సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తాజాగా ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్‌లో సికిల్ సెల్ ఎనీమియాను సంపూర్ణంగా తుడిచిపెట్టేందుకు కార్యాచరణ ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం అమలుకు నోచుకుంటే ఈ వ్యాధి మరో పాతికేళ్లలో కనుమరుగు కావడం తథ్యమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ సికిల్ సెల్?
మానవ శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యతగా సికిల్‌సెల్‌ను పేర్కొంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి. ఈ వ్యాధికి గురైనవాళ్లలో ఎర్రరక్త కణాలు ప్రత్యేకమైన సికిల్ (కొడవలి) రూపాన్ని సంతరించుకుంటాయి. అవి సాధారణంగా 125 రోజులు బతకాల్సి ఉండగా 25 రోజుల్లోపే చనిపోతాయి. న్యుమోనియా, తీవ్రమైన కీళ్లనొప్పులు, అవయవాల వాపులు, స్ట్రోక్... వంటివి వ్యాధి లక్షణాల్లో కొన్ని. సరైన చికిత్స చేయనట్లయితే శరీరంలోని పలు అవయవాలను ఇది దెబ్బతీస్తుంది. ఇటీవల జాతీయ ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నారు.
సరైన అవగాహనలేక, గుర్తించడంలో ఆలస్యం వల్ల అనేకమంది బాధితులుగా మారుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలవారు, ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వెద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకలు సాగించేవారు కూడా ఎక్కువే.
మంచి నిర్ణయం..
వచ్చే 2047కల్లా సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. దీనిలో భాగంగా ఈ వ్యాధికి అత్యధికంగా గురయ్యే ఆదివాసీ ప్రాంతాల్లో 0–40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 7 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం వ్యాధి నిర్మూలనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్ఛంద సేవలు అందిస్తున్న మా సొసైటీ ఈ మిషన్ అమలులో ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది.
– చంద్రకాంత్ అగర్వాల్, అధ్యక్షుడు, తలçమియా సికిల్‌సెల్ సొసైటీ.
మేనరికపు వివాహాలు కూడా కారణమే
తండాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు, దగ్గర బంధువుల్లో వివాహాలు కూడా కారణమే. ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, అవగాహన పెంచడం, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహదపడతాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసిందని భావిస్తున్నాం.
– డాక్టర్ కె.సి గౌతమ్‌రెడ్డి, కన్సల్టెంట్ అంకాలజిస్ట్ అమోర్ అసుపత్రి.
Comments
Please login to add a commentAdd a comment