సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఈ ఫోటోలో ఉన్న మూడేళ్ల బాలుడి బంధువుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. 2019 జూన్ 23న బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఈ బాలుడు (అప్పుడు 6 నెలల వయస్సు) కనిపించాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా, నిజామాబాద్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని (భిక్షాటన చేస్తున్న) మహిళ వద్ద నుంచి బాబును తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో బాలుడ్ని తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంచారు. బాబుకి సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరో ఇంత వరకు ఆచూకీ లభించలేదు.
ఈ కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు నిజామాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేశారు. ఇటీవల ఈ బాలుడ్ని నిజామాబాద్ శిశుగృహకు పంపించారు. ప్రస్తుతం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశుగృహలో బాబుకు వసతి కల్పించారు. ఆరు నెలల వయసున్న బాలుడికి మూడేళ్లు వచ్చినా కుటుంబ సభ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ బాబుకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులను సంప్రదించాలని ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ఝాన్సీలక్ష్మి తెలిపారు.
చదవండి: (నాలుగేళ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..)
Comments
Please login to add a commentAdd a comment