సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజ్‌భవన్‌కు కాషాయ రంగు పులిమేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తి చూపేందుకు అవసరమైతే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చర్చ పెడదాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతిని అసెంబ్లీ వేదికగా చాటి చెబుదాం..’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో 2022–23 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
గవర్నర్ వ్యాఖ్యలు అర్థరహితం
‘నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన సమావేశాలు నిరవధికంగా వాయిదా పడక పోవడంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు వాటికి కొనసాగింపుగా జరుగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. విభజన హామీలౖపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, రాష్ట్రంపై చూపుతున్న వివక్షను అసెంబ్లీ వేదికగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..’అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలి
శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు, విపక్షాలు లేవనెత్తేందుకు అవకాశం ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించారు. ఇటీవలి కాలంలో వివిధ వేదికల మీద మాట్లాడుతున్న అంశాలనే అసెంబ్లీ వేదికగా విపక్షాలు ప్రస్తావించే అవకాశమున్నందున.. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల్లో పూర్తి సమాచారంతో సమాధానాలు, చర్చకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీని ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు, చర్చకు వచ్చే అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
సభ ప్రారంభం కాగానే బడ్జెట్ ప్రసంగం
రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30కి ప్రారంభం కానుండా, గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో నేరుగా బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను, ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. రెండో శాసనసభలో అసెంబ్లీ సమావేశాలు సగటున 9 రోజుల పాటు జరగ్గా, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో సమావేశాలు ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18 లేదా 24వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
గవర్నర్ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కలిగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కుతూ ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పురోగతిని చాటి చెప్పేందుకు అసెంబ్లీనే అసలైన వేదిక. బడ్జెట్‌తో పాటు వివిధ సందర్భాల్లో జరిగే చర్చల్లో ఇందుకు సంబంధించిన గణాంకాలతో సహా సభకు వివరించాలి.– సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment