నిర్మల్ జిల్లాలో బోల్తాపడిన ఆదిలాబాద్ డిపో బస్సు(ఫైల్)
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టీసీలో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యానికి చేరుకోండి.. అనేది రాతలకే సరిపోతోంది. ఆచరణలో మాత్రం కానరావడం లేదని అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడంతో ప్రమాదాలు సంభవించడం, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఆర్టీసీ అధికారులు వారోత్సవాలు, ఇతర అవగాహన కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తుండడం చూస్తున్నాం. కానీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్న వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది అనడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మేలో మంచిర్యాల డిపో బస్సు ప్రమాదానికి గురికావడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో 14 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కానీ ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డారు. గతంలో నేరడిగొండ వద్ద జరిగిన ప్రమాదంలో కూడా పది మంది వరకు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జిల్లాలో సైతం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, భైంసా, నిర్మల్, మంచిర్యాలతో కలిపి ఆరు డిపోలు ఉన్నాయి. మొత్తం 625 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందినవి 442 బస్సులు ఉండగా, 183 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లా బస్సులు 2.50 లక్షల కిలోమీటర్ల మేరకు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. నెలలో 75లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతాయి.
ప్రయాణం పదిలమేనా..!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పదిలమేనా అనే అనుమానాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. 2017–18 సంవత్సరంలో 36 ప్రమాదాలు జరిగాయి. 14 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2018–19 సంవత్సరంలో ఆగస్టు మాసం వరకు 16 ప్రమాదాలు జరగగా 20 మంది మృత్యువాత పడ్డారు. మే 26న మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు రాజధాని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. 14 మంది ప్రయాణికులు చనిపోయిన విషయం విదితమే. కాగా ఆర్టీసీ అధికారులు గతేడాది 0.01 శాతం ప్రమాదాలు రేటుగా లెక్కించారు. ఈయేడాది ప్రమాదాల రేటు 0.08 ఉందని పేర్కొంటున్నారు. గతం కంటే ప్రస్తుతం ప్రమాదాల రేటు తగ్గిందని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదాల రేటును లక్ష కిలోమీటర్లకు ఎన్ని ప్రమాదాలు జరిగాయనే దానిపై లెక్కించనున్నట్లు తెలిపారు.
కాలం చెల్లినవే ఎక్కువ
ఆర్టీసీ బస్సులు చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఇందులో ప్రయాణాలు సాగించడం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్లడమేనని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాలపై నమ్మకం లేకనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది డ్రైవర్ల అలసత్వం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులకు సైతం ఫిట్‌నెస్ కల్పించడం, మద్యం సేవించి కొంతమంది డ్రైవర్లు విధులు నిర్వహించడం, ఓవర్ డ్యూటీలు చేయడం, తదితరవి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ప్రతిరోజు డ్రైవర్లను అధికారులు పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు నామ్‌కే వాస్తేగా నిర్వహించడం, సంవత్సరంలో ఒకటో రెండో కార్యక్రమాలను చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ దుస్థితి తలెత్తుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పని ఒత్తిడితో సతమతం
వందల కిలోమీటర్లు బస్సులు నడిపే డ్రైవర్ల పని ఒత్తిడి సైతం ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవచ్చు. రోజు విధులు నిర్వహిస్తుండడం, ఓవర్ డ్యూటీ పేరుతో కొంతమంది డ్రైవర్లు నిద్ర లేని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను పట్టించుకోకుండా బస్సు నడిపించే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఉండడం, మార్గమధ్యలో కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు మద్యం సేవిస్తుండడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది.
ప్రమాదాల రేటు తగ్గింది..
గతేడాది కంటే ఈసారి ప్రమాదాల రేటు తగ్గింది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ బస్సుల ఫిట్‌నెస్ పరిశీలించడం జరుగుతుంది. అద్దె బస్సుల ఫిట్‌నెస్‌ను ప్రతినెల పరిశీలిస్తాం. ఈ యేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 బస్సులను మార్చాం. ప్రతిరోజు డ్యూటీకి వచ్చే సమయంలో భద్రత సూక్తులను డ్రైవర్ల చేత చదివిస్తాం. 45 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు మెడికల్ చెకప్‌లు చేయిస్తాం. ప్రతి సంవత్సరం అవగాహన, శిక్షణ కార్యక్రమాలను డ్రైవర్లకు కల్పిస్తున్నాం. – రమేష్, డీవీఎం, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment