RTC BUSS
-
ఫిట్‌లెస్ బస్సులు..!
ఆదిలాబాద్‌టౌన్: ఆర్టీసీలో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యానికి చేరుకోండి.. అనేది రాతలకే సరిపోతోంది. ఆచరణలో మాత్రం కానరావడం లేదని అభిప్రాయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడంతో ప్రమాదాలు సంభవించడం, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఆర్టీసీ అధికారులు వారోత్సవాలు, ఇతర అవగాహన కార్యక్రమాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తుండడం చూస్తున్నాం. కానీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్న వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది అనడానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మేలో మంచిర్యాల డిపో బస్సు ప్రమాదానికి గురికావడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో 14 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కానీ ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డారు. గతంలో నేరడిగొండ వద్ద జరిగిన ప్రమాదంలో కూడా పది మంది వరకు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జిల్లాలో సైతం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, భైంసా, నిర్మల్, మంచిర్యాలతో కలిపి ఆరు డిపోలు ఉన్నాయి. మొత్తం 625 బస్సులు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందినవి 442 బస్సులు ఉండగా, 183 అద్దె బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లా బస్సులు 2.50 లక్షల కిలోమీటర్ల మేరకు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. నెలలో 75లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. ప్రయాణం పదిలమేనా..! ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పదిలమేనా అనే అనుమానాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. 2017–18 సంవత్సరంలో 36 ప్రమాదాలు జరిగాయి. 14 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2018–19 సంవత్సరంలో ఆగస్టు మాసం వరకు 16 ప్రమాదాలు జరగగా 20 మంది మృత్యువాత పడ్డారు. మే 26న మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు రాజధాని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. 14 మంది ప్రయాణికులు చనిపోయిన విషయం విదితమే. కాగా ఆర్టీసీ అధికారులు గతేడాది 0.01 శాతం ప్రమాదాలు రేటుగా లెక్కించారు. ఈయేడాది ప్రమాదాల రేటు 0.08 ఉందని పేర్కొంటున్నారు. గతం కంటే ప్రస్తుతం ప్రమాదాల రేటు తగ్గిందని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదాల రేటును లక్ష కిలోమీటర్లకు ఎన్ని ప్రమాదాలు జరిగాయనే దానిపై లెక్కించనున్నట్లు తెలిపారు. కాలం చెల్లినవే ఎక్కువ ఆర్టీసీ బస్సులు చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఇందులో ప్రయాణాలు సాగించడం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వెళ్లడమేనని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాలపై నమ్మకం లేకనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది డ్రైవర్ల అలసత్వం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులకు సైతం ఫిట్నెస్ కల్పించడం, మద్యం సేవించి కొంతమంది డ్రైవర్లు విధులు నిర్వహించడం, ఓవర్ డ్యూటీలు చేయడం, తదితరవి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతున్నాయి. ప్రతిరోజు డ్రైవర్లను అధికారులు పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు నామ్‌కే వాస్తేగా నిర్వహించడం, సంవత్సరంలో ఒకటో రెండో కార్యక్రమాలను చేపట్టి చేతులు దులుపుకోవడంతో ఈ దుస్థితి తలెత్తుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడితో సతమతం వందల కిలోమీటర్లు బస్సులు నడిపే డ్రైవర్ల పని ఒత్తిడి సైతం ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవచ్చు. రోజు విధులు నిర్వహిస్తుండడం, ఓవర్ డ్యూటీ పేరుతో కొంతమంది డ్రైవర్లు నిద్ర లేని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను పట్టించుకోకుండా బస్సు నడిపించే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఉండడం, మార్గమధ్యలో కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు మద్యం సేవిస్తుండడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రమాదాల రేటు తగ్గింది.. గతేడాది కంటే ఈసారి ప్రమాదాల రేటు తగ్గింది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్ పరిశీలించడం జరుగుతుంది. అద్దె బస్సుల ఫిట్నెస్ను ప్రతినెల పరిశీలిస్తాం. ఈ యేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 బస్సులను మార్చాం. ప్రతిరోజు డ్యూటీకి వచ్చే సమయంలో భద్రత సూక్తులను డ్రైవర్ల చేత చదివిస్తాం. 45 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు మెడికల్ చెకప్‌లు చేయిస్తాం. ప్రతి సంవత్సరం అవగాహన, శిక్షణ కార్యక్రమాలను డ్రైవర్లకు కల్పిస్తున్నాం. – రమేష్, డీవీఎం, ఆదిలాబాద్ -
సభకు వెళ్లేదెలా!
సాక్షి, ఆదిలాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యం.. వారిని కొంగరకలాన్‌కు ఎలా తరలించాలన్నదే ఇప్పుడు సవాల్.. సెప్టెంబర్ 2న నిర్వహించే సభ ఎలా విజయవంతం చేయాలనేదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతల ముందున్న లక్ష్యం.. ఉమ్మడి జిల్లాలో మూడోంతుల ఆర్టీసీ బస్సులను ఇప్పటికే బుక్ చేసుకున్నా అందులో లక్ష్యంలో ఒక వంతును కూడా తరలించలేని పరిస్థితి. మరి మిగతా జనాన్ని అక్కడికి ఎలా చేర్చేది.. ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీ వాహనాలను వేలాదిగా సమకూర్చాల్సిన బాధ్యత. టీఆర్ఎస్ జిల్లా పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారమే ఆర్టీసీ బస్సులు పోనూ ఇంకా 2వేల బస్సులు, 5వేలు ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు అవసరం.. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనిపించిన వాహనాలను ఎంగేజ్ చేసేసుకుంటున్నారు. 415 ఆర్టీసీ బస్సులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 415 ఆర్టీసీ బస్సులను టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం బుక్ చేసుకున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రమే కొంగరకలాన్‌కు తరలనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు 627 ఉండగా, అందులో సుమారు మూడంతుల బస్సులు ఆ రోజున సభకు తరలనున్నాయి. ప్రధానంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లాంటి బస్సులు అటు వెళ్తుండడంతో ఆ రోజు సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులే అధికంగా తిరుగుతాయి. దీంతో సెప్టెంబర్ 2న ప్రయాణికులు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. కాగా, ఒక్కో బస్సులో 50 మంది చొప్పున బుకింగ్ చేసుకున్న బస్సుల్లో 20వేలకు పైగా జనం అక్కడికి వెళ్లనున్నారు. ఒక్కో బస్సుకు కిలోమీటర్‌కు రూ.43 చొప్పున చెల్లించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ సభకు వెళ్లేందుకు సుమారు 300 కిలోమీటర్ల దూరభారం పడుతుంది. అప్‌అండ్‌డౌన్ కలిసి 600 కిలోమీటర్ల చొప్పున ఆర్టీసీకి కిలోమీటర్‌కు చెల్లించే రుసుము లెక్క కట్టినా రూ.కోటి పైబడుతుంది. దీంతో ప్రగతి నివేదనకు టీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీసీకే రూ.కోటి చెల్లించే పరిస్థితి ఉండగా, మిగతా వాహనాల పరంగా చూస్తే సుమారు రూ.5 కోట్లకు పైబడే రవాణాకు వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ వాహనాల ఎంగేజ్.. ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ దిశగా ఉమ్మడి జిల్లాలో జన సమీకరణ విషయంలో దిశానిర్దేశం కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లోక భూమారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని జనసమీకరణ కోసం నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా పార్టీ అంచనా ప్రకారమే 2వేల బస్సులు, 5వేల ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు అవసరం కాగా, ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ రోజు కోసం వాహనాలను ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా రైలు మార్గం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా నియోజకవర్గాల్లో వాహనాలను సమకూర్చుకోవాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కారు అడ్డాపై సుమారు 200 వరకు ప్రైవేట్ ట్యాక్సీ వాహనాలు ఉండగా, ఇప్పటికే 150కి పైగా టీఆర్ఎస్ నేతలు బుకింగ్ చేసుకున్నారు. బోథ్ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రైవేట్ వాహనాలు అధికంగా లేకపోవడంతో ఆదిలాబాద్ నుంచే ఈ వాహనాలను మాట్లాడుకుంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో వారు సమీప పట్టణ ప్రాంతాల్లోని వాహనాలను బుకింగ్ చేసుకుంటున్నారు. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటం, మళ్లీ వాహనాలు దొరుకుతాయో లేవోనన్న ఆందోళనలో వారు కొంత ఎక్కువమొత్తం ఇచ్చి కూడా వాహనాలను బుకింగ్ చేసుకుంటుండడంతో ప్రైవేట్ వాహన యజమానులకు కొంగరకలాన్ కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ఖర్చు మోపెడు.. ప్రగతి నివేదన సభకు కార్యకర్తలను తరలించే విషయంలో రవాణా ఖర్చు ఒక ఎత్తు కాగా, ఇప్పుడు వారికి టిఫిన్, భోజనాలు, ఛాయ్, పానీ ఖర్చులు మోపెడయ్యే పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయమే వాహనాలు బయల్దేరుతాయి. ఈ భారాన్ని ఎమ్మెల్యేల భుజాననే వేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో నియోజకవర్గం వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి 10వేల మందిని పెట్టుకున్నా సుమారుగా రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఏదేమైనా కొంగరకలాన్ టెన్షన్ ఇప్పుడు నేతల మదితొలుస్తోంది. సమన్వయం చేస్తున్నాం హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గం వారీగా నేతలను సమన్వయం చేసి నియోజకవర్గం నుంచి పది వేలకు తగ్గకుండా ప్రజలను తరలించనున్నాం. – లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు -
ఏ తల్లి కన్నబిడ్డో...
పేగు బంధం తెంచుకుంది. అమ్మ ప్రేమ...నాన్న ఆప్యాయతకు దూరమైంది. అమ్మ లాలన, నాన్న మురిపెం కరువైంది. అమ్మానాన్న ప్రేమాభిమానులతో ఆనందంగా ఉండాల్సిన ఆ శిశువు చివరకు అనాథగా మారింది. ఆడపిల్ల అని భారమనుకున్నారో...ఏమో... తెలియదుగాని ఓ ఆడ శిశువును ఆర్టీసీ బస్సులో వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఫోర్ట్: విశాఖపట్నం నుంచి రాజాం వెళ్లే ఏపీ35 డబ్ల్యూ 9007నెంబరు బస్సులో హనుమంతవాక వద్ద ఓ వ్యక్తి సీఎంఆర్ బ్యాగ్ పట్టుకుని మంగళవారం ఎక్కాడు. అయితే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చే లోపల మార్గమధ్యలో శిశువు ఉన్న బ్యాగ్‌ను బస్సులో వదిలి దిగిపోయాడు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బస్సు ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చేసరికి బస్సులో ప్రయాణికులంతా దిగిపోయారు. బస్సులో చిన్నగా అరుపు వినిపించింది. అరుపు ఎక్కడ నుంచి వస్తుందని బస్సు డ్రైవర్ రఘునా«ధ్, కండక్టర్ డి.అప్పారావు బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఆడశిశువు ఉంది. డ్రైవర్ రఘునాధ్ శిశువును ఆర్టీసీ కాంప్లెక్సులో ఉంటే ఇన్ఫెక్షన్ సోకుతుందని జమ్ము గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడ శిశువుకు సపర్యలు చేసిన తర్వాత డిపో మేనేజర్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్‌కు శిశువును అప్పగించారు. మేనేజర్ ఈ విషయాన్ని ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉన్న హెల్ప్ డెస్క్ పోలీసులకు తెలపగా వారు చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నెంబరు 1098 ఫోన్ చేయాలని చెప్పారు. వెంటనే మేనేజర్ చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్‌లైన్ సభ్యులు, శిశు గృహా సిబ్బంది, డీసీపీయూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిశువుకు సపర్యలు చేశారు. డిపో మేనేజర్ నుంచి శిశువును తీసుకుని చికిత్స నిమత్తం ఘోషాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శిశువు ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ శిశువుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు బంగారుబాబు, వరలక్ష్మి, మధుబాబు, లక్ష్మి, శిశుగృహా సోషల్ వర్కర్ శ్రీధర్, డీసీపీయూ సిబ్బంది స్వామినాయుడు పాల్గొన్నారు. కావాలనే వదిలేసారా.. ఆడ శిశువును బస్సులో వదిలేయడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే వదిలేసారా, లేదంటే ఆడపిల్ల అని వదిలేసారా అనే అనుమానాలు రేకెతుత్తున్నాయి. వదిలించుకోవడానికి విశాఖలో పుట్టిన శివువును విజయనగరం వరకు వచ్చి వదిలేసారనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఐదు రోజులు వయస్సు ఉంటుంది: బస్సులో వదిలేసిన శిశువుకు ఐదు రోజుల వయస్సు ఉంటుంది. శిశువుకు అవసరమైన అన్ని సపర్యలు చేశాం. శిశువు బస్సులో దొరికిందని తెలిసిన వెంటనే ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చేశాం. శిశువుకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపిన తరువాత శిశుగృహాలో చేర్పిస్తాం. –జి.కె.దుర్గ, చైల్డ్‌లైన్ 1098 సంస్థ కౌన్సిలర్ -
ఆగిన సమ్మె కదిలిన చక్రం
విధులకు హాజరైన ఉద్యోగులు డిపోల ఎదుట విజయోత్సవాలు జిల్లాలో రూ.కోటీ 84లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ విజయనగరం అర్బన్: ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. వేతన ఫిట్మెంట్ డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. 43 శాతం ఫిట్మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను విరమించి బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అంతకు ముందు డిపోల వద్ద కార్మికులు సంబ రాలు చేసుకున్నారు. ఈ నెల 5వతేదీ అర్థరాత్రి ప్రారంభమైన సమ్మె ఎనిమిది రోజుల పాటు కొనసాగింది. సమ్మెవల్ల ప్రయాణికులు ఇక్కట్లకు గురికాగా, ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది. ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుని లాభపడ్డారు. నెక్ పరిధిలో రూ.4.6 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో రూ కోటీ 84 లక్షల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో డిపోల వారీగా విజయనగరంలో రూ.50 లక్షలు, సాలూరు రూ.35 లక్షలు, పార్వతీపురం రూ.64 లక్షలు, ఎస్.కోట డిపో పరిధిలో రూ.35లక్షల ఆదాయానికి గండిపడింది. సమ్మెకాలంలో ప్రత్యామ్నాయం పేరుతో ప్రభుత్వం చేపట్టని చర్యల వల్ల సంస్థకుగాని, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రయోజనం లభించలేదనే చెప్పాలి. ఎనిమిది రోజుల ఆదాయాల లెక్కలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నెక్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి సాధారణంగా రోజుకు సరాసరిగా రూ.85 లక్షల ఆదాయం వచ్చేది. ఈ లెక్కన ఎనిమిది రోజులకు నెక్ రీజియన్ (తొమ్మిది డిపోల) నుంచి రూ.6.4 కోట్ల రావాల్సి ఉంది. కాని కేవలం రూ.1.8 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్టు సమాచారం. అంటే దాదాపుగా రూ.నాలుగు కోట్ల 60 లక్షల మేర ఆదాయానికి గండి పడింది. నెక్ రీజియన్ పరిధిలో తిరిగిన 507 బస్సులలో 267 బస్సుల వరకు అద్దెబస్సులే ఉన్నాయి. అద్దెబస్సుల వసూళ్లన్నీ వారికే వర్తిస్తాయి, సంస్థకు పైసా కూడా చెల్లించక్కలేదు. దీంతో సంస్థ భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విజయం ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని కార్మికులు అభిప్రాయపడ్డారు. స్థానిక డిపో ప్రధాన గేటు వద్ద బుధవారం సాయంత్రం వారు సంబరాలు జరుపుకొన్నారు. కార్మిక ఐక్యతే గెలిచింది వేతన ఫిట్మెంట్ ప్రధాన డిమాండ్‌గా పెట్టుకొని చేపట్టిన సమ్మె విజయానికి కారణం కార్మిక ఐక్యతే. అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడితే కార్మిక సంక్షేమంతోపాటు సంస్థను కాపాడుకోవచ్చు. -కె.రాజ్‌కుమార్, ఎన్ఎంయూ నేత ఇది కార్మికుల విజయం సంస్థలోని కార్మిక, ఉద్యోగులంతా ఐక్యంగా ఏకతాటిగా నిలబడడం వల్లే సమ్మె విజయవంతమైంది. సమ్మెలో పాల్గొన్న వారందరికీ అభినందనలు. రానున్న రోజుల్లో ఇదే ఐక్యతతో ఉంటే మరిన్ని డిమాండ్లు సాధించుకోవచ్చు. సంస్థ వృద్ధికోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. -పి.భానుమూర్తి, ఎంప్లాయీస్ యూనియన్ నేత -
ప్రజా రవాణా హైరానా
నగర ప్రయాణం నరకం రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ప్రజల నిష్పత్తికి తగ్గట్టుగా లేని ప్రజా రవాణా లక్షల్లో పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలు వాహన కాలుష్యంతో సిటీ ఉక్కిరిబిక్కిరి వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు సాక్షి, సిటీబ్యూరో : పేరుకే మహానగరం... ప్రజా రవాణా తీరు చూస్తే అస్తవ్యస్తం.. అందుబాటులో ఉండని ఆర్టీసీ బస్సులు... చాలీచాలని ఎంఎంటీఎస్ రైళ్లు... ఏ బస్సు ఎప్పుడు వస్తుందో... ఏ రైలు ఎప్పుడు రద్దవుతుందో తెలీని దుస్థితి. సకాలంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ‘గ్రేటర్’లో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దశాబ్దాలు గడిచినా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకపోవడం వల్ల సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. ఫలితంగా ఏటా లక్షలాది ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డెక్కుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడే విషపూరితమైన రసాయనాల వల్ల ప్రజారోగ్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా విస్తరించని తీరుపై నగర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఈ విషయమై నిలదీయనుంది. కోటి జనాభాకు 3800 బస్సులు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. నగరవాసులతో పాటు, ఉపాధి, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. ఫలితంగా ఏటేటా జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర జనాభా కోటికి చేరువవుతున్నట్లు అంచనా. కానీ ఇందుకు తగిన విధంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా విస్తరించడం లేదు. ప్రస్తుతం 3800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 34 లక్షల మందికి మాత్రమే ఈ బస్సులు సరిపోతున్నాయి. దీంతో ఎక్కువ శాతం వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఆర్టీసీ అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు కనీసం ఐదువేల బస్సులు అవసరం. నగరంలో 50 లక్షల మందికి రవాణా సదుపాయాలను అందజేయగలిగితే రోడ్లపై వాహనాల రద్దీ 50 శాతానికి పైగా పరిష్కారమవుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. కాలనీలు విలవిల బస్సుల కొరత కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు వినియోగించుకొనేందుకు అవకాశం లేకపోవడం వల్ల నగరం చుట్టూ ఉన్న వందలాది కాలనీలు రవాణా సదుపాయాల కోసం విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఎల్బీనగర్ చుట్టూ సుమారు 700 కాలనీలు ఉన్నాయి. ఇంకా కొన్ని వందల సంఖ్యలో పల్లెలున్నాయి. ప్రతి నిత్యం లక్షలాది మంది నగరానికి రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎంఎంటీఎస్‌కు అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఫలితంగా రాత్రి 9 దాటితే కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, మన్సూరాబాద్, కర్మన్‌ఘాట్, చిన్న రావిరాల, పెద్ద రావిరాల, బండ రావిరాల, గౌరెల్లి, బాచారం,తదితర ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యంగా మారింది. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు. లక్షలాది మంది వలస ప్రజలు ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు. రాత్రి కాస్త ఆలస్యంగా ఇల్లు చేరుకోవడమంటే ఈ మార్గాల్లో ఎంతో కష్టం. అత్యధిక రద్దీ ఉండే జీడిమెట్ల నుంచి నేరుగా జగద్గిరిగుట్టకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేవంటే ప్రజా రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మచ్చబొల్లారం, అల్వాల్ డివిజన్లలోని సుమారు 150 కాలనీల ప్రజలు మల్కాజిగిరికి నేరుగా వెళ్లేందుకు బస్సులు లేవు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ నేరేడ్‌మెట్‌లోనే ఉండటంతో ఈ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. కాప్రా పరిధిలోని అంబేద్కర్ నగర్, సాయిబాబా నగర్, వంపుగూడ తదితర ప్రాంతాల్లో వెలసిన అనేక కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పలు కాలనీలు రవాణా సదుపాయాల కోసం అల్లాడుతున్నాయి. శేరిలింగంపల్లి పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, మయూరీ నగర్, బీకే ఎన్క్లేవ్, గోకుల్ ఫ్లాట్స్ వంటి ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి మీదుగా మెహిదీపట్నం మార్గంలో, లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి గౌలిదొడ్డి, నానక్‌రాంగూడ మీదుగా రాయదుర్గం మార్గంలో కోఠికి వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల ముప్పు నగరంలో ప్రజారవాణా సరిపోయినంతగా లేక వ్యక్తిగత వాహనాలు రోజురోజుకూ అధికమవు తున్నాయి. ఫలితంగా వీటి కాలుష్యం విప రీతంగా పెరుగుతోంది. పీల్చే గాలిలో దుమ్ము, ధూళి కణాల పరిమాణం బాగా పెరగడంతో న్యుమోనియా, ఆస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడటం) వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్ధంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడటంతో తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. అలర్జీతో బాధపడే వారి సంఖ్యా బాగా పెరిగిందని చెబుతున్నారు. వాహన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి గ్రేటర్లో కిక్కిరిసిన రహదారులపై వెల్లువెత్తుతోన్న వాయు కాలుష్యం సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దుమ్ము, ధూళికణాలు, విషవాయువులు నగరజీవుల ఆరోగ్యానికి పొగ బెడుతున్నాయి. పరిమితికి మించిన వాయుకాలుష్యంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థలు దారుణంగా దెబ్బతింటుండటంతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల నగరంలో శ్వాసకోశ వ్యాధులు పెరగడానికి వాహన కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటకు పదివేల నుంచి 20 వేల వాహనాలు దూసుకెళ్లే అత్యంత రద్దీ రూట్లలో పరిస్థితి మరింత విషమించింది. కాలంచెల్లిన వాహనాలు, సామర్థ్యం సరిగా లేనివి,పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేనివి, కల్తీ ఇంధనాలు వినియోగిస్తున్న మోటారు వాహనాలతో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్లో నిత్యం రోడ్డెక్కుతోన్న 39 లక్షల వాహనాలతో రహదారులు కిక్కిరిసి పోవడమే కాదు.. వాయుకాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు పీసీబీలు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 39 లక్షల వాహనాలు గ్రేటర్ గడిచిన ఐదేళ్ల కాలంలో విస్తరించింది. నగర శివార్లలో అనేక కొత్త కాలనీలు వెలిశాయి. పెరుగుతున్న కాలనీలకు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తమ శక్తి మేరకు ద్విచక్ర వాహనాలు, కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల కంటే అత్యధిక వాహనాలున్న గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 39 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 24 లక్షల వరకు ద్విచక్ర వాహనాలే. మరో 10 లక్షల కార్లు ఉన్నాయి. మిగతా ఐదు లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏటా 1.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చేనాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్న అంచనాలను తలకిందులు చేస్తూ ఏటేటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అడుగడుగునా ట్రాఫిక్ ర ద్దీ చోటుచేసుకుంటోంది. రెండు దశాబ్దాల క్రితం కేవలం కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాలకే పరిమితమైన వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం నగరమంతటా విస్తరించాయి. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి ఇటు ఎల్బీనగర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ ఒక వ్యాపార కూడలిగా మారిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. కానీ ఇందుకు తగినట్లుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడంతో ప్రతి రోజు నగరం ట్రాఫిక్ వలయంలో విలవిలాడుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల కూడా వాహనాల సంఖ్య ఇతోధికంగా పెరుగుతోంది. ఇపుడున్న 39 లక్షల వాహనాలు 2015 నాటికి 42 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు నగరానికి అన్ని వైపులా ప్రజా రవాణ సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. 2003లో మొదటి దశ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి,నాంపల్లి-లింగంపల్లి తదితర రూట్లలో రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 121 సర్వీసులు నడుస్తున్నాయి. రెండు ల క్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటున్నారు. మరో నాలుగు లక్షల మంది శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొత్త మార్గాలు, కొత్త రైళ్లు అందుబాటులోకి రావడం లేదు. పైగా ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల ఈ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ప్రయాణికుల ఆదరణ, డిమాండ్ ఉన్నప్పటికీ రైలు సదుపాయాలు పెరగడం లేదు. రెండో దశ అందుబాటులోకి వస్తే పటాన్చెరు నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఘట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వరకు, మేడ్చల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రజా రవాణా అభివృద్ధి చెందుతుంది. ఆటోలను ఆశ్రయించాల్సిందే నగరంలో నాలుగైదు ప్రధాన మార్గాల్లో మినహా ప్రయాణికులకు అవసరమైన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న బస్సులైనా కిటకిట లాడుతూ కాలు పెట్టే స్థలం కూడా ఉండటం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆటోలను ఆశ్రయించి అడిగినంత డబ్బు ఇచ్చుకోక తప్పని పరిస్థితి. - మోహన్, ప్రయాణికుడు సమయపాలనే లేదు ఒకే మార్గంలో ఒకేమారు నాలుగైదు బస్సులు వస్తున్నాయి. లేదంటే గంటన్నర వరకు ఆ మార్గంలో బస్సులు రావడమే లేదు. ఎక్కువ బస్సులు వచ్చిన సందర్భాల్లో ఖాళీగా వెళుతున్నాయి. ఆలస్యంగా వచ్చే బస్సుల్లో నిలబడడానికి కూడా వీలులేని పరిస్థితి. ఇవేం ప్రజాప్రతినిధులకు పట్టవు. - చిన్నారావు, ప్రయాణికుడు ఎంఎంటీఎస్‌లు మరీ ఆలస్యం ప్రతీ పదిహేను నిమిషాలకో ఎంఎంటీఎస్ అని బోర్డులు రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నా.. వాటి ఆలస్యం ఆర్టీసీ బస్సులను మించిపోతోంది. ఒక్కోమారు గంటన్నరకు మించి ఆలస్యంగా నడుస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. - వాసుదేవరావు, ప్రయాణికుడు మధ్యలో నిలిపేస్తున్నారు ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు. బయలుదేరి ఒకటి రెండు స్టేషన్లు దాటగానే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లైన్‌క్లియర్ చేయాలని వీటిని మార్గమధ్యంలోనే నిలిపేస్తున్నారు. ఇలా పదిహేను నిమిషాల నుంచి గంట వరకు అక్కడే నిలిపివేస్తుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. - ఆనంద్, ప్రయాణికుడు -
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
నిజామాబాద్ నాగారం,న్యూస్‌లైన్: సంక్రాంతి వస్తోంది... సెలవులు వస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏరూట్లో అధికంగా ప్రయాణికులు ప్రయణిస్తున్నారో.. ఆ రూట్లలో అదనంగా బస్సులను నడపడానికి చర్యలు చేపట్టింది. జిల్లానుంచి దూర ప్రాంతాలకు బస్సులను కేటాయిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు సంక్రాం తి సెలవులు రావడంతో వారి సౌకర్యార్థం బస్సులను అదనంగా ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. జిల్లాకు అదనంగా 190 బస్సులు.. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆదాయం వచ్చే జిల్లా రూట్లలో ఆర్టీసీ యాజమాన్యం అదనంగా 190 బ స్సులను కేటాయించింది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, గుంటూరు, ఆర్మూర్ తదితర ప్రాం తాలకు ఎక్కువ మొత్తంలో బస్సులను కేటాయించింది ఆర్టీసీ. అవసరమైతే మరిన్ని బస్సులను కూడా ప్రయాణికుల కోసం కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజ ర్ కృష్టకాంత్ తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని జనవరి 9 నుంచి 15వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని న్యూస్‌లైన్‌కు ఆయన వివరించారు. ప్రస్తుతం తెల్లవారుజామున ఇంద్ర, గరుడ బస్సులు నడపడం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఈ ట్రిప్పులను సైతం నడిపేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు.ప్రయాణికుల సంఖ్య ఆధారం గా అప్పటికప్పుడు తరలించేందుకు 10 బస్సులను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్‌లో, నిజామాబాద్ బస్టాండ్‌లో రద్దీని పరిశీలించి నిర్ణయాలు తీసుకునేలా ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎం చెప్పారు. -
ఊరెళ్లే దారేది..?
- సమైక్య సమ్మెతో రవాణా కష్టాలు - దసరా ప్రయాణాలపై తీవ్ర ప్రభావం - ఆర్టీసీ బస్సుల్లేక అవస్థలు - ప్రయివేటు బస్సుల దోపిడీ - విద్యుత్ సంక్షోభంతో తిరగని రైళ్లు - భారీగా రైలు రిజర్వేషన్ల రద్దు ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయివేటు బస్సుల చార్జీలు భగ్గుమంటున్నాయి. విద్యుత్ సంక్షోభంతో రైళ్లు ఆగిపోతున్నాయి. అరకొర నడిచినా కిటకిటలాడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఊరెలా వెళ్లాలి? బంధువుల్ని ఎలా కలుసుకోవాలి? దసరా పండగెలా జరుపుకోవాలి?... లక్షలాది నగర ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పండగ రోజుకల్లా ఊరు చేరే దారి కోసం వెతుకుతున్నారు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : దసరా సెలవులకు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు రెండు, మూడు నెలల ముందే రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్న వారు నాలుగైదు రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటే సరిపోతుందని ధీమాగా ఉన్నారు. ఇంతలో 70 రోజుల కిందట రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించడంతో అంతా తారుమారైంది. సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభమైంది. స్వల్ప వ్యవధిలో అత్యంత ఉధృత రూపం దాల్చింది. కనీవినీ ఎరగని రీతిలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయివేటు ఆపరేటర్ల పంట పడింది. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి విజయవాడకు రూ.250 వసూలు చేసే ప్రయివేట్ ఆపరేటర్లు ప్రస్తుతం రూ.500 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి తిరుపతికి రూ.1100 వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1500 వసూలు చేస్తున్నారు. కార్లు అద్దెకు తీసుకుని వెళ్దామన్నా ట్రావెల్స్ సంస్థలు కూడా అద్దెల్ని అమాంతం పెంచాయి. ఈ బాధలు పడలేక రైల్లో గమ్యస్థానాలు చేరుకోగలిగే అవకాశమున్న వారు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో నిరీక్షణ జాబితా చాంతాడంత అవుతోంది. ప్రయాణపు తేదీకి బెర్తు ఖరారవుతుందో, లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడు నెలల కిందటే దసరా సెలవుల్లో ప్రయాణాలు ఖరారు చేసుకుని టికెట్లు రిజర్వ్ చేయించుకున్న వారికి విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యం కావడం, విద్యుత్ సమస్య, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, అనేక రైళ్లు రద్దు కావడంతో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. మూడు రోజులుగా వేలాది మంది తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. జనరల్ బోగీల్లోనైనా ఊరు వెళ్లాలనుకున్న సామాన్యులు కిక్కిరిసిన రైళ్లను చూసి జడుసుకుంటున్నారు. ప్రయివేటు విమాన సంస్థలు సైతం ఈ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు తెగబడ్డాయి. విశాఖపట్నం నుంచి చెన్నైకి సాధారణ రోజుల్లో రూ.4000 వరకు టికెట్ చార్జీ వసూలు చేసే ప్రయివేట్ విమాన సంస్థలు అమాంతం రూ.6000 వరకూ పెంచేశాయి. హెదరాబాద్ టికెట్ ధరను కూడా భారీగా పెంచాయి. ఈ కష్టాలు పడేకన్నా ఉన్నచోటే దసరా పండుగ జరుపుకొనేందుకు అత్యధిక శాతం ప్రజలు సిద్ధమవుతున్నారు. -
ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న ఆటోవాలాలు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చేసుకుని ఆటోవాలాలు, ప్రైవేటు వాహనాల నిర్వాహకులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సుమారు నెల రోజుల నుంచి డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికుల జేబులకు కత్తెరపడుతోంది. ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు చార్జీలను పెంచేశారు. దూరంతో సంబంధం లేకుండా రెండు, మూడు రెట్ల చార్జీలు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర పనులపై ప్రయాణం తప్పనిసరైన వారికి చేతిచమురు వదులుతోంది. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనదారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది. పోటీపడి వాహనాలను అతివేగంగా నడపడమే కాకుండా, వాహనాల్లో ప్రయాణికులను కూరుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు రూ.41 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు ముందు ఏలూరు వైపు నుంచి జంగారెడ్డిగూడెం వైపు ఆటోలు తిరిగేవి కావు. ఇప్పుడు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకూ ఆటోలు నడుపుతూ రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఆటోవాలాలు రూ.60 వసూలు చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంవైపు నుంచి ఏలూరువైపు ఆటోలు రాకుండా ఏలూరుకు చెందిన ఆటోవాలాలు అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కామవరపుకోట ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.11, తడికలపూడికి రూ.22 కాగా, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు రూ.25, రూ.45 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేటకు బస్సు చార్జీ రూ.21 కాగా, ఆటోవాలాలు రూ.60 నుంచి రూ.80 వసూలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి రూ.80 చెల్లించాల్సి వస్తోంది. లోకల్ చార్జీలు, పరిసర గ్రామాలకు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. గతంలో కనీసం చార్జి రూ.7కాగా, ఇప్పుడు రూ.15కు చేరింది. ప్రైవేట్ బస్సులు, స్టేజ్ క్యారియర్లు ప్రయాణికులను భారీగా దోచుకుంటున్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్‌కు హైటెక్ బస్సుకు రూ.340 కాగా, ప్రైవేట్ బస్సులకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రద్దీగా ఉన్న రో జుల్లో ఈ చార్జీ ఇంకా ఎక్కువగా ఉంటోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు వాహనదారుల ఇష్టారాజ్యంగా మారింది. -
నష్టాల బాటలో ఆర్టీసీ
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి. రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చాలా బస్సులు రద్దు తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.