జంగారెడ్డిగూడెం రూరల్:జిల్లాలో మండుతున్న ఎండలతో వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండ, వేడి గాలులతో పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం 16 మంది వడదెబ్బతో ప్రాణాలు విడిచారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన వామిశెట్టి సాయిబు (68) పొలం పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కొవ్వలిలో..
కొవ్వలి (దెందులూరు) : మూడు రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు కొవ్వలిలో గొరిపర్తి గంగారత్నం(60) శుక్రవారం రాత్రి మృతిచెందినట్టు ఆమె కుమారుడు గొరిపర్తి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న గంగారత్నం వేడిగాల్పులకు తాళలేని కన్నుమూశారని చెప్పారు.
నరసాపురంలో..
నరసాపురం అర్బన్: పట్టణంలోని జవదాలవారిపేటకు చెందిన ఈదా ఆశీర్వాదం (66) శనివారం వడదెబ్బకు మృతిచెందారు. ఇంట్లో కార్యక్రమం నిమిత్తం శుక్రవారం ఆశీర్వాదం ఎండలో తిరిగారని.. అస్వస్థతకు గురైన ఆయన శనివారం ఉదయం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
పైడిచింతపాడులో..
పైడిచింతపాడు (ఏలూరు రూరల్ ): పైడిచింతపాడు గ్రామానికి చెందిన రేలంగి శామ్‌సన్ (70) వడదెబ్బకు మృతిచెందారు. మూడు రోజులుగా వీస్తున్న వడగాల్పులతో అస్వస్థతకు గురైన శామ్‌సన్‌ను శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
వడ్లపట్లలో..
భీమడోలు: మండలంలోని అంబర్‌పేట పంచాయతీ శివారు వడ్లపట్లలో శృంగవృక్షం సుబ్బారావు (74) అనే వృద్ధుడు వడదెబ్బకు మృతిచెందారు. ఆయన సొంతం పొలంలో పని చేస్తూ కుప్పకూలిపోయూరు. కొద్దిసేపటికి ఆయన కుటుంబసభ్యులు పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుర్వాయిగూడెంలో..
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంకు చెందిన దల్లి కనకరాజు (69) శనివారం వడదెబ్బ తగిలి మృతిచెందారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కనకరాజు తన ఇంట్లో మృతిచెందారు.
గోపాలపురంలో..
గోపాలపురం: గ్రామంలోని రొంగలవారి వీధికి చెందిన రొంగల అచ్చాయమ్మ (70) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం నుంచి చలాకీగా ఉన్న ఆమె సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిందని చెప్పారు.
పండితవిల్లూరులో..
పండితవిల్లూరు: గ్రామంలోని పెదపేటలో సదమళ్ల వెంకమ్మ (74) ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శనివారం మృతిచెందారు. కొద్దిరోజులుగా వడగాల్పులతో అస్వస్థతకు గురైన ఆమె కన్నుమూశారు.
చింతంపల్లిలో..
చింతలపూడి: చింతలపూడి మండలం చింతంపల్లిలో కొండారు ఆనందరావు (40) శనివారం వడదెబ్బతో మృతిచెందినట్టు వీఆర్వో వీర్రాజు తెలిపారు. ఉదయం ఏలూరు వెళ్లిన ఆనందరావు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి కుప్పకూలిపోయూడని కుటుంబ సభ్యులు తెలిపారు.
పేరుపాలెంలో..
మొగల్తూరు: మండలంలోని పేరుపాలెం గ్రామానికి చెందిన పావురాల ముత్యాలరావు (56) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు.
అప్పనవీడులో..
పెదపాడు: పెదపాడు మండలం అప్పనవీడులో మండపాటి జ్ఞానేశ్వరరావు శనివారం వడదెబ్బతో గుడివాడ రోడ్డులో అపస్మారక స్థితిలో పడిపోయి చనిపోయూరు.
మోగల్లులో..
పాలకోడేరు : మండలంలోని మోగల్లులో కొడమంచిలి గ్రేసమ్మ (60) అనే వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతిచెందారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఇంట్లో సొమ్ముసిల్లి పడి మృతిచెందారు.
మరో ఇద్దరు..
ఏలూరు(సెంట్రల్)/ పెనుమంట్ర: దెందులూరు గ్రామానికి చెందిన తెళ్ళ దమయంతి (60) శనివారం వడగాల్పులకు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఆమె మృతిచెందారు. పెనుమంట్ర మండలం పొలమూరులో శనివారం సాయంత్రం సారిపల్లి రమణమ్మ (45) అనే మహిళ వడగాల్పులతో మృతిచెందినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
గూడెంలో తాపీ కార్మికుడు..
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): పట్టణంలోని నాలుగో వార్డు గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన తాపీ కార్మికుడు కొంతల శ్రీనివాస్ (43) వడదెబ్బతో మృతిచెందారు. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం స్థానికంగా తాపీ పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యూరు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అర్ధరాత్రి సమయంలో ప్రాణాలు విడిచారు. తహసిల్దార్ పాశం నాగమణి ఆదేశాల మేరకు వీఆర్వో కృష్ణస్వామి శనివారం మృతుని కుటుంబ సభ్యులను కలిశారు. అయితే కేసు నమోదు, పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వడదెబ్బ మృతిగా అధికారులు నమోదు చేయలేదు.
దప్పికతో వృద్ధురాలు..
కొయ్యలగూడెం: వడదెబ్బ, దప్పికతో కొయ్యలగూడెంలో ఓ వృద్ధురాలు కన్నుమూసింది. వీఆర్వో అడపా రాంబాబు తెలిపిన వివరాలు ప్రకారం.. కొయ్యలగూడెం వడ్డీలపేటకు చెందిన జలశూత్రం బోదెమ్మ (65) అనే వృద్ధురాలు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామ శివారున ఉన్న జయప్రద హాస్పటల్ వద్దకు కాగితాలు ఏరుకునేందుకు వెళ్లి వడదెబ్బ బారిన పడ్డారు. దప్పిక తీర్చుకునేందుకు సమీపంలోని సీసాలో ఉన్న మడ్డి ఆయిల్ తాగి ఆమె మృతిచెందినట్టు పోలీసులు, రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకేరోజు 16 మంది మృతి
Published Sun, May 24 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement
Advertisement