జోగిపేట(అందోల్): డీజిల్, పెట్రోల్ ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రభుత్వాలు మాత్రం వివిధ రకాల పన్నులు వేస్తూ దండుకుంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు వాహనదారులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తున్నా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు. జిల్లాలోని జోగిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో సుమారు 60 వరకు పెట్రోల్ పంపులు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ద్విచక్రవాహనదారులు, ఇతర వాహనాల యజమానులు పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటారు.
డీజిల్‌ను ట్రాక్టర్లతో పాటు లారీలు, జీపులు, ఇతర వాహనదారులు వినియోగిస్తారు. 2017 జూన్ నుంచి 2018 ఏప్రిల్ వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే నెలనెలా పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంలో లీటర్ పెట్రోల్‌పై రూ.10.82, డీజిల్‌పై రూ.11.89 ధర పెరిగింది. కాంగ్రెస్ హయాంలో క్రూడాయిల్ ధర బ్యారెల్ రూ.100 ఉంటే ప్రస్తుతం ఒక్కసారిగా రూ.40కి పడిపోయింది. అయినప్పటికీ పెట్రో ల్, డీజిల్ ధరలు దించడం ఎందుకని భావించిన ప్రభుత్వాలు అనేక రకాల పన్నులను పెంచాయి. దీంతో క్రూడాయిల్ రూ.68కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చకపోవడంతో 25 నుంచి 33 శాతం మేర పన్నులు వినియోగదారులు భరించాల్సి వస్తోంది. ఇదే జీఎస్టీలోకి చేర్చితే కేవలం 12శాతం పన్నులు వేసే అవకాశం ఉంటుందని, తద్వారా ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
పన్నులతోనే భారం
క్రూడాయిల్ ధరలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి ఉంటాయి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చితే ధరలు దిగి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి వేస్తున్న పన్నులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.– శ్రీనివాస్, జోగిపేట,పంపు యజమాని
Comments
Please login to add a commentAdd a comment