జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీలో తృటిలో ఎన్‌కౌంటర్ తప్పింది. ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ చంద్రన్న వర్గం దళ సభ్యులు సుమారు 10 మంది సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. నిఘా విభాగం సమాచారం మేరకు బుట్టాయగూడెం మండలంలో చంద్రన్న వర్గందళ సభ్యులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు గత నెల 29న రాత్రి ప్రత్యేక బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామంలో అర్ధరాత్రి తనిఖీలు చేశారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో దళ సభ్యులు ఉన్నారని తెలుసుకుని సాయుధ బలగాలు విసృ్తత కూంబింగ్ జరిపాయి. అదే సమయంలో ఉప్పరిల్ల అటవీప్రాంతంలో 9 మంది చంద్రన్న వర్గం దళ సభ్యులు రహస్య స్థావరంలో మకాం వేసినట్టు పోలీసులకు ఉప్పందింది. 9 మంది దళ సభ్యుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు.
ఆ సమయంలో దళ సభ్యులంతా నిద్రిస్తుండగా ఒకరు మాత్రం కాపలా కాస్తున్నట్టు తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులను కాపలా కాస్తున్న దళ సభ్యుడు గుర్తించి దళంలోని మిగతా వారందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో వారంతా కిట్ బ్యాగ్ ఆయుధాలను ధరించి గుంపుగా కాకుండా విడివిడిగా తలో వైపునకు తప్పించుకున్నట్టు సమాచారం. పోలీసులు ఆప్రాంతమంతా గాలించి వెనక్కి వచ్చినట్టు తెలిసింది. కూంబింగ్ చేస్తున్న పోలీసులు దళం ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉంటే పెద్ద ఎన్‌కౌంటరే జరిగి ఉండేదని చెబుతున్నారు.
ముగ్గురి అరెస్ట్ : బుట్టాయగూడెం : అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు బుధవారం తెలిపారు. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన దళ కమాండర్ పల్లాల ప్రకాష్‌రెడ్డి, కొరియర్లుగా పనిచేస్తున్న మడకం రామారావు, నడపన సోమరాజు పట్టుబడ్డారని చెప్పారు. ఈ నెల 1వ తేదీన రాత్రి బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం ఉప్పరిల్లలో చంద్రన్న వర్గం దళ సభ్యులు సంచరిస్తున్నట్టు సమాచారం అందటంతో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఇన్‌చార్జి, ఆర్‌ఎస్‌ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపారన్నారు. పోలీసులను చూసి కొంతమంది పారిపోయారని, ప్రకాష్‌రెడ్డి, రామారావు, సోమరాజు పట్టుబడ్డారని తెలిపారు. వారినుంచి ఒక నాటు తుపాకీ, 6 రౌండ్ల బుల్లెట్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
తృటిలో తప్పిన ఎన్‌కౌంటర్!
Published Thu, Mar 3 2016 12:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement