సాక్షి, హైదరాబాద్: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో 2023–24 కేంద్ర బడ్జెట్ పద్దును కనీసం రూ. 45 లక్షల కోట్లకు (2022–23 బడ్జెట్ సుమారు 39.4 లక్షల కోట్లు) పెంచాలని, అప్పుడే పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని రంగాలకు తగిన కేటాయింపులు సాధ్యమవుతాయని ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం అభిప్రాయపడ్డారు. కేంద్రం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రాధాన్యతలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే...
►వ్యవసాయ రంగానికి 2023–24 బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
►ప్రస్తుతం రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో అందిస్తున్న రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ తరహాలో ఏటా ఎకరాకు రూ. 10 వేల చొప్పున పెంచాలి.
►పన్నుల్లో రాష్ట్ర వాటాను 42 శాతం నుంచి 45 శాతానికి పెంచితేనే రాష్ట్రాల రెవెన్యూ సర్దుబాటు కష్టాలు కొంత తీరుతాయి.
►సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
►దేశంలోని రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇందుకు అయ్యే ఖర్చు రూ. 2.5 లక్షల కోట్లు మాత్రమే. ఉచిత విద్యుత్ వల్ల మెట్టప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగం.
►దేశంలో ఆర్థిక కేంద్రీకరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంపన్నులపై విధించే పురోగామి ఆదాయ పన్నును పెద్ద ఎత్తున పెంచాలి.
►పింఛన్‌దారులకు పన్ను రద్దు చేయాలి.
►గతంలో ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టాలు, సర్కారియా కమిషన్ సిఫారసుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి చర్యలు చేపట్టాలి.
►జీఎస్టీ ఎగవేతను నిరోధించి చేనేత లాంటి వాటిని మినహాయించాలి.
►జీడీపీలో విద్యా రంగానికి 6 శాతం, వైద్య రంగానికి 3 శాతం కేటాయింపులు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment