శ్రీవారి సన్నిధిలో అమానవీయం!
►కల్యాణకట్ట రేకుల షెడ్డులో నెల బిడ్డను వదిలి వెళ్లిన కన్నవారు
►చైల్డ్ వెల్ఫేర్ విభాగానికి అప్పగించిన పోలీసులు
సాక్షి, తిరుమల: నెలకూడా నిండని పసిగుడ్డును కన్నవారు వదిలించుకున్నారు. తిరుమలలో గురువారం ఈ ఘటన జరిగింది. ఇక్కడి కల్యాణకట్ట ఎదురుగా రేకుల షెడ్డులో వస్త్రాల్లో చుట్టి వదిలివెళ్లిన ఓ పసిగుడ్డు ఏడుపు వినిపించింది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు ఆ మగబిడ్డను ఎత్తుకుని ఓదార్చాడు. కన్నవారి కోసం చుట్టూ గాలించినా ఆచూకీ కనిపించలేదు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో బిడ్డను అప్పగించారు. బిడ్డను మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐ తిమ్మప్ప అక్కున చేర్చుకుని బుడ్డీతో పాలు తాగించి ఆకలి తీర్చారు. తర్వాత డీఎస్పీ మునిరామయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించినా బిడ్డ కన్నవారి జాడ తెలియలేదు. బోసినవ్వులు చిందిస్తూ, కాళ్లూ చేతులు ఊపుతూ కనిపించిన ఆ బిడ్డను చూసిన డీఎస్పీ మునిరామయ్య చలించిపోయారు. పసికందులు ఇలా రోడ్డుపాలు కావటం అమానవీయమన్నారు. బిడ్డకు చెందిన కన్నవారు తప్పక తమను సంప్రదించి తీసుకెళ్లాలని కోరారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రసన్న హృదయంతో కనిపించిన ఆ పసిగుడ్డుకు ‘ప్రసన్న వెంకటేష్’గా నామకరణం చేశారు. తర్వాత బిడ్డను స్థానిక అశ్విని ఆస్పత్రిలో చికిత్సల అనంతరం చైల్డ్ వెల్ఫేర్ విభాగం సభ్యురాలు దేవయానికి అప్పగించారు.