అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ బ్యారెల్ ధరలు పెరుగుతున్నందున దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం తరచూ చెప్పేమాట. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నపుడు మన దగ్గర పెట్రోల్ ధర గరిష్టంగా 80 రూపాయలు ఉండేది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయింది. ఆ మేరకు మన దగ్గర పెట్రోల్ ధర కూడా సగానికి పైగా తగ్గాలి. అంటే లీటరు ధర 40 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. కానీ మార్కెట్‌లో లీటరు రూ.75 వరకు ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇందులో మాయామర్మం ఏమిటో పాలకులకే తెలియాలి.
జంగారెడ్డిగూడెం: పెట్రోల్, డీజిల్ సమీక్షా విధానం గందరగోళంతో అమలవుతోంది. ఏరోజుకారోజు ధరలు నిర్ణయించడం అనే అంశం వినియోగదారుడికి కొంత తలనొప్పిగా మారింది. గతంలో 15 రోజులకోసారి పెట్రోల్ డీజిల్ ధరలు మారేవి. జూన్ 16 నుంచి ఏరోజు ధర ఆ రోజు మారుతోంది. ఈ మార్పు ఎలా జరుగుతుందో అర్థం కాక వినియోగదారుడు తికమకపడుతున్నాడు. ఈ విధానం ప్రకటించిన నాటి నుంచి ధరలు పైసల్లో పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 16న ప్రారంభమైన ఈ విధానంలో అప్పటికి పెట్రోల్ ధర రూ. 73.08, డీజిల్ రూ. 62.80 గా ఉంది. ఇది ఈ నెల 3వ తేదీ నాటికి పెట్రోల్ ధర రూ. 76.78, డీజిల్ రూ. 66.16కు చేరుకుంది.
సమీక్షా విధానంలో పైసల చొప్పున పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా సవరణలు జరుగుతున్నాయని ప్రకటిస్తున్నా ఇది వినియోగదారుడికి అందడంలో ప్రభుత్వాల మ్యాజిక్కులు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 తగ్గించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ బాదుడు భారీగానే ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వీటిపై సుమారుగా రూ. 10 వరకు తేడా వస్తోంది. ఈ భారాన్ని వినియోగదారుడే భరించాల్సి వస్తోంది.
బంక్‌ల మాయాజాలం
ఇదిలా ఉంటే బంక్‌లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొలతల్లో తేడా ఉండటంతో వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. నాణ్యత విషయంలో, రీడింగ్‌లో తేడా ఉండటం వంటివి జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కల్తీ కూడా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల వాహనాలు చెడిపోయి మరమ్మతులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
జిల్లాలో 279 పెట్రోల్ బంక్‌లు
జిల్లాలో ప్రభుత్వరంగ పెట్రోల్ బంకులు 279 ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 130, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ 79, హిందూస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ బంకులు 70 ఉన్నాయి. నెలలో జిల్లా మొత్తం మీద 1,05,80,000 కిలో లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. అలాగే 2,40,00,000 కిలో లీటర్ల డీజిల్‌ను వినియోగదారులు ఒక నెలలో వినియోగిస్తున్నారు. అంటే రోజు వారీ పెట్రోల్ వినియోగం 3,53,000 కిలో లీటర్లు, డీజిల్ 7,99,000 కిలో లీటర్లు వినియోగిస్తున్నారు.
ఎక్సైజ్ సుంకం తగ్గింపు
తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నెల 3న∙పెట్రోల్‌పై రూ.2, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ డీజిల్ ధరలు కొంతమేర తగ్గాయి. పన్నులతో కలిపి పెట్రోల్ రూ. 2.50, డీజిల్ రూ. 2.25 తగ్గింది. ఈ నెల 3న పెట్రోల్ ధర రూ. 76.78 ఉండగా, ప్రస్తుతం రూ. 74.24గా ఉంది. అలాగే డీజిల్ రూ. 66.16 నుంచి రూ. 63.84కు తగ్గింది.
వ్యాట్ తగ్గించండి
పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచిం చింది. ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న వ్యాట్‌ను 5శాతం తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ రాయనున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment