న్యూఢిల్లీ: చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ మహిళా ఎంపీలను కోరారు. బీజేపీకి చెందిన 30 మందికి పైగా మహిళా ఎంపీలతో శుక్రవారం ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రతి వారూ తమ నియోజకవర్గం పరిధిలోని చిన్నారుల ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారలోపం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి మహిళా ఎంపీ ఒక వ్యవస్థ వంటి వారని, ప్రజలతో సులభంగా మమేకం కాగలిగిన అద్భుత నైపుణ్యం మహిళల సొంతమన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానితో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ జరుపుతున్న వరుస భేటీల్లో ఇది ఐదోది. ఇప్పటి వరకు ఆయన ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, యువ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల ద్వారా ఉభయ సభలకు చెందిన పార్టీలోని అన్ని వర్గాల ఎంపీలు ప్రధానితో పరిచయం చేసుకోవడంతోపాటు నేరుగా వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment