కామాంధుడి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహతృ్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
జంగారెడ్డిగూడెం : కామాంధుడి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహతృ్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ ఎ.ఆనందరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని తాడువాయికి చెందిన పగిళ్ల శైలజ (35)కు 11 ఏళ్ల క్రితం అమృతరావుతో వివాహమైంది. ఆమె తన భర్తతో కలిసి కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కలపాల జయరాజు కొంతకాలంగా కామవాంఛ తీర్చాలని శైలజను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈనెల 8న శైలజ గొల్లగూడెం గ్రామంలో పొలం పనులకు వెళ్లగా, అక్కడకు వెళ్లిన జయరాజు ఆమెను పామాయిల్ తోటలోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ అక్కడే పురుగుల మందు సేవించింది.
ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకుంటుండగా, చుట్టుపక్కల వాళ్లు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. దీనిపై శైలజ తండ్రి పల్లంటి దుర్గారావు ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.