జంగారెడ్డిగూడెం: జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ వెల్లడించారు. శనివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీల్లో భాగంగా సబ్‌డివిజన్ పరిధిలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది కన్నా ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. ఆస్తి చోరీలు 31 శాతం వరకు తగ్గాయన్నారు. అలాగే హౌస్ బ్రేకింగ్, డెకాయిట్ నేరాలు కూడా తగ్గినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కూడా 26 శాతం మేరకు తగ్గాయని, రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య కూడా తగ్గినట్టు చెప్పారు. అయితే కొద్దిమేర హత్య కేసులు పెరిగాయని ఎస్పీ తెలిపారు. ఫోక్స్, మహిళలపై వేధింపులు, అత్యాచారం కేసులు 25 శాతం మేర తగ్గినట్లు తెలిపారు.
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని రవిప్రకాష్ తెలిపారు. గల్ఫ్ దేశాలకు పంపుతామనే మోసం కేసులు కూడా తగ్గాయన్నారు. ఇక ఫోక్స్ చట్టం కిందకు వచ్చే కేసులు జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో ఎక్కువగా ఉన్నాయన్నారు. అత్యాచార కేసులు కూడా ఎక్కువయ్యాయన్నారు. తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో 95 శాతం కేసుల్లో 60 శాతం మైనర్ బాలికలపై అత్యాచారం కేసులు ఉన్నాయన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా రెండు కేసుల్లో ఉంటే సదరు ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రతిపాదన చేశామన్నారు.
ఐదు చెక్ పోస్టుల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. టి.నరసాపురంలో ఒకటి, చింతలపూడి మండలంలో రెండు, జీలుగుమిల్లిలో ఒకటి, కుక్కునూరులో ఒకటి చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నగదు, మద్యం రవాణాపై దృష్టిసారించామన్నారు.
ఏజెన్సీలో కూంబింగ్
పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల రాకపోకలు అరికట్టేందుకు న్యూడెమోక్రసీ దళాల కార్యకలాపాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా మావోయిస్టులు పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాగే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపహాడ్ ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్ జోన్‌లుగా ఉపయోగపడుతున్నాయని, దీనిపై గట్టి నిఘా పెట్టామన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద అదనంగా మరో రెండు పార్టీల సాయుధబలగాలను మోహరించామని తెలిపారు. మొత్తం 200 మందికి వరకు సాయుధ పోలీసులు పోలవరం ప్రాజెక్టు చుట్టూ పహారా కాస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ గార్డ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏపీ ఎస్పీ, ఏఆర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీఐపీలు ప్రయాణించే అన్ని రోడ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
900 సీసీ కెమేరాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో 900 సీసీ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సీసీ కెమేరాల ఏర్పాట్లు త్వరితగతిన సాగుతున్నాయన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఉంటుందని, అది ఎస్పీ కార్యాలయానికి కూడా అనుసంధానం అవుతుందన్నారు. జనవరి కల్లా 900 కెమేరాల ఏర్పాట్లు పూర్తవుతుందని చెప్పారు. ఇవికాక ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 సీసీ కెమేరాలు పనిచేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఆయా ప్రధాన షాపింగ్‌మాల్స్ వద్ద అపార్ట్‌మెంట్‌లలో కొన్ని సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయన్నారు. సంఘ వ్యతిరేక శక్తులపైనా, కార్యకర్తలపైనా గట్టినిఘా ఏర్పాటు చేశామన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేకాట, గుండాట, కోడిపందాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ రెండు చోట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌వో పోలీస్ స్టేషన్‌లు ఉండేలాగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు ఈ స్టేషన్‌లలో పనిచేస్తారన్నారు. జిల్లాలో పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణం, ఆధునికీకరణ, సర్కిల్ కార్యాలయాలు, క్వార్టర్ల నిర్మాణం వరుస క్రమంలో చేపట్టామన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తైందని, త్వరలో ప్రారంభిస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment