుర్గాదేవి. కొయ్యలగూడెం మండలం పిడకప్పగూడెంకు చెందిన నాగదుర్గాదేవి బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు 9వ తరగతిలోనే సికిల్‌సెల్ అనీమియా వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఆమెకు ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నప్పటికీ ఇటీవల కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మందులు మానివేసినట్టు దుర్గాదేవి చెప్పింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి మల్లీశ్వరి కూలి చేస్తేనే గాని ఇల్లు గడవదని, సొమ్ములు చెల్లించలేక మందులు మానివేసినట్టు చెప్పింది. అయితే ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆమెకు నచ్చజెప్పి మందులు సక్రమంగా వాడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ యువకుడి పేరు పాయం నవీన్ (16) బుట్టాయగూడెం మండలం లంకపాకలకు చెందిన యువకుడు కేఆర్‌పురం గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివేవాడు. ఇతనికి చిన్నతనం నుంచి సికిల్‌సెల్ అనీమియా ఉందని తల్లి నూతన తెలిపారు. నవీన్‌ను మద్రాసు ఆసుపత్రిలో చేర్పించి ఖరీదైన వైద్యం చేయించామని తెలిపారు. ప్రతి రెండు నెలలకొకసారి రక్తాన్ని మార్పిడి చేసినట్టు తెలిపారు. 2014 డిసెంబర్ నెలలో తన బిడ్డ నవీన్‌కు మలేరియా, కామెర్లు రావడంతో మృతిచెందినట్టు ఆమె తెలిపారు. బిడ్డ ఆరోగ్య స్థితి బాగుపడుతుందని రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినప్పటికీ తమకు దక్కకుండా పోయినట్టు ఆమె కన్నీటి పర్యంతం అయింది.
ఈ బాలుడి పేరు గంజి శ్రీను(14). బుట్టాయగూడెం అంబేద్కర్‌నగర్‌కు చెందిన శ్రీను సికిల్‌సెల్ అనీమియా బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆ బాలుడిని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ఆసుపత్రులలో చేర్పించి వైద్యం అందించేలా కృషి చేశామన్నారు. కాకినాడలోని ఆసుపత్రిలో చేర్పించి మూడు నెలల పాటు వైద్యం అందించినట్టు తెలిపారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో కూడా నెలరోజులు వైద్యం చేయించామన్నారు. ఇందుకోసం రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆ వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ కనీసం పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో ఇంటి వద్దే ఉంచామని, ప్రమాదశావత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందినట్టు తండ్రి వెంకటరావు తెలిపారు.
మన్యంలో సి‘కిల్’సెల్
Published Fri, Feb 6 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement
Advertisement