సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్ (బలమైన రాజకీయవేత్త). రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. గవర్నర్‌గా నా నాలుగేళ్ల పదవీ కాలానికి ముందు అలాంటి సీఎంను చూడలేదు. ఆయన్ను చూసిన తర్వాత ఎన్నో విషయాలు నేర్చుకున్నా. చాలా అంశాలను పరిశీలించా. నేర్చుకోవడానికి చాలా దొరికింది..’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
‘సీఎం కేసీఆర్‌తో పనిచేస్తే దేశంలో ఏ సీఎంతోనైనా పనిచేయగలుగుతా, నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు..’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు కట్టుబడి ఉంటారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. అప్పట్లో అనుమానాలుండడంతో అలా చెప్పినట్టు వివరించారు. తాను పదేపదే పాత వివాదాల్లోకి వెళ్లాలనుకోవడం లేదని, కొంత సత్సంబంధాలు అవసరమని అన్నారు.
ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు. కేంద్రంతో సత్సంబంధాలు అవసరమని అన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఐదో ఏడాదిలో అడుగిడుతున్న సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్ బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. జాతీయ విద్యా విధానంపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చారు.
తెలంగాణలో కొన్ని పథకాలు చాలా భేష్
‘తెలంగాణలో కొన్ని పథకాలు చాలా బాగున్నాయి. అయితే తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటైనందున, ఆ ఆకాంక్షలన్నీ నెరవేరేలా ప్రభుత్వం కష్టపడి పనిచేయాలి. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరాన్ని ఎన్నడూ చూడలేదు. రెండూ చాలా దగ్గరగానే ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో నేను కొలిచి చూడను. ప్రతి విషయంలో నేను వేలు పెట్టను. కొన్ని సార్లు ప్రభుత్వం నుంచి మద్దతు లభించి, మరికొన్ని సార్లు లభించకపోయినా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నా. ప్రభుత్వం నుంచి నాకు ఆహా్వనం ఉంటే గౌరవించి వెళ్తా.
ఆర్టీసీ బిల్లుపై త్వరలో నిర్ణయం
విభేదాలతో బిల్లులను పాస్ చేయట్లేదన్నది పూర్తిగా అవాస్తవం. నేను బిల్లులన్నీ చదివి న్యాయ సలహా తీసుకుంటా. చిన్న లోపం ఉన్నా సరిచేయాలని కోరతా. కొన్ని బిల్లులు పాస్ అయ్యాయి. కొన్ని బిల్లుల్లో లోపాలుంటేనే పాస్ చేయలేదు. ఆర్టీసీ బిల్లుపై కొన్ని అనుమానాలుంటే నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరా. ఆ బిల్లు గురువారం న్యాయశాఖ నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చింది. పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటా. ప్రజల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే నా ధ్యేయం. నాకంటూ ఓ భావజాలం ఉన్నా వివక్షతో వ్యవహరించడం లేదు. ఒకవేళ నేను ప్రభుత్వంతో పోరాటం చేసినా అది ప్రజల కోసమే. నా సలహాలను సానుకూల దృక్పథంతో చూడాలి..’ అని తమిళిసై సూచించారు.
కోర్టు కేసులతో కట్టడి చేయలేరు
‘నేను సవాళ్లకు, ప్రతిబంధకాలకు భయపడను. కోర్టు కేసులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలు, కువిమర్శలతో నన్ను కట్టడి చేయలేరు. ఈ సవాళ్లను అధిగమించి రాజ్యాంగ పరిరక్షకురాలిగా నా విధులు, బాధ్యతలను నిర్వర్తిస్తా. ప్రజల విజయమే నా విజయం. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా. తెలంగాణ ప్రజలతో నా బంధం అసాధారణమైనది. సవాళ్లు ఎదురైనా ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని బలంగా కోరుకుంటున్నా. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించే విషయంలో దైవ నిర్ణయాన్ని అనుసరిస్తా. అయితే నాకు రిటైర్మెంట్ అనే పదం నచ్చదు. ప్రజాసేవను కొనసాగిస్తా. ఎక్కడున్నా తెలంగాణ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తా. నేను పుట్టింది, తెలంగాణ ఆవిర్భవించింది ఒకే రోజు..’ అని గవర్నర్ గుర్తుచేశారు
పుదుచ్చేరిలో ప్రతినెలా ప్రజా దర్బార్
‘నేను ఏ పనిని ప్రారంభించినా పుదుచ్చేరి సీఎస్ అన్ని రకాలుగా విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తారు. పుదుచ్చేరిలో 20 మంది ఐఏఎస్ అధికారులతో పనిచేయిస్తున్నా. అక్కడ ప్రతి నెలా 15న రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. అన్ని శాఖల అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడికి వచ్చే ప్రజలను కలుసుకుంటారు. ఇక్కడ అలా చేస్తే రాజకీయంగా చూస్తారు. తెలంగాణలో నేను ఎక్కడికైనా వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు..’ అని అన్నారు.
వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలి
‘తెలంగాణ వైద్య రంగానికి హబ్‌గా మారిందనడంతో నేను విభేదించను. రాష్ట్రం బాగానే పనిచేసింది. కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులోకి ఉండాలి. కొన్ని ఆస్పత్రులు మెరుగైనా, ఇంకా కొన్ని మెరుగు కావాల్సి ఉంది. నేను ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్లి చూస్తే చాలా సమస్యలు కనిపించాయి. ఆయుష్మాన్ భారత్, ఇతర గ్రామీణాభివృద్ధి పథకాలు ప్రజలకు అనుకున్నంతగా చేరడం లేదు..’ అని చెప్పారు.
పరిశీలనలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం
‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యరి్థత్వాన్ని నిర్దిష్ట అర్హతలుంటే ఎలాంటి సంకోచం లేకుండా ఆమోదిస్తా. ఇందుకు కొన్ని అర్హత ప్రమాణాలుంటాయి. గతంలో సామాజిక సేవ కేటగిరీలో ఒకరి అభ్యరి్థత్వానికి అర్హతలు లేకుంటే ఆమోదించలేదు. ప్రభుత్వం అతని స్థానంలో మరొకరిని ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదించా. ప్రతిపాదనల పరిశీలనకు కొంత సమయం కావాలి. తక్షణమే ఎవరూ ఆమోదించరు. జాప్యం చేయాలనేది ఉద్దేశం కాదు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి..’ అని గవర్నర్ తెలిపారు.
సనాతన ధర్మంలో మంచి విషయాలూ ఉన్నాయి
‘సనాతన ధర్మాన్ని గణనీయ సంఖ్యలో ప్రజలు అనుసరిస్తున్నారు. ఆ వర్గం వారిని అవమానించడం తగదు. సనాతన ధర్మం అంటే కేవలం కులాల విభజన మాత్రమే కాదు. ఇంకా చాలా మంచి అంశాలూ ఉన్నాయి. రాజకీయ ప్రయోజనం కలుగుతుందని 50 ఏళ్లుగా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీపావళి, కృష్ణ జయంతి వంటి హిందూ పండుగలకు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలపరు..’ అని విమర్శించారు.
జమిలి ఎన్నికలు, ‘భారత్’ పేరుకు మద్దతు
జమిలి ఎన్నికలతో వ్యయం తగ్గుతుందని, పొదుపు చేసిన డబ్బుతో అన్ని రాష్ట్రాల్లో విద్యకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించవచ్చని తమిళిసై అన్నారు. మహిళా బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ఎప్పటినుంచి మాట్లాడుతున్నారో తనకు తెలియదని, కానీ మహిళగా తాను ఎప్పటినుంచో ఆ బిల్లుకు మద్దతిస్తున్నానని చెప్పారు. దేశం పేరును భారత్‌గా మార్చే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు మద్దతు తెలిపారు. తమిళంలో భారతదేశం అనే అంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment