సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (ఈ నెల 7న) ఉదయం 11.30 గంటల నుంచి మొదలుకానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంతో శాసనసభ ప్రారంభమవుతుంది. శాసన మండలిలో గతేడాది శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఎవరు ప్రవేశపెడతారో ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో స్పష్టత రానుంది. 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించి 9వ తేదీ (బుధవారం) నుంచి వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.
కేంద్రం వివక్షపై ప్రత్యేక చర్చ?
సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలు చర్చించాలో 7న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ నెల 17 లేదా 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం. రాష్ట్రంపై కేంద్రం వివక్షను ప్రత్యేకంగా ప్రభుత్వం చర్చించే యోచనలో ఉన్నట్లు సమాచారం. సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలపై ఆదివారం కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది.
బీజేపీ సభ్యుడిగా అసెంబ్లీకి ఈటల
టీఆర్‌ఎస్ నుంచి వరుసగా ఆరు సార్లు (2004 నుంచి 2018 వరకు) అసెంబ్లీకి ఎన్నికైన ఈటల రాజేందర్.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలిసారిగా బీజేపీ సభ్యుడిగా శాసనసభలో అడుగు పెడుతున్నారు. అలాగే, 40 మంది సభ్యులున్న శాసనమండలిలో ఇటీవలి కాలంలో వివిధ కోటాల్లో 19 మంది కొత్తగా ఎన్నికయ్యారు. వీరు మండలిలో అడుగుపెడతారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఖాళీగా ఉన్న శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నిక జరిగే అవకాశముంది. ఖాళీగా ఉన్న శాసన మండలి చీఫ్ విప్‌తో పాటు మరో మూడు విప్ పదవులూ భర్తీ కానున్నాయి.
పారదర్శకంగా సమావేశాలు: పోచారం
సభ హుందాతనాన్ని కాపాడుతూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 7 నుంచి రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నందున అసెంబ్లీ కమిటీ హాల్‌లో మండలి ప్రొటెమ్ చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీతో కలిసి స్పీకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులతో పాటు ఇతరులకు కరోనా లక్షణాలుంటే నిర్ధారించేందుకు పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందించాలని స్పీకర్ పోచారం అన్నారు.
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనున్న ఈ భేటీలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని సైతం కేబినెట్ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment