కోడిపందేలకు సమాయత్తమవుతున్న పందెగాళ్లు
ఆ మూడురోజులూ జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్న నిర్వాహకులు
మరోపక్క హైకోర్టు ఆదేశాలు, ఎస్పీ వ్యాఖ్యలతో ఉత్కంఠ
జంగారెడ్డిగూడెం :కోడిపందేలు, జూదాలకు పోలీసులు ‘నై’ అంటున్నా పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్‌లో పండగకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు చేయడం, వాటిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తరువాత పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలివేయడం షరా మామూలైంది. ఈ నేపథ్యంలో పండగ మూడురోజులు కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయాత్తమవుతున్నారు. ఆ మూడు రోజులు ఎట్టిపరిస్థితుల్లోను కోడిపందేలు జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు బరులు సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, బైపాస్‌రోడ్డు జంక్షన్‌లో ఏటా భారీఎత్తున కోడిపందేలు నిర్వహిస్తారు. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో భారీగా కోడిపందేలు జరుగుతాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచే గాక పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పందెగాళ్లు వస్తుంటారు. భారీ, మధ్యతరహా, చిన్న స్థాయి పందేలకు వేరువేరుగా బరులు ఏర్పాటు చేస్తుంటారు.
ఆ మూడురోజులు జరుగుతాయని ధీమా
ఒకపక్క జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతం కాదు, ఇప్పుడు చూడండి అని కోడిపందేలపై వ్యాఖ్యానించడం, మరోపక్క హైకోర్టు కోడిపందేలు జరగకుండా నిరోధించమని ప్రభుత్వాన్ని ఆదేశించడం, ఈ ఏడాది కోడిపందాలు జరగడంపై సందిగ్ధత నెలకొందని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఏదిఏమైనా ఆ మూడు రోజులు జరిగి తీరుతాయని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పలుచోట్ల ఏర్పాట్లు
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చాలాచోట్ల ఒక మోస్తరు కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం,గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్ద ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చేసరికి లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో అన్న ఉత్కంఠ పందెగాళ్లలో ఉంది.
‘పుంజు’కున్న ఏర్పాట్లు
Published Fri, Jan 8 2016 12:29 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement