- వైద్యులు, సిబ్బంది పనితీరు బాగోలేదు
- మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమాలు అస్తవ్యస్తం
- కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ ఆగ్రహం
పాడేరు: ఏజెన్సీలో అస్తవ్యస్త వైద్య సేవలపై వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ కమిషనర్ సౌరబ్ గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల వైద్యసేవల కోసం అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచినప్పటికి వైద్యులు, సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. మండలంలోని వంజంగి గ్రామానికి గురువారం కాలినడకన వెళ్లారు. వైద్య, ఆరోగ్య సేవలు, మాతా,శిశు సంక్షేమంపై అక్కడ ఆరా తీశారు. అక్కడి వైద్యసిబ్బంది వద్ద ఉన్న పలు రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు.
11 రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. డీఎంహెచ్‌ఓ, ఏడీఎంహెచ్‌ఓతోపాటు ఇతర వైద్య అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి అంటూ మండి పడ్డారు. మాతా,శిశు ఆరోగ్య సేవల విషయంలోనూ నిర్లక్ష్యం మంచి పద్ధతి కాదన్నారు.
మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేసి ఆస్పత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఉద్యోగులపై ఉందన్నారు. ఏజెన్సీలో ఈ విధానం కానరాకపోవడంతో మారుమూల గూడేల్లో ఇప్పటికీ ఇళ్ల వద్దే నాటు పద్ధతుల్లో కాన్పులు జరగడం బాధాకరమన్నారు. పల్లకీ సేవలను అందుబాటులోకి తెచ్చినా గ్రామాల్లోనివారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోకపోవడంపై వైద్యాధికారులను బాధ్యులను చేస్తూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆశ కార్యకర్తలు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, అది కూడా ప్రతి నెలా ఇవ్వడం లేదంటూ వాపోయారు. అనంతరం మారుమూల గ్రామాలకు పోయే కొత్తవలస మట్టి రోడ్డును కమిషనర్ పరిశీలించారు. ఐటీడీఏ పీవోతో చర్చించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అక్కడే ఉన్న గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్‌జీ నాయుడును ఆదేశించారు.
అనంతరం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి తీరు కూడా అస్తవ్యస్తంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దాసుపత్రిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం భావ్యం కాదన్నారు. ఆస్పత్రిలోని డెలివరీ గదిలో మూలకు చేరిన స్కానర్‌ను పరిశీలించారు.
గైనకాలజిస్టు లేకపోవడంతో ప్రసవాలకు ఇబ్బందిగా ఉందని పలువురు గిరిజనులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని రోజు వారీ డెలివరీలు, మాతా, శిశు ఆరోగ్య సేవలు, విశాఖపట్నం ఆస్పత్రులకు పంపించే రిఫరల్ డెలివరీ కేసుల వివరాలన్నింటిని ఆయన సేకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సరోజిని, జిల్లా మలేరియా శాఖ అధికారి ప్రసాదరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్పీహెచ్‌వో డాక్టర్ పార్థసారథిపాల్గొన్నారు.
వైద్య సేవల్లో ఇంత నిర్లక్ష్యమా?
Published Fri, Dec 5 2014 12:59 AM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM
Advertisement