సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారుకావడంతో.. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. ఆర్థికశాఖ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గత బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువగా 2022–23 బడ్జెట్ ఉంటుందని, రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.45 లక్షల కోట్ల మధ్య ప్రతిపాదనలు ఉండవచ్చని సమాచారం. ఇందులో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2021–22 బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కేంద్రం నుంచి రూ.38వేల కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా.. ఇప్పటివరకు అందులో కనీసం 20 శాతం కూడా రాలేదు. అంటే ఈ ఒక్క పద్దులోనే దాదాపు 30వేల కోట్ల లోటు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఈసారి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును బాగా తగ్గించనున్నట్టు సమాచారం. ఇక గత బడ్జెట్ అంచనాలకు కొంచెం అటూ ఇటుగా రెవెన్యూ ఖర్చును చూపెట్టనున్నారని, పన్నేతర ఆదాయం కూడా భారీగానే ప్రతిపాదించనున్నారని తెలిసింది. భూముల అమ్మకాలు, మైనింగ్ విధానంలో మార్పులతోపాటు పలు ఇతర అంశాల్లో పన్నేతర ఆదాయం పెరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు గత బడ్జెట్‌లో రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ పద్దుల కింద వేసుకున్న అంచనాల్లో.. దాదాపు 95 శాతం వరకు సమకూరే పరిస్థితి ఉందని అంటున్నాయి. దీనితో ఈసారి అంచనాలు పెంచి.. రిజిస్ట్రేషన్ల పద్దు కింద రూ.18వేల కోట్లు, ఎక్సైజ్ పద్దు కింద రూ.20 వేల కోట్లు ఆదాయం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నాయి.
ప్రజాకర్షకంగా..!
ఈసారి బడ్జెట్‌ను ప్రజాకర్షక కోణంలోనే ప్రతిపాదిస్తారని, ప్రస్తుత సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దళితబంధు పద్దు కింద రూ.15 వేల కోట్ల వరకు చూపవచ్చని.. ఇతర వర్గాల నుంచి విమర్శలు రాకుండా బీసీలు, సంచార జాతుల కోసం కొత్త పథకాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. మైనార్టీ బడ్జెట్‌ను కూడా పెంచుతారని, వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తారని తెలిసింది.
గవర్నర్‌కు కాగ్ నివేదిక..
2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర పద్దులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికలు సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందాయి. 7న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికలను అసెంబ్లీ, మండలి ముందు ప్రవేశపెట్టనున్నారు.
Telangana: బడ్జెట్ రూ.2.45 లక్షల కోట్లు?
Published Tue, Mar 1 2022 3:43 AM | Last Updated on Tue, Mar 1 2022 3:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment