జంగారెడ్డిగూడెం : రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం వేలాది కుటుంబాలు దరఖాస్తులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 33 వేల మంది తమ రేషన్ కార్డుల్లో వివిధ రకాల చేర్పులు, మార్పులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా నెలల తరబడి ఎదురుచూస్తున్నా సవరణలు నమోదుకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిపేరు, వ్యక్తి పేరు, పుట్టిన తేదీ తదితర అంశాల్లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సవరింప చేసుకునే అవకాశం ఉంది. రేషన్‌కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఎవరైనా మృతిచెందితే ఆ పేరు తొలగించుకునేందుకు, కొత్తగా మరో పేరు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి సవరణల కోసం ఈ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు తహసిల్దార్ కార్యాలయానికి వెళుతుంది.
సంబంధిత వీఆర్వో, సివిల్ సప్లైస్ డీటీ, తహసిల్దార్ విచారణ జరిపి ఆమోదించాలి. అలా ఆమోదించిన రేషన్‌కార్డు తిరిగి మీ-సేవ కేంద్రానికి చేరుతుంది. అక్కడి నుంచి కార్డును పొందవచ్చు. కొత్తగా ఎవరి పేరైనా నమోదు చేసుకోవాలంటే మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది తహసిల్దార్ కార్యాలయం నుంచి సివిల్ సప్లైస్ కమిషనర్ ఆమోదం కోసం వెళుతుంది. అక్కడ ఆమోదం పొందిన తరువాత తహసిల్దార్‌కు చేరుతుంది. ఇలా చేర్పులు, మార్పులు చేసిన పాత రేషన్ కార్డులను మార్చి, కొత్త కార్డులపై తహసిల్దార్ డిజిటల్ సంతకం చేయా ల్సి ఉంటుంది. సంతకం అనంతరం మీ-సేవ కేంద్రం ద్వారా కొత్త రేషన్ కార్డు ఇస్తారు.
ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో కొన్ని నెలలుగా దరఖాస్తు చేసుకున్న వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 33 వేల మంది కార్డుదారులకు సవరణలతో కూడిన కొత్త కార్డులు ఇప్పటికీ అందలేదు. ఏదైనా పథకానికి సంబంధించి స్థానికతకు రేషన్‌కార్డు అవసరం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులను అడిగితే తామేమీ చేయలేమని, వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని, సర్వర్ పనిచేయడం లేదని సమాధానమిస్తున్నారు. రేషన్ కార్డుల్లో సవరణల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్చడం, రేషన్ కార్డులో గ్యాస్ వివరాల మార్పు, డూప్లికేట్ కార్డుల జారీ, కార్డు మరో ప్రాంతానికి బదిలీ తదితర 11 రకాల సేవల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో వాటిని పరిష్కరిం చాల్సి ఉన్నా.. అధికారులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇటీవల జన్మభూమి సభల్లో జారీ చేసిన కొత్త కార్డుల్లోనూ తప్పులు అధికంగా ఉండటంతో మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చాలా మందికి రేషన్ కార్డులను ఫొటోలు లేకుండా ఇచ్చారు. గత నవంబర్ నుంచి సర్వర్లు సరిగా పనిచేయక దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మార్చరు.. చేర్చరు
Published Fri, Mar 18 2016 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement