స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట
-
లెజిస్లేటివ్ కమిటీ చైర్‌పర్సన్ అజ్మీరా రేఖానాయక్
-
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
హన్మకొండ అర్బన్ : స్త్రీ శిశు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తోందని మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ విభాగం లెజిస్లేటివ్ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రేఖానాయక్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు మరిత పటిష్టం కావాల్సి ఉందన్నారు.
వాటికి సొంత భవనాలను అందుబాటులోకి తేవాలన్నారు. సిబ్బందికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయన్నారు. మౌలిక వసతుల లేమి నెలకొందన్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. ‘కలెక్టర్ కరుణ గారూ మా(ఆదిలాబాద్) జిల్లాకు రండి. మీ లాంటి అధికారులు ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది’ అని రేఖానాయక్ వ్యాఖ్యానించారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయన్నారు.
కాగా, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా మేడారం సమ్మక్క, సారలమ్మ, బతుకమ్మలు, బోనాలు, పౌష్టికాహారం, బాలికా సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మంగపేట ప్రాజెక్టు యువత చేసిన ఆదివాసీ నృత్యాలు అలరించాయి. కమిటీ సభ్యులు పురాణం సతీష్‌కుమార్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, రాంచంద్రారెడ్డి , ఐసీడీఎస్ జేడీ, డీడీ, పీడీ, పలువురు సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.