Child Welfare
-
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.
జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ స్టాంప్ కోసం ఎంపికైంది... కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్టాంప్ కోసం ఎంపికైంది. ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్ థీమ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు. రిజు తండ్రి రాజేష్ పరక్కాడవు పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. -
పట్టాలపై పసికందు
కొత్తవలస రూరల్: అప్పుడే పుట్టిన పసికందును రైలు పట్టాల పక్కన విడిచి వెళ్లిన సంఘటనతో కొత్తవలస ప్రజలు హతాశులయ్యారు. కొత్తవలస–విశాఖ రహదారిలో గల కరెంట్ ఆఫీస్ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్ద ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ పసికందును బ్యాగ్‌లో ఉంచి పడవేశారు. అక్కడే పండ్ల వ్యపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లి అనే వ్యక్తి బ్యాగ్‌లో ఉన్న శిశువును గుర్తించి, స్థానిక పరమేశ్వరి అస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు. పొలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్ పీఓ బి.ఉర్మిళ, సూపర్వైజర్ సునీత ఆస్పత్రికి వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకుని విజయనగరంలోని ఘోషాఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, శిశుగృహకు అప్పగించారు. పసికందును వదిలి వేయడం అమానుషం అప్పుడే పట్టిన పసికందును రైల్వే ట్రాక్‌పై వదిలివేయడం అమానుషమని, సభ్యసమాజం తల దించుకునే చర్య అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస రైల్వే ట్రాక్ పక్కన వదిలిపెట్టిన పసికందును ఘోషా ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచిన సమాచారం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి పసికందును చూసి డాక్టర్‌ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. -
అయ్యో పాపం.. ఈ బిడ్డ ఎవరి బిడ్డో!
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఈ ఫోటోలో ఉన్న మూడేళ్ల బాలుడి బంధువుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. 2019 జూన్ 23న బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఈ బాలుడు (అప్పుడు 6 నెలల వయస్సు) కనిపించాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా, నిజామాబాద్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని (భిక్షాటన చేస్తున్న) మహిళ వద్ద నుంచి బాబును తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో బాలుడ్ని తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంచారు. బాబుకి సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరో ఇంత వరకు ఆచూకీ లభించలేదు. ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు నిజామాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేశారు. ఇటీవల ఈ బాలుడ్ని నిజామాబాద్ శిశుగృహకు పంపించారు. ప్రస్తుతం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశుగృహలో బాబుకు వసతి కల్పించారు. ఆరు నెలల వయసున్న బాలుడికి మూడేళ్లు వచ్చినా కుటుంబ సభ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ బాబుకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులను సంప్రదించాలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఝాన్సీలక్ష్మి తెలిపారు. చదవండి: (నాలుగేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..) -
నా బిడ్డను నాకివ్వండి! ప్లీజ్!!
అనుపమ ఓ బిడ్డకు తల్లి. బిడ్డ పుట్టి మొన్నటికి (ఈ నెల 19వ తేదీకి) ఏడాదైంది. సంతోషంగా బిడ్డ తొలి పుట్టిన రోజును పండగ చేసుకోవాల్సిన సమయం. ఈ ఏడాది లోపు పాపాయి బోర్లా పడడం, పాకడం, అన్నప్రాశన, తల నీలాలు తీయడం... ప్రతిదీ ఓ వేడుకగా జరిగి ఉండాల్సింది. కానీ ఏ ఒక్క వేడుకా జరగలేదు. పుట్టినరోజు వేడుక కూడా జరగలేదు. అనుపమకు తన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ప్రసవం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాక ముందు వరకే బిడ్డను పొత్తిళ్లలో చూసుకుంది అనుపమ. హాస్పిటల్ నుంచి తల్లీ బిడ్డ వేరయ్యారు. ఇంతవరకూ కలవలేదు. బిడ్డ కోసం అనుపమ పోరాడుతోంది. ఆ (కేరళ) రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విన్నవించుకుంది. అయినా సరే... బిడ్డ ఆచూకీ అగమ్యంగానే ఉంది. మరీ ఇంత వ్యూహాత్మకమా! ఇలాంటి సంఘటనల్లో సాధారణంగా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిడ్డ మాయం కావడం చూస్తుంటాం. పిల్లలు లేని మహిళలు పేషెంట్ల రూపంలో హాస్పిటల్లో సంచరిస్తూ చంటిబిడ్డను ఎత్తుకెళ్లిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చంటిబిడ్డ మాయం కావడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్. అతడు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. బిడ్డ ఏమైందని అడిగితే అతడు ‘నా కూతురు అనుపమ అనుమతితో ఆమె బిడ్డను దత్తత ఇచ్చేశాను’ అని చెప్తున్నాడు. ‘తన మానసిక, ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా బిడ్డను పోషించే స్థితిలో లేదని, ఈ కారణాల వల్ల బిడ్డను దత్తత ఇవ్వడానికి అంగీరిస్తున్నట్లు... నా కూతురు సంతకం చేసింది చూడండి’ అని అనుపమ సంతకంతో కూడిన పత్రాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదీ కారణం! అనుపమది మలబార్ ఎరావా సామాజిక వర్గం. ఆ సామాజికవర్గానికి సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు ఉంది. ఆమె ప్రేమించిన అజిత్ దళిత క్రిస్టియన్. అనుపమ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించకపోవడానికి కారణం సామాజిక వర్గమే. గర్భవతిగా ఉన్న కూతురికి మంచి మాటలు చెప్పి ప్రసవానికి పుట్టింటికి తీసుకువచ్చారు ఆమె తల్లిదండ్రులు. అనుపమ అక్కకు పెళ్లయ్యే వరకు అనుపమ పెళ్లి, బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచుదామని అనుపమను నమ్మించారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి అనుపమను నేరుగా జయచంద్రన్ స్నేహితుని ఇంటికి తీసుకు వెళ్లారు. బిడ్డను మరోచోట సురక్షితంగా ఉంచామని చెప్పారు. కొన్నాళ్లకు అనుపమను పుట్టింటికి తీసుకువెళ్లారు, ఆ తీసుకువెళ్లడమే ఆమెను గదిలో బంధించారు. బిడ్డ వివరాలు అడిగితే చెప్పేవాళ్లు లేరు. పైగా అనుక్షణం ఆమెతో ఇంట్లో వాళ్లు ఎవరో ఒకరు నీడలా అంటిపెట్టుకునే ఉండేవారు. అనుపమ అక్క పెళ్లికి ఊరి వాళ్లను ఆహ్వానించే సమయంలో అనుపమను కూడా వెంట తీసుకువెళ్లారు. అనుపమ ఎక్కడా నోరు విప్పకూడదనే ఆంక్ష విధించి మరీ. అలాగే నడుచుకుంది అనుపమ. అక్క పెళ్లి తర్వాత తన బిడ్డను ఇవ్వమని, అజిత్ దగ్గరకు వెళ్తానని అడిగింది. ‘కుటుంబ ఆస్తిలో తనకు వారసత్వంగా రావాల్సిన హక్కు వదులుకుంటున్నట్లు’ సంతకం చేయమన్నాడు తండ్రి. అలాగే అతడు చెప్పిన చోటల్లా సంతకం చేసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల అసలు కుట్ర బయటపడింది. ‘బిడ్డను నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేశాను’ అనేశాడు అనుపమ తండ్రి. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తండ్రి చెప్పినట్లల్లా చేసింది. ఇప్పుడా బిడ్డ ఆచూకీనే లేనప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనే మొండిపట్టుదలతో ఇల్లు దాటి వచ్చేసింది. అజత్తోపాటు పోలీసులను ఆశ్రయించింది. తన బిడ్డ ఆచూకీ తెలిస్తే చెప్పమని కనిపించిన బంధువులను, కుటుంబ స్నేహితులను అర్థిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారులు, పార్టీ అగ్రశ్రేణి నాయకులను కలిసి న్యాయం చేయమని మొరపెట్టుకుంది. ఆఖరుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. ఇంత జరిగినా బిడ్డ ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. తన డెలివరీ లోపు ఒకసారి తల్లిదండ్రులు తనకు అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు అనుపమ చెప్తోంది. తన గోడు విన్న వాళ్లందరూ సానుభూతితో స్పందిస్తున్నారు, కానీ బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. ‘బిడ్డకు పాలివ్వడానికి నోచుకోలేని తల్లిగా తాను, తల్లిపాలకు దూరమైన తన బిడ్డ దురదృష్టవంతుల’మని కన్నీరు పెట్టుకుంటోంది అనుపమ. కేరళ రాష్ట్రం మనదేశంలో అత్యున్నత శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని అభ్యుదయపథంలో నడుస్తున్న రాష్ట్రంగా పరిగణిస్తాం. అలాంటిది ఈ డిజిటల్ యుగంలో కూడా ‘కులం, మతం’ మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. బిడ్డను తల్లికి దూరం చేస్తున్నాయి. బిడ్డ ఎక్కడ ఉన్నట్లు? అనుపమ ఈ ఏడాది మార్చిలో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చింది, అదే నెలలో పోలీసును ఆశ్రయించింది, పోరాడగా పోరాడగా... విషయం మీడియాలో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, కానీ ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పాడు అజిత్ ఆవేదనగా. ఇక జయచంద్రన్ మాత్రం అనాథ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్ పథకం ఉయ్యాల్లో వేసినట్లు ఒకసారి చెప్పాడు, శిశు సంక్షేమ శాఖ కమిటీకి అప్పగించినట్లు మరోసారి చెప్పాడు. శిశు సంక్షేమ కమిటీ నిర్వహకురాలు సునంద ఈ విషయంలో స్పందిస్తూ... ’ఏప్రిల్‌లో బిడ్డ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం వచ్చినట్లు చెబుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ గురించిన రికార్డు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నతల్లితో స్వయంగా మాట్లాడిన తర్వాత మాత్రమే బిడ్డను స్వీకరిస్తామని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో అమ్మతొట్టిల్కి వచ్చిన ఇద్దరు శిశువుల్లో ఒక శిశువును దత్తత ఇచ్చేయడం జరిగింది. మరో శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. నిజానిజాలు పోలీసు దర్యాప్తులో మాత్రమే తేలతాయని, ఒకవేళ దత్తత ఇచ్చిన శిశువే అనుపమ బిడ్డ అయితే ఆ బిడ్డను తిరిగి అనుపమ దంపతులకు ఇవ్వడం చట్టరీత్యా చాలా కష్టమని చెప్పింది సునంద. -
అమ్మలా ఆలోచించారు
సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్ ‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్స్ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్కిన్స్ అందచేస్తాం. ప్రతీ స్కూల్లో నోడల్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నైన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలలకు సరిపడా స్టాక్ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
Andhra Pradesh: ‘సచివాలయ’ వ్యవస్థతో యునిసెఫ్ జత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్) ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక్కొక్క ప్రతినిధిని యునిసెఫ్ నియమించింది. వీరు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మరో ముగ్గురు యునిసెఫ్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక సెల్ పనిచేస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేసే యునిసెఫ్ ప్రతినిధులకు ఆ సంస్థే జీతభత్యాలు చెల్లిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలు కల్పించడం లక్ష్యంగా యునిసెఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా చేసుకుని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో సైతం మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు యునిసెఫ్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. యునిసెఫ్ జిల్లా స్థాయిలో తమ ప్రతినిధుల నియమించటం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి పౌష్టికాహార సంబంధ అంశాలపై.. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లోని పేదల కాలనీలలో కరోనా నియంత్రణపై యునిసెఫ్ ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు పౌష్టికాహరం, దాని ఆవశ్యకత, పౌష్టికాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలపై వలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు యునిసెఫ్ స్టేట్ మేనేజర్ మోహనరావు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కరోనా మూడో వేవ్ విజృంభించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు 2.58 లక్షల మంది వలంటీర్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం అన్ని పాఠశాలల్లో యునిసెఫ్ ప్రతినిధులు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. -
బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. ‘నేషనల్ కన్సల్టేషన్ కమిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్’ సంస్థ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 34,037 మంది బాల కార్మికులను ఏపీ పోలీసులు విముక్తుల్ని చేయడం హర్షణీయమన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆసుపత్రులను నిరి్మంచాలన్న నిర్ణయాన్నీ ఆయన అభినందించారు. చదవండి: ఉద్యాన హబ్‌గా ఏపీ కౌలు రైతులకూ ‘భరోసా’ -
కరోనా బాధిత బాలలను కాపాడుకుందాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూచించింది. కరోనా బాధిత బాలల రక్షణపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్నారని, వీరిలో 1,700 మంది బాలలు ఇద్దరినీ కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు ► కోవిడ్‌తో ప్రభావితులైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలి. ప్రతి ఒక్క చిన్నారి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. ఆ అవసరాలను ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడితే వారి పిల్లలను తాత్కాలికంగా శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించాలి. ఆలనాపాలనా చూసేవారు లేకపోతే సాయం అందజేయాలి. ► శిశు సంరక్షణ పథకాల కింద బాధిత పిల్లల పునరావాసం కోసం వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి. ► శిశు సంరక్షణ కేంద్రాల్లో కరోనా సోకిన చిన్నారులకు అక్కడే ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలి. ► పిల్లలో మానసిక సమస్యలు తలెత్తకుండా సైకాలజిస్టుల కౌన్సెలింగ్ ఇప్పించాలి. ► కరోనా వల్ల అనాథలుగా మారిన బాలలలకు జిల్లా కలెక్టర్లు సంరక్షకులుగా వ్యవహరించాలి. ► బాధిత బాలల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చేందుకు, ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలను వారికి చేరవేసేందుకు కలెక్టర్లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► కరోనా వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లల ఆస్తులు పరులపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. ఇందుకోసం రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగం సేవలు ఉపయోగించుకోవాలి. ► బాధిత పిల్లలపై వేధింపులు, వారి అక్రమ రవాణా, అక్రమ దత్తత, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారడంపై పోలీసు శాఖ నిరంతరం దృష్టి పెట్టాలి. -
చిన్నారుల కరోనా సందేహాలు తీర్చే ‘టోల్ ఫ్రీ’
సాక్షి, అమరావతి: చిన్నారుల్లో కరోనా సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్టు బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలలు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికాశుక్లా చెప్పారు. కరోనా బారిన పడుతున్న చిన్నారులకు తగిన భరోసాను కల్పిస్తూ జాతీయ బాలల హక్కుల కమిషన్ 1800–121 2830 పేరిట టో ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. దీనికి ఫోన్ చేస్తే నిపుణులైన కౌన్సెలర్లు, మానసికతత్వ శాస్త్ర నిపుణులు చిన్నారుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు సహకరిస్తారని చెప్పారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ టోల్ ఫ్రీలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్, న్యూరో సైన్సెస్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. -
నెల రోజుల అమ్మ
స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు. ఒక్క నిమిషం చాలు. పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమే ఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది. మేరి అనిత కూడా అలా మారింది. కాని ఆమె షించాల్సిన పాత్ర నెలరోజులు మాత్రమే అనే వాస్తవం ఉద్వేగభరితమైనది. జూన్ 14, 2020. ఎర్నాకులంలోని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక ఫోన్ వచ్చింది. షీనా అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమెకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడని, ఆ పసివాణ్ణి చూసుకోవడానికి మనిషి కావాలని. కాని ఎవరూ లేరు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేస్తున్నడా. మేరీ అనితకు ఈ సంగతి తెలిసింది. ఆమె క్లినికల్ సైకాలజిస్ట్. స్పెషల్ చిల్డ్రన్ కోసం ఒక కేంద్రం నడుపుతోందామె. ‘ఎవరూ లేరు. కాని నేను ఆ పసివాడికి తల్లినవుతాను’ అంది మేరీ. కోవిడ్ వచ్చిన తల్లిదండ్రులు ఆ పసివాడి పేరు ఉన్నికుట్టన్. తల్లిదండ్రులు నర్సులుగా హర్యానా వెళ్లి ఉపాధి పొందుతున్నారు. అక్కడ మొదట తండ్రికి కరోనా వచ్చింది. అతడు అక్కడే క్వారంటైన్లోకి వెళ్లగా తల్లి బాబును తీసుకొని కేరళలోని సొంత ప్రాంతమైన ఎర్నాకులం వచ్చింది. వచ్చాక ఆమెకు కోవిడ్ పాజిటివ్ తేలింది. అదృష్టవశాత్తు పసివాడికి నెగెటివ్ వచ్చింది. తల్లి వైద్యానికి ఆస్పత్రిలో ఉంటే పసివాణ్ణి ఎవరు చూసుకోవాలనే సమస్య వచ్చింది. షీనా బంధువులు కాని ముసలి తల్లిదండ్రులు కాని సాయం చేసే స్థితిలో లేరు. ఆ సమయంలో మేరీ అనిత ముందుకు వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. వారిని సలహా అడిగితే వారంతా మనస్ఫూర్తిగా పసివాడికి సాయం చేయమన్నారు. పిల్లవాడికి ఏ క్షణమైనా కోవిడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేరి అనిత వాణ్ణి తీసుకొని పక్కనే ఉన్న ఒక ఖాళీ ఫ్లాట్‌లోకి మారి క్వారంటైన్లోకి వెళ్లింది. నెల రోజులుగా బాబుకు అమ్మలా మారి బాగోగులు చూసుకుంది. నెల రోజుల తల్లి ఉన్నికుట్టన్‌కు అమ్మపాలు అలవాటు. కాని మేరి అనిత మెల్లగా పోతపాలలోకి మార్చగలిగింది. మెల్లమెల్లగా పసివాడు మేరిలోనే తల్లిని చూసుకోసాగాడు. ఈ నెలరోజులు వారి మధ్యగట్టి బంధం ఏర్పడిపోయింది. తండ్రి హర్యానా నుంచి తిరిగి రాగా, తల్లి కోవిడ్ నుంచి బయట పడగా రెండు రోజుల క్రితం మేరి ఆ పసివాణ్ణి సొంత తల్లిదండ్రులకు అధికారుల సమక్షంలో అప్పజెప్పింది. ఉన్నికుట్టన్ తల్లిని గుర్తుపట్టి మెల్లగా నవ్వాడు. కాని పసివాణ్ణి తిరిగి ఇస్తూ మేరి కంట నీరు పెట్టుకుంది. ‘ఆమె దేవతలా నా బిడ్డను కాపాడింది’ అని షీనా అంది. మేరి ఉండే అపార్ట్మెంట్లోని వారంతా వచ్చి ఉన్నికుట్టన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే తన ఇల్లు చేరుకున్నాక ఉన్ని కుట్టన్ మేరి కోసం ఏడుపు మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి షీనా వెంటనే మేరికి కాల్ చేసింది. ‘ఒకసారి వీడియోకాల్ చేస్తాను. మాట్లాడండి’ అని ప్రాధేయపడింది. మేరి అనిత ఆ విన్నపాన్ని మన్నించలేదు. ‘వద్దు. మీ ప్రేమతో వాణ్ణి నన్ను మరిపించండి’ అని మెల్లగా ఫోన్ పెట్టేసింది. పాశం పెంచుకునే సందర్భాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో తుంచుకునే క్షణాలు అంత బాధను మిగులుస్తాయి. కరోనా నమోదు చేసిన లీలల్లో ఇది ఒకటి. -
మానసిక వికలాంగుల కల్చరల్ కార్నివాల్
-
రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం ఆపరేషన్ ముస్కాన్ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు 794 బృందాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు చేపట్టాయి. పోలీసులు, చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, సినిమా హాళ్లు, పార్కుల వద్ద ఆకస్మిక తనిఖీలు జరిపారు. బాలబాలికల అదృశ్య ఘటనలు, చట్ట విరుద్ధంగా బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఘటనలపై పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మొత్తం 2,774 మంది పిల్లలను గుర్తించగా వారిలో బాలురు 2,378, బాలికలు 396 మంది ఉన్నారు. వారిలో చిరునామా ఉన్న వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. చిరునామా దొరకని వారిని చైల్డ్‌లైన్‌కు అప్పగించినట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. -
టీచర్‌పై కుర్చీలతో విద్యార్థుల దాడి
-
వామ్మో.. టీచరమ్మను ఎలా కొట్టారో!
రాయ్‌బరేలీ: చదువులు నేర్పే ఉపాధ్యాయురాలి మీద విద్యార్థులంతా ఏకమై దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. గాంధీ సేవా నికేతన్‌లో బోధిస్తున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారి మమతా దూబేపై సోమవారం ఈ దాడి జరిగింది. మొదట విద్యార్థులు ఆమె చుట్టూ చేరి వాదనకు దిగారు. ఒక విద్యార్థి ఆమె హ్యాండ్‌బ్యాగును విసిరేశాడు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. అనంతరం అదే విద్యార్థి ప్లాస్టిక్ కుర్చీతో పలుసార్లు ఆమెను కొట్టాడు. ఈ సమయంలో మిగిలిన విద్యార్థులు చోద్యం చూస్తుండడం గమనార్హం. ఈ ఘటనలన్నీ సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. దీనిపై బాధితురాలు మమతా స్పందిస్తూ.. మేనేజర్‌తో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే అతడు తనను ఇటీవల విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనిపై తాను కలెక్టర్ నేహా శర్మను సంప్రదించినట్లు వెల్లడించారు. తనను విద్యార్థులు వాష్ రూంలో బంధించారని అధికారులకు చెబితే, పిల్లలు తమకు ఇష్టం వచి్చనట్లు చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. రెండు రోజుల తర్వాత నికేతన్‌కు వెళ్లగా విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. మేనేజరే ఈ దాడి చేయించాడని ఆమె ఆరోపించారు. -
చిన్నారుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ మహిళా ఎంపీలను కోరారు. బీజేపీకి చెందిన 30 మందికి పైగా మహిళా ఎంపీలతో శుక్రవారం ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రతి వారూ తమ నియోజకవర్గం పరిధిలోని చిన్నారుల ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారలోపం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి మహిళా ఎంపీ ఒక వ్యవస్థ వంటి వారని, ప్రజలతో సులభంగా మమేకం కాగలిగిన అద్భుత నైపుణ్యం మహిళల సొంతమన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానితో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ జరుపుతున్న వరుస భేటీల్లో ఇది ఐదోది. ఇప్పటి వరకు ఆయన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యువ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల ద్వారా ఉభయ సభలకు చెందిన పార్టీలోని అన్ని వర్గాల ఎంపీలు ప్రధానితో పరిచయం చేసుకోవడంతోపాటు నేరుగా వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
పిల్లల సంక్షేమమే ముఖ్యం.. తల్లిదండ్రుల హక్కు కాదు
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య స్పర్థలు వచ్చినప్పుడు పిల్లల సంరక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో చూడాల్సింది ఆ పిల్లల సంక్షేమం, ప్రయోజనాలే తప్ప, తల్లిదండ్రుల హక్కులు కాదని హైకోర్టు పునరుద్ఘాటించింది. మైనర్ పిల్లల సంక్షేమాన్ని ఆయా కేసులలోని అంశాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాలంది. కుటుంబపెద్దగా, ఆర్జనపరుడుగా ఉంటాడు కాబట్టి పిల్లల సంక్షేమం విషయంలో తండ్రి సరైన వ్యక్తి అని చట్టాలు చెబుతున్నాయంది. పిల్లలను ఎవరి కస్టడీకి అప్పగించాలన్న విషయంలో తల్లిదండ్రుల సంపాదన, ప్రేమ అన్నవి పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలైనప్పటికీ, కేవలం వాటి ఆధారంగానే నిర్ణయం తీసుకవడానికి వీల్లేదని పేర్కొంది. ఇటువంటి సమయాల్లో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తతో న్యాయవిచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, పిల్లాడిని సరిగా చూసుకోకపోవడం, మంచంపై నుంచి చిన్నారిని తోసివేయడం వంటి చర్యలకు పాల్పడిన నేపథ్యం లో ఆ చిన్నారిని తండ్రి సంరక్షణలో ఉం చడం శ్రేయస్కరమని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో తల్లిపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ఈ చిన్నారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని తండ్రి సంరక్షణలో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆ పిల్లాడిని తండ్రి సంరక్షణలోనే ఉంచేం దుకు నిరాకరిస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్ గౌడ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వివాహం తరువాత కూడా భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, 23 నెలల కుమారుడిని సక్రమంగా చూసుకోకపోడంతో ఆ చిన్నారిని తన సంరక్షణకు అప్పగించాలని కోరుతూ ఓ వ్యక్తి సిటీ సివిల్ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ అభ్యర్థనను సివిల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. భార్యపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ఆ చిన్నారిని పిటిషనర్(భర్త) సంరక్షణలోనే ఉంచడం సబబని స్పష్టం చేసింది. సివిల్ కోర్టు తీర్పును తప్పుపట్టింది. భార్యపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు, చిన్నారి పట్ల ఆమె ప్రవర్తన, చిన్నారి సంరక్షణ కోరకపోవడం వంటి అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. ఈ కేసులో ఏ రకంగా చూసినా చిన్నారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతని సంరక్షణను పిటిషనర్‌కు ఇవ్వడమే సరైందని హైకోర్టు తీర్పునిచ్చింది. -
శ్రీవారి సన్నిధిలో అమానవీయం!
►కల్యాణకట్ట రేకుల షెడ్డులో నెల బిడ్డను వదిలి వెళ్లిన కన్నవారు ►చైల్డ్ వెల్ఫేర్ విభాగానికి అప్పగించిన పోలీసులు సాక్షి, తిరుమల: నెలకూడా నిండని పసిగుడ్డును కన్నవారు వదిలించుకున్నారు. తిరుమలలో గురువారం ఈ ఘటన జరిగింది. ఇక్కడి కల్యాణకట్ట ఎదురుగా రేకుల షెడ్డులో వస్త్రాల్లో చుట్టి వదిలివెళ్లిన ఓ పసిగుడ్డు ఏడుపు వినిపించింది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు ఆ మగబిడ్డను ఎత్తుకుని ఓదార్చాడు. కన్నవారి కోసం చుట్టూ గాలించినా ఆచూకీ కనిపించలేదు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో బిడ్డను అప్పగించారు. బిడ్డను మహిళా కానిస్టేబుల్, ఎస్ఐ తిమ్మప్ప అక్కున చేర్చుకుని బుడ్డీతో పాలు తాగించి ఆకలి తీర్చారు. తర్వాత డీఎస్పీ మునిరామయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించినా బిడ్డ కన్నవారి జాడ తెలియలేదు. బోసినవ్వులు చిందిస్తూ, కాళ్లూ చేతులు ఊపుతూ కనిపించిన ఆ బిడ్డను చూసిన డీఎస్పీ మునిరామయ్య చలించిపోయారు. పసికందులు ఇలా రోడ్డుపాలు కావటం అమానవీయమన్నారు. బిడ్డకు చెందిన కన్నవారు తప్పక తమను సంప్రదించి తీసుకెళ్లాలని కోరారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రసన్న హృదయంతో కనిపించిన ఆ పసిగుడ్డుకు ‘ప్రసన్న వెంకటేష్’గా నామకరణం చేశారు. తర్వాత బిడ్డను స్థానిక అశ్విని ఆస్పత్రిలో చికిత్సల అనంతరం చైల్డ్ వెల్ఫేర్ విభాగం సభ్యురాలు దేవయానికి అప్పగించారు. -
శిశు సంక్షేమ శాఖకు కొత్తరూపు
విభజనలో నాలుగు జిల్లాలకు 18 ప్రాజెక్టులు మరికొన్ని అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కొన్ని కేంద్రాలు పక్క జిల్లాలకు.. డైరెక్టరేట్‌కు చేరిన ఉద్యోగుల జాబితా హన్మకొండ చౌరస్తా : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భాగంగా ఉద్యోగులు .. ప్రాజెక్టులు.. సెంటర్ల.. విభజన ప్రక్రియపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రస్తుతం 18 ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. కొత్తగా ఏర్పాటుకానున్న వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు ప్రాజెక్టులు, సెంటర్ల పంపకాల నివేదికను జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జాబితా, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర వివరాలను డైరెక్టరేట్‌కు పంపించేందుకు నివేదికను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరంగల్ పీడీ పరిధిలో.. ప్రస్తుతం వరంగల్ పీడీ పరిధిలోని 18 ప్రాజెక్టుల్లో 4196 అంగన్వాడీ ప్రధాన సెంటర్లు, 327 మినీ సెంటర్లు కొనసాగుతున్నాయి. సీడీపీఓల పర్యవేక్షణలో అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల విభజనలో భాగంగా కొన్ని అంగన్వాడీ సెంటర్లు సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లోకి వెళ్తుండగా.. కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త జి ల్లాల్లో విలీనమవుతున్నాయి. దీంతో శిశు సంక్షేమ శాఖ భౌగోళిక స్వరూపం కొత్త రూపాన్ని సంతరించుకుంది. కాగా, కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకంలో ప్రస్తుతం సీడీపీఓలుగా కొనసాగుతున్న వారిలో సీనియారిటీ ప్రాతిపదికన ఇన్చార్జి పీడీ లు నియమించే అవకాశం ఉన్నట్లు శాఖలోని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పీడీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎవరిని ఏ జిల్లాకు పంపించాలనే అంశంపై డైరెక్టరేట్దే తుది నిర్ణయమని తెలుస్తుంది. ఈ శాఖ ద్వారా బాలింత, గర్భిణులు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం, ఇతర సంక్షేమ పథకాలకు అంతరాయం కలుగకుండా విభజన ఉంటుందని పీడీ ఆఫీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల వివరాలివీ.. చేర్యాల ప్రాజెక్టు : దీని పరిధిలో ప్రస్తుతం చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలు కొనసాగుతున్నాయి. విభజనలో చేర్యాల మండలంలోని 79 అంగన్వాడీ కేంద్రాలు, మద్దూరు మండలంలోని 52 మెయిన్, 2 మినీ కేంద్రాలు సిద్ధిపేట జిల్లాలో విలీనమవుతుం డగా, బచ్చన్నపేట మండలంలో నిర్వహిస్తున్న 50 అంగన్వాడీ కేంద్రాలు యాదాద్రి జిల్లాలోకి వెళ్లనున్నాయి. నర్మెట మండలంలోని 72 మె యిన్, 7 మినీ సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. చిట్యాల : ఈ ప్రాజెక్టు పరిధిలో చిట్యాల మండలంలోని 95 మెయిన్, 3 మినీ కేంద్రాలు, మొగుళ్లపల్లి మండలంలోని 66 మెయిన్, 1 మినీ, భూపాలపల్లి మండలంలోని 85 మెయిన్, 26 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. వీటితోపాటు ప్రస్తుతం కరీంనగర్లో కొనసాగుతున్న మలహల్రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం మండలం భూపాలపల్లి జిల్లాలో విలీనం కానున్న తరుణంలో ఆయా మండలాల పరిధిలోని అంగన్వాడీ సెంటర్లు చిట్యాల ప్రాజెక్టులోనే కొనసాగనున్నాయి. ఏటూరునాగారం : ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏటూరునాగారం మండలంలోని 96 మెయిన్, 6 మినీ కేంద్రాలు, తాడ్వాయి మండలంలోని 68 మెయిన్, 2 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. డోర్నకల్ : ఈ ప్రాజెక్టు పరిధిలోని డోర్నకల్ మండలంలోని 97 మెయిన్, 11 మినీ కేంద్రాలు కురవి మండలంలోని 110 మెయిన్, 12 మినీ సెంటర్లు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుండగా.. కొత్తగా ఖమ్మం జి ల్లాలోని గార్ల మండలంలోని సెంటర్లు ఇదే ప్రాజెక్టు పరి ధిలో మహబూబాబాద్ జిల్లాలో విలీనం కానున్నాయి. గూడూరు : ఈ ప్రాజెక్టులోని గూడూరు మండలంలోని 106 మెయిన్, 20 మినీ కేంద్రాలు, కొత్తగూడ మండలంలోని 82 కేంద్రాలు మహబూబాబాద్జిల్లాలో విలీనంకాగా..ఖానాపురం మండలంలో కొనసాగుతున్న43 మె యిన్, 2మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. హన్మకొండ : ఈ ప్రాజెక్టులోని హన్మకొండ మండలంలోని 77 మెయిన్, 4 మినీ కేంద్రాలు నూతనంగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలో విలీనం కానుం డగా.. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న హసన్‌పర్తి మండలంలోని 76 మెయిన్, 2 మినీ సెంటర్లు ఆత్మకూరు మం డలంలోని 78 మెయిన్, 3 మినీ అంగన్వాడీ సెంటర్లు, గీసుగొండ పరిధిలోని 68 మెయిన్, 2 మినీ సెంటర్లు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. వీటికి తోడు కొత్తగా హన్మకొండ ప్రాజెక్టులో హుజురాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల పరిధిలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి. జనగామ : దీని పరిధిలోని జనగామ మండలంలోని 75 మెయిన్, 4 మినీ కేంద్రాలు లింగాలఘణపురంలోని 48 మెయిన్, 4 మినీ సెంటర్లు యాదాద్రి జిల్లాలోకి, రఘునాథపల్లి మండలంలోని 74 మెయిన్, 5 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగేలా అధికారులు ప్రతిపాదించారు. కొడకండ్ల : ఈ ప్రాజెక్టు పరిధిలోని కొడకండ్ల మండలంలోని 69 మెయిన్, 6 మినీ సెంటర్లు, పాలకుర్తిలోని 63 మెయిన్, 8 మినీ సెంటర్లు, దేవరుప్పల మండలంలోని 62 మెయిన్, 1 మినీ సెంటర్ హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. మహబూబాబాద్ : కొత్త జిల్లాగా ఏర్పాటుకానున్న మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలోని మహబూబాబాద్ మండలంలోని 160 మెయిన్, 7 మినీ సెంటర్లు, నెల్లికుదురులోని108 మెయిన్, 12 మినీ సెంటర్లు, కేసముద్రంలోని 93 మెయిన్ 9 మినీ సెంటర్లు ఈ జిల్లాలోనే కొనసాగునున్నాయి. మంగపేట : మంగపేట ప్రాజెక్టులోని మంగపేట మండలంలో కొనసాగుతున్న 103 మెయిన్,1 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో విలీనం చేయనున్నారు. మరిపెడ : ఈ ప్రాజెక్టులోని మరిపెడ మండలంలోని 174 మెయిన్ 17 మినీ సెంటర్లు, నర్సింహులపేటలోని 95 మెయిన్, 9 మినీ సెంటర్లు, తొర్రూర్ మండల పరిధిలోని 94 మెయిన్, 14 మినీ కేంద్రాలు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనున్నాయి. ములుగు : ఈ ప్రాజెక్టు పరిధిలోని ములుగు మండలంలోని 76 మెయిన్, 18 మినీ అంగన్వాడీ సెంటర్లు, గణపురం మండలంలోని 41 మెయిన్, 10 మినీ సెంటర్లు, గోవిందరావుపేట మండలంలోని 48 మెయిన్, 6 మినీ కేంద్రాలు, వెంకటాపూర్ మండలంలోని 47 మెయిన్, 11 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో కొనసాగేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నర్సంపేట : ఈ ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట మండలంలోని 56 మెయిన్,1 మినీ కేంద్రాలను, నల్లబెల్లి మండలంలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను, దుగ్గొండిలోని 48 మెయిన్, 1 మినీ కేంద్రాన్ని, చెన్నారావుపేట మండలంలోని 74 మెయిన్, 3 మినీ కేంద్రాలను, నెక్కొండలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను వరంగల్ జిల్లాలో కలుపనున్నారు. పరకాల : దీని పరిధిలోని పరకాల మండలంలోని 100– 1 సెంటర్లు, శాయంపేటలోని 58 అంగన్వాడీ సెంటర్ల ను వరంగల్ జిల్లాలో,రేగొండ మండలంలోని 80 మెయి న్,1మినీకేంద్రం భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ : ఈ ప్రాజెక్టులోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని 107 మెయిన్, 7 మినీ కేంద్రాలు, ధర్మసాగర్‌లోని 94–1 కేంద్రాలు, జఫర్గడ్ మండలంలోని 70 కేంద్రాలతో పాటు వేలేరు, చిల్పూరు మండల కేంద్రాల పరిధిలో కొనసాగే అంగన్వాడీ సెంటర్లను హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. వరంగల్ అర్బన్–1 : ఈ పాజెక్టు పరిధిలోని వరంగల్ మున్సిపల్లోని 100 కేంద్రాలను వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్న 71 కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగున్నాయి. కొత్తగా వరంగల్ జిల్లాలో ఖిలావరంగల్ మండల కేంద్రాలు, హన్మకొండ జిల్లాలో కాజీపేట మండలంలోని అంగన్వాడీ సెంటర్లు విలీనం కానున్నాయి. వరంగల్అర్బన్–2 : ఈ ప్రాజెక్టులోని వరంగల్ మున్సిపల్లో ఉన్న 100 సెంటర్లు వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్లోని 60 సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగుతాయి. వర్ధన్నపేట : వర్ధన్నపేట ప్రాజెక్టులోని వర్ధన్నపేట మండలంలోని 73 మెయిన్, 12 మినీ సెంటర్లు, సంగెం మండలంలోని 55 మెయిన్, 8 మినీ సెంటర్లు, పర్వతగిరి మండలంలోని 52 మెయిన్, 15 మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగుతుండగా.. రాయపర్తి మండలంలోని 58 మెయిన్, 28 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి. -
సెంట్రల్ సోషల్వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డులో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ బోర్డు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఒక భాగం. గత జూన్ నెల 20వ తేదీ నుంచే సభ్యత్వం ప్రారంభమైంది. బుట్టా రేణుక ఈ బోర్డులో మూడేళ్ల పాటు సభ్యురాలుగా కొనసాగుతారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు అధ్యక్షులందరు సభ్యులుగా ఉంటారు. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో బుట్టా రేణుకతో పాటు ప్రియాంక రావత్‌కు సభ్యత్వం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల అయింది. -
స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట
లెజిస్లేటివ్ కమిటీ చైర్పర్సన్ అజ్మీరా రేఖానాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్ : స్త్రీ శిశు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తోందని మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ విభాగం లెజిస్లేటివ్ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రేఖానాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు మరిత పటిష్టం కావాల్సి ఉందన్నారు. వాటికి సొంత భవనాలను అందుబాటులోకి తేవాలన్నారు. సిబ్బందికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయన్నారు. మౌలిక వసతుల లేమి నెలకొందన్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. ‘కలెక్టర్ కరుణ గారూ మా(ఆదిలాబాద్) జిల్లాకు రండి. మీ లాంటి అధికారులు ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది’ అని రేఖానాయక్ వ్యాఖ్యానించారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా మేడారం సమ్మక్క, సారలమ్మ, బతుకమ్మలు, బోనాలు, పౌష్టికాహారం, బాలికా సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మంగపేట ప్రాజెక్టు యువత చేసిన ఆదివాసీ నృత్యాలు అలరించాయి. కమిటీ సభ్యులు పురాణం సతీష్‌కుమార్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, రాంచంద్రారెడ్డి , ఐసీడీఎస్ జేడీ, డీడీ, పీడీ, పలువురు సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు
ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా పాలకమండలి కలెక్టర్ చైర్మన్‌గా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గనులు, ఖనిజాలు(అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(ట్రస్టు) (డీఎంఎఫ్)ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇటీవలే ఈ చట్టాన్ని సవరించింది. డీఎంఎఫ్‌టీల మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనూ ఏర్పాటయ్యే డీఎంఎఫ్‌కు పాలకమండలి(గవర్నింగ్ కౌన్సిల్), మేనేజింగ్ కమిటీ వేర్వేరుగా ఉంటాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం కేంద్రంగా డీఎంఎఫ్ పనిచేస్తుంది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం, లబ్ధి చేకూర్చడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే పాలకమండలిలో సంబంధిత జిల్లా మంత్రి, మైనింగ్ ప్రభావిత ప్రాంత వ్యక్తి, మైనింగ్ కంపెనీ ప్రతినిధి, సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు, అటవీ, పర్యావరణ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. పాలక మండలితోపాటు జిల్లా కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, గ్రూప్ 1 హోదా కలిగిన జిల్లాస్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. గవర్నింగ్ కౌన్సిల్ సిఫారసు మేరకు మైనింగ్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఐదుగురు స్థానికులు, డీఆర్డీఏ పీడీ, గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ, లీడ్ బ్యాంక్ అధికారి మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మైనింగ్ లీజుదారుల నుంచి సకాలంలో కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు, ట్రస్టు విజన్ డాక్యుమెంటు తయారీ, వార్షిక ప్రణాళిక అమలు పర్యవేక్షణ, ట్రస్టు నిధి వివిధ ప్రాజెక్టులకు మంజూరు, నిధుల వినియోగాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
వైద్య సేవల్లో ఇంత నిర్లక్ష్యమా?
- వైద్యులు, సిబ్బంది పనితీరు బాగోలేదు - మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు అస్తవ్యస్తం - కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ ఆగ్రహం పాడేరు: ఏజెన్సీలో అస్తవ్యస్త వైద్య సేవలపై వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ కమిషనర్ సౌరబ్ గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల వైద్యసేవల కోసం అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచినప్పటికి వైద్యులు, సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. మండలంలోని వంజంగి గ్రామానికి గురువారం కాలినడకన వెళ్లారు. వైద్య, ఆరోగ్య సేవలు, మాతా,శిశు సంక్షేమంపై అక్కడ ఆరా తీశారు. అక్కడి వైద్యసిబ్బంది వద్ద ఉన్న పలు రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు. 11 రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. డీఎంహెచ్ఓ, ఏడీఎంహెచ్ఓతోపాటు ఇతర వైద్య అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి అంటూ మండి పడ్డారు. మాతా,శిశు ఆరోగ్య సేవల విషయంలోనూ నిర్లక్ష్యం మంచి పద్ధతి కాదన్నారు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేసి ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఉద్యోగులపై ఉందన్నారు. ఏజెన్సీలో ఈ విధానం కానరాకపోవడంతో మారుమూల గూడేల్లో ఇప్పటికీ ఇళ్ల వద్దే నాటు పద్ధతుల్లో కాన్పులు జరగడం బాధాకరమన్నారు. పల్లకీ సేవలను అందుబాటులోకి తెచ్చినా గ్రామాల్లోనివారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోకపోవడంపై వైద్యాధికారులను బాధ్యులను చేస్తూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆశ కార్యకర్తలు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, అది కూడా ప్రతి నెలా ఇవ్వడం లేదంటూ వాపోయారు. అనంతరం మారుమూల గ్రామాలకు పోయే కొత్తవలస మట్టి రోడ్డును కమిషనర్ పరిశీలించారు. ఐటీడీఏ పీవోతో చర్చించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అక్కడే ఉన్న గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్జీ నాయుడును ఆదేశించారు. అనంతరం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి తీరు కూడా అస్తవ్యస్తంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దాసుపత్రిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం భావ్యం కాదన్నారు. ఆస్పత్రిలోని డెలివరీ గదిలో మూలకు చేరిన స్కానర్‌ను పరిశీలించారు. గైనకాలజిస్టు లేకపోవడంతో ప్రసవాలకు ఇబ్బందిగా ఉందని పలువురు గిరిజనులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని రోజు వారీ డెలివరీలు, మాతా, శిశు ఆరోగ్య సేవలు, విశాఖపట్నం ఆస్పత్రులకు పంపించే రిఫరల్ డెలివరీ కేసుల వివరాలన్నింటిని ఆయన సేకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సరోజిని, జిల్లా మలేరియా శాఖ అధికారి ప్రసాదరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్పీహెచ్వో డాక్టర్ పార్థసారథిపాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెంను కలిపితే పోరాటం
జంగారెడ్డిగూడెం : ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటులో జంగారెడ్డిగూడెం కలవకపోవచ్చని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళవారం ఆమె జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పాలకవర్గంతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. జంగారెడ్డిగూడెం ప్రాంతాన్ని ప్రత్యేక గిరిజన జిల్లాలో కలిపే అవకాశం లేదని, దీనిపై ఆందోళన చెందవద్దన్నారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నారు. ఒకవేళ జంగారెడ్డిగూడెం గిరిజన జిల్లాలో కలిస్తే తానుకూడా ఇక్కడి ప్రజలతో పాటు ఆందోళనలో పాల్గొని పోరాడతానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రిని పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, కమిషనర్ వి.నటరాజన, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రాజా సత్యనారాయణ, కోఆప్షన్‌సభ్యుడు ఇస్మాయేల్, రామ్‌కుమార్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంను పశ్చిమలోనే ఉంచాలి జంగారెడ్డిగూడెం రూరల్ : గిరిజన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై మంగళవారం గుర్వాయిగూడెం, పుట్లగట్లగూడెం, నాగులగూడెం, దేవులపల్లి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహించారు. తహసిల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఆర్ఐ భుజంగం అభిప్రాయాలను స్వీకరించారు. రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని, జంగారెడ్డిగూడెం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంచాలని, లేకపోతే జంగారెడ్డిగూడెం పట్టణాన్ని జిల్లా ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాన్ని వెలిబుచాచరు. సర్పంచ్‌లు బాకి శ్రీనివాసరెడ్డి, దండ్రు రంగమ్మ, డి.అప్పారావు, దోరేపల్లి గంగాపార్వతి, వైస్ ఎంపీపీ ఉమ్మడి రాంబాబు, నాయకులు దల్లి రామాంజనేయరెడ్డి, దల్లి కృష్ణారెడ్డి తమ అభిప్రాయాలను అధికారులకు అందజేశారు. బుధవారం మండలంలోని లక్కవరం, టెక్కినవారిగూడెం, అమ్మపాలెం, నిమ్మగూడెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు నిర్వహిస్తామని తహసిల్దార్ సత్యనారాయణ చెప్పారు.