ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆటోవాలాలు
Published Sun, Sep 15 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చేసుకుని ఆటోవాలాలు, ప్రైవేటు వాహనాల నిర్వాహకులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సుమారు నెల రోజుల నుంచి డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికుల జేబులకు కత్తెరపడుతోంది. ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. దూరంతో సంబంధం లేకుండా రెండు, మూడు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర పనులపై ప్రయాణం తప్పనిసరైన వారికి చేతిచమురు వదులుతోంది. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది.
పోటీపడి వాహనాలను అతివేగంగా నడపడమే కాకుండా, వాహనాల్లో ప్రయాణికులను కూరుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.41 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముందు ఏలూరు వైపు నుంచి జంగారెడ్డిగూడెం వైపు ఆటోలు తిరిగేవి కావు. ఇప్పుడు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకూ ఆటోలు నడుపుతూ రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆటోవాలాలు రూ.60 వసూలు చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంవైపు నుంచి ఏలూరువైపు ఆటోలు రాకుండా ఏలూరుకు చెందిన ఆటోవాలాలు అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.11, తడికలపూడికి రూ.22 కాగా, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు రూ.25, రూ.45 వసూలు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేటకు బస్సు చార్జీ రూ.21 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి రూ.80 చెల్లించాల్సి వస్తోంది. లోకల్ చార్జీలు, పరిసర గ్రామాలకు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. గతంలో కనీసం చార్జి రూ.7కాగా, ఇప్పుడు రూ.15కు చేరింది. ప్రైవేట్ బస్సులు, స్టేజ్ క్యారియర్లు ప్రయాణికులను భారీగా దోచుకుంటున్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్‌కు హైటెక్ బస్సుకు రూ.340 కాగా, ప్రైవేట్ బస్సులకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రద్దీగా ఉన్న రో జుల్లో ఈ చార్జీ ఇంకా ఎక్కువగా ఉంటోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు వాహనదారుల ఇష్టారాజ్యంగా మారింది.
Advertisement
Advertisement