జంగారెడ్డిగూడెంను కలిపితే పోరాటం
జంగారెడ్డిగూడెం : ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటులో జంగారెడ్డిగూడెం కలవకపోవచ్చని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళవారం ఆమె జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పాలకవర్గంతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే అవకాశం లేదని, దీనిపై ఆందోళన చెందవద్దన్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నారు. ఒకవేళ జంగారెడ్డిగూడెం గిరిజన జిల్లాలో కలిస్తే తానుకూడా ఇక్కడి ప్రజలతో పాటు ఆందోళనలో పాల్గొని పోరాడతానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రిని పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, కమిషనర్ వి.నటరాజన, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రాజా సత్యనారాయణ, కోఆప్షన్‌సభ్యుడు ఇస్మాయేల్, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంను పశ్చిమలోనే ఉంచాలి
జంగారెడ్డిగూడెం రూరల్ : గిరిజన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై మంగళవారం గుర్వాయిగూడెం, పుట్లగట్లగూడెం, నాగులగూడెం, దేవులపల్లి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహించారు. తహసిల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఆర్‌ఐ భుజంగం అభిప్రాయాలను స్వీకరించారు. రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని, జంగారెడ్డిగూడెం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంచాలని, లేకపోతే జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జిల్లా ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాన్ని వెలిబుచాచరు. సర్పంచ్‌లు బాకి శ్రీనివాసరెడ్డి, దండ్రు రంగమ్మ, డి.అప్పారావు, దోరేపల్లి గంగాపార్వతి, వైస్ ఎంపీపీ ఉమ్మడి రాంబాబు, నాయకులు దల్లి రామాంజనేయరెడ్డి, దల్లి కృష్ణారెడ్డి తమ అభిప్రాయాలను అధికారులకు అందజేశారు. బుధవారం మండలంలోని లక్కవరం, టెక్కినవారిగూడెం, అమ్మపాలెం, నిమ్మగూడెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహిస్తామని తహసిల్దార్ సత్యనారాయణ చెప్పారు.