కంచికి చేరిన ‘అమ్మమ్మ’ కథలు | Children Play Video Games Smartphone Forgot Child Memories | Sakshi
Sakshi News home page

మాయమవుతున్న బాల్య జ్ఞాపకాలు

Published Fri, May 29 2020 12:05 PM | Last Updated on Fri, May 29 2020 12:05 PM

Children Play Video Games Smartphone Forgot Child Memories - Sakshi

మద్నూర్‌(జుక్కల్‌): బాల్యం ఒక మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య చెప్పే నీతి కథలు.. బోధనలు.. ఎన్నో ఆటపాటలు.. ఇలా బాల్యం సరదాగా గడిచేది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి.. మనిషి జీవన శైలి మారిపోయింది. మారుతున్న బిజీ కాలంలో అమ్మమ్మ, తాతయ్య చెప్పే నీతి కథలు.. కనుమరుగయ్యాయి. ఒకప్పుడు వేసవి సెలవుల్లో రాత్రివేళ అయిందంటే చాలు పిల్లలందరూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల వద్ద చేరేవారు. వారు చెప్పిన కథలను శ్రద్ధగా వినేవారు. పగటి సమయాల్లో చందమామ, పరమానందయ్య శిష్యుల కథలు వంటి పుస్తకాలు చదివేవారు. కానీ ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లలు నిత్యం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఉన్న కొద్ది సమయం కూడా కంప్యూటర్‌లు, వీడియోగేమ్‌లకు పరిమితమైపోతున్నారు. 

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు..
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏ ఇంట్లో చూసినా ఉమ్మడి కుటుంబాలు తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చిన్నాన్నలు, పిన్నిలు ఇలా పెద్ద కుటుంబాలు ఉండేవి. రాత్రి అయితే ఆ కుటుంబంలోని పిల్లలంతా తాతయ్య, నానమ్మ వద్దకు చేరేవారు. కంప్యూటర్, సెల్‌ఫోన్లు, టీవీలు లేని కాలంలో చిన్నారులంతా కథలు చెప్పమంటూ పెద్దవారి వద్ద మారాం చేసేవారు. వారు చేప్పే నీతి కథలను పిల్లలు ఎంతో ఇష్టంగా వినేవారు. ఈ కథల ప్రభావం చిన్నారులపై పడేది. ఆ కథల వల్ల స్నేహం గొప్పదనం, ఐక్యమత్యంతో సమస్యల సాధన, పొడుపు కథలతో ఆలోచన, జీవితానికి దారి చూపే సందేశాలు, నీతి, నిజాయితీ, దేశ భక్తి, పెద్దలు, గురువులపై గౌరవభావం కలిగేవి.

మాయమవుతున్న బాల్య జ్ఞాపకాలు

ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక జ్ఞాపకం. బాల్యంలో చేసే అల్లరి పనులు, ఆటపాటలు జీవితాంతం తమ వెంట ఉంటాయి. పట్టణాలకు చెందిన చిన్నారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సెలవులను సరదాగా గడుపుతారు. చిన్నారులు పలెల్లోని చేలగట్ల పైన, పంట బోదెలలోను, చెట్ల కొమ్మలపై ఆటలాడుకునే వారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, అష్టాచమ్మా, చార్‌పల్లి, పోలీస్‌ దొంగ వంటి ఆటల్లో పిల్లలు మునిగి తేలేవారు. దూరప్రాంతాల్లో ఉన్న తమ వారు తమ పిల్లలతో కలిసి సొంత ఊళ్లకు వచ్చి నిత్య జీవనానికి కాస్త దూరంగా ఉండి ఊరట చెందే పరిస్థితి ఉండేది.

తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు..
నేటితరం తల్లిదండ్రుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం పోటీపడే తాపత్రాయం తల్లిదండ్రుల ఆలోచనను మార్చింది. గజిబిజి జీవనం, తమ చిన్నారుల బ్రైట్‌ ఫ్యూచర్‌ పేరుతో వేసవిలో ఎవ్వరూ గడప దాటే ప్రయత్నం చేయడం లేదు. వేసవి సరదా, ఊరట పిల్లలకు లభించడం లేదు. సరదాగా గడవాల్సిన వేసవి సెలవులు కాస్తా ప్రత్యేక కోచింగ్‌లు, కంప్యూటర్‌ క్లాసుల పేరుతో ముగిపోతున్నాయి. చిన్నారులు ఇంట్లోనే ఉన్న వీడియో గేమ్, సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నారు. అవే వేసవిలో పిల్లల నేస్తాలుగా మారుతున్నాయి. కేవలం కొద్దిమంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆటా.. పాటా లేకుండా చదువే ప్రపంచంగా చదివే పిల్లలను సెలవుల్లో దూరంగా ఉంచితే క్రమేణ వారిలో ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే చిన్నారులకు అందమైన బాల్యం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

అప్పటి రోజులే వేరు..

అప్పట్లో మాకు పాఠశాల సెలువులు వచ్చాయంటే ఉబ్బిపోయేవాళ్లం. సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్యల ఊర్లకు వెళ్లాలని ముందే ప్లాన్‌ వేసుకునే వాళ్లం. అమ్మమ్మ ఊర్లో నూతన స్నేహితులతో పరిచయాలు అయ్యేవి. వారితో పొద్దంతా ఆడుకునే వాళ్లం. పొలం గట్లమీద స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆస్వాదించేటోళ్లం. ఇప్పుడెమో సెలవులు రాగానే పిల్లలకు స్పెషల్‌ క్లాసులు, కంప్యూటర్‌ ట్రైనింగ్‌లు గివ్వే నేర్పిస్తున్నారు. ఏమన్న అంటే నీకు తెలువది అంటారు. అప్పటి రోజులే వేరు. –శంకర్‌రావ్‌ పటేల్, అవాల్‌గావ్‌

సెల్‌ఫోన్‌లు పట్టుకునే కుర్చుంటున్నారు
విద్యార్థులు పాఠశాల నుంచి రాగానే అమ్మమ్మ, తాత య్య, నానమ్మలను పలకరించకుండానే సెల్‌ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. నానమ్మ, తాతయ్య అంటు అప్యాయంగా దగ్గరికి కూడా రావడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తల్లిదండ్రుల్లో వస్తున్న మార్పులకు పిల్లల్లో కూ డా ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రేమ లు, అనురాగాలు, సంబంధాలు అన్ని నేర్పించాలి. – ఈరయప్ప, కోడిచిర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement