ప్రజా రవాణా హైరానా | Public transport chafe | Sakshi
Sakshi News home page

ప్రజా రవాణా హైరానా

Published Mon, Mar 17 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

ప్రజా రవాణా హైరానా

ప్రజా రవాణా హైరానా

  • నగర ప్రయాణం నరకం
  •  రాత్రి వేళల్లో  ప్రయాణికులకు ఇబ్బందులు
  •   ప్రజల నిష్పత్తికి తగ్గట్టుగా  లేని ప్రజా రవాణా
  •   లక్షల్లో పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలు
  •   వాహన కాలుష్యంతో సిటీ ఉక్కిరిబిక్కిరి
  •   వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
  •  సాక్షి, సిటీబ్యూరో : పేరుకే మహానగరం... ప్రజా రవాణా తీరు చూస్తే అస్తవ్యస్తం.. అందుబాటులో ఉండని ఆర్టీసీ బస్సులు... చాలీచాలని ఎంఎంటీఎస్ రైళ్లు... ఏ బస్సు ఎప్పుడు వస్తుందో... ఏ రైలు ఎప్పుడు రద్దవుతుందో తెలీని దుస్థితి. సకాలంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ‘గ్రేటర్’లో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

    దశాబ్దాలు గడిచినా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకపోవడం వల్ల సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. ఫలితంగా ఏటా లక్షలాది ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డెక్కుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడే విషపూరితమైన రసాయనాల వల్ల ప్రజారోగ్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా విస్తరించని తీరుపై నగర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఈ విషయమై నిలదీయనుంది.
     
    కోటి జనాభాకు 3800 బస్సులు

     ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. నగరవాసులతో పాటు, ఉపాధి, ఉద్యోగాల  కోసం ఏటా లక్షలాది మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. ఫలితంగా ఏటేటా జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర జనాభా కోటికి చేరువవుతున్నట్లు అంచనా. కానీ ఇందుకు తగిన విధంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా విస్తరించడం లేదు. ప్రస్తుతం 3800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    34 లక్షల మందికి మాత్రమే ఈ బస్సులు సరిపోతున్నాయి. దీంతో ఎక్కువ శాతం వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఆర్టీసీ అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు కనీసం ఐదువేల బస్సులు అవసరం. నగరంలో 50 లక్షల మందికి రవాణా సదుపాయాలను అందజేయగలిగితే  రోడ్లపై వాహనాల రద్దీ 50 శాతానికి పైగా పరిష్కారమవుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు.
     
    కాలనీలు విలవిల
     
    బస్సుల కొరత కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు వినియోగించుకొనేందుకు అవకాశం లేకపోవడం వల్ల నగరం చుట్టూ ఉన్న వందలాది కాలనీలు రవాణా సదుపాయాల కోసం విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఎల్‌బీనగర్ చుట్టూ సుమారు 700 కాలనీలు ఉన్నాయి. ఇంకా కొన్ని వందల సంఖ్యలో పల్లెలున్నాయి. ప్రతి నిత్యం లక్షలాది మంది నగరానికి రాకపోకలు సాగిస్తారు.

    ఈ రూట్‌లో ఎంఎంటీఎస్‌కు అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఫలితంగా రాత్రి 9 దాటితే కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, మన్సూరాబాద్, కర్మన్‌ఘాట్, చిన్న రావిరాల, పెద్ద రావిరాల, బండ రావిరాల, గౌరెల్లి, బాచారం,తదితర ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యంగా మారింది. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు. లక్షలాది మంది వలస ప్రజలు ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు.

    రాత్రి కాస్త ఆలస్యంగా ఇల్లు చేరుకోవడమంటే ఈ మార్గాల్లో ఎంతో కష్టం. అత్యధిక రద్దీ ఉండే జీడిమెట్ల నుంచి నేరుగా జగద్గిరిగుట్టకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేవంటే ప్రజా రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మచ్చబొల్లారం, అల్వాల్ డివిజన్‌లలోని సుమారు 150 కాలనీల ప్రజలు మల్కాజిగిరికి నేరుగా వెళ్లేందుకు బస్సులు లేవు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ నేరేడ్‌మెట్‌లోనే ఉండటంతో ఈ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది.

    కాప్రా పరిధిలోని అంబేద్కర్ నగర్, సాయిబాబా నగర్, వంపుగూడ తదితర ప్రాంతాల్లో వెలసిన అనేక కాలనీలకు  బస్సు సౌకర్యం లేదు. ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పలు కాలనీలు రవాణా సదుపాయాల కోసం అల్లాడుతున్నాయి. శేరిలింగంపల్లి పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, మయూరీ నగర్, బీకే ఎన్‌క్లేవ్, గోకుల్ ఫ్లాట్స్ వంటి ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి మీదుగా మెహిదీపట్నం మార్గంలో, లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి గౌలిదొడ్డి, నానక్‌రాంగూడ మీదుగా రాయదుర్గం మార్గంలో కోఠికి వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  
     
    తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల ముప్పు
     
    నగరంలో ప్రజారవాణా సరిపోయినంతగా లేక వ్యక్తిగత వాహనాలు రోజురోజుకూ అధికమవు తున్నాయి. ఫలితంగా వీటి కాలుష్యం విప రీతంగా పెరుగుతోంది. పీల్చే గాలిలో దుమ్ము, ధూళి కణాల పరిమాణం బాగా పెరగడంతో న్యుమోనియా, ఆస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడటం) వంటి  వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్ధంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడటంతో తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. అలర్జీతో బాధపడే వారి సంఖ్యా బాగా పెరిగిందని చెబుతున్నారు.
     
    వాహన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి

    గ్రేటర్‌లో కిక్కిరిసిన రహదారులపై వెల్లువెత్తుతోన్న వాయు కాలుష్యం సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దుమ్ము, ధూళికణాలు, విషవాయువులు నగరజీవుల ఆరోగ్యానికి పొగ బెడుతున్నాయి. పరిమితికి మించిన వాయుకాలుష్యంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థలు దారుణంగా దెబ్బతింటుండటంతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు.

    ఇటీవల నగరంలో శ్వాసకోశ వ్యాధులు పెరగడానికి వాహన కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటకు పదివేల నుంచి 20 వేల వాహనాలు దూసుకెళ్లే అత్యంత రద్దీ రూట్లలో పరిస్థితి మరింత విషమించింది. కాలంచెల్లిన వాహనాలు, సామర్థ్యం సరిగా లేనివి,పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేనివి, కల్తీ ఇంధనాలు వినియోగిస్తున్న మోటారు వాహనాలతో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది.

    గ్రేటర్‌లో నిత్యం రోడ్డెక్కుతోన్న 39 లక్షల వాహనాలతో రహదారులు కిక్కిరిసి పోవడమే కాదు.. వాయుకాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు పీసీబీలు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    39 లక్షల వాహనాలు
     
    గ్రేటర్ గడిచిన ఐదేళ్ల కాలంలో విస్తరించింది. నగర శివార్లలో అనేక కొత్త కాలనీలు వెలిశాయి. పెరుగుతున్న కాలనీలకు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తమ శక్తి మేరకు ద్విచక్ర వాహనాలు, కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల కంటే అత్యధిక వాహనాలున్న గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 39 లక్షల వాహనాలు ఉన్నాయి.

    వీటిలో 24 లక్షల వరకు ద్విచక్ర వాహనాలే. మరో 10 లక్షల కార్లు ఉన్నాయి. మిగతా ఐదు లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏటా 1.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చేనాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్న అంచనాలను తలకిందులు చేస్తూ ఏటేటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అడుగడుగునా  ట్రాఫిక్ ర ద్దీ చోటుచేసుకుంటోంది.

    రెండు దశాబ్దాల క్రితం కేవలం కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాలకే పరిమితమైన వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం నగరమంతటా విస్తరించాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి ఇటు ఎల్‌బీనగర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ ఒక వ్యాపార కూడలిగా మారిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. కానీ ఇందుకు తగినట్లుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడంతో ప్రతి రోజు నగరం ట్రాఫిక్ వలయంలో విలవిలాడుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల కూడా వాహనాల సంఖ్య ఇతోధికంగా పెరుగుతోంది. ఇపుడున్న 39 లక్షల వాహనాలు 2015 నాటికి 42 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
     
    ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు

    నగరానికి అన్ని వైపులా ప్రజా రవాణ  సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. 2003లో మొదటి దశ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి,నాంపల్లి-లింగంపల్లి తదితర రూట్లలో రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 121 సర్వీసులు నడుస్తున్నాయి. రెండు ల క్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటున్నారు.

    మరో నాలుగు లక్షల మంది శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొత్త మార్గాలు, కొత్త రైళ్లు అందుబాటులోకి రావడం లేదు. పైగా ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేక లైన్‌లు లేకపోవడం వల్ల ఈ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.

    దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ప్రయాణికుల ఆదరణ, డిమాండ్ ఉన్నప్పటికీ రైలు సదుపాయాలు పెరగడం లేదు. రెండో దశ అందుబాటులోకి వస్తే పటాన్‌చెరు నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఘట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వరకు, మేడ్చల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రజా రవాణా అభివృద్ధి చెందుతుంది.
     
     ఆటోలను ఆశ్రయించాల్సిందే
     నగరంలో నాలుగైదు ప్రధాన మార్గాల్లో మినహా ప్రయాణికులకు అవసరమైన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న బస్సులైనా కిటకిట లాడుతూ కాలు పెట్టే స్థలం కూడా ఉండటం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆటోలను ఆశ్రయించి అడిగినంత డబ్బు ఇచ్చుకోక తప్పని పరిస్థితి.
     - మోహన్, ప్రయాణికుడు
     
     సమయపాలనే లేదు
     ఒకే మార్గంలో ఒకేమారు నాలుగైదు బస్సులు వస్తున్నాయి. లేదంటే గంటన్నర వరకు ఆ మార్గంలో బస్సులు రావడమే లేదు. ఎక్కువ బస్సులు వచ్చిన సందర్భాల్లో ఖాళీగా వెళుతున్నాయి. ఆలస్యంగా వచ్చే బస్సుల్లో నిలబడడానికి కూడా వీలులేని పరిస్థితి. ఇవేం ప్రజాప్రతినిధులకు పట్టవు.
     - చిన్నారావు, ప్రయాణికుడు
     
     ఎంఎంటీఎస్‌లు మరీ ఆలస్యం
     ప్రతీ పదిహేను నిమిషాలకో ఎంఎంటీఎస్ అని బోర్డులు రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేస్తున్నా.. వాటి ఆలస్యం ఆర్టీసీ బస్సులను మించిపోతోంది. ఒక్కోమారు గంటన్నరకు మించి ఆలస్యంగా నడుస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
    - వాసుదేవరావు, ప్రయాణికుడు
     
     మధ్యలో నిలిపేస్తున్నారు
     ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు. బయలుదేరి ఒకటి రెండు స్టేషన్లు దాటగానే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లైన్‌క్లియర్ చేయాలని వీటిని మార్గమధ్యంలోనే నిలిపేస్తున్నారు. ఇలా పదిహేను నిమిషాల నుంచి గంట వరకు అక్కడే నిలిపివేస్తుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.    
    - ఆనంద్, ప్రయాణికుడు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement