సభకు వెళ్లేదెలా! | September Two TRS Sabha In Adilabad | Sakshi
Sakshi News home page

సభకు వెళ్లేదెలా!

Published Tue, Aug 28 2018 11:36 AM | Last Updated on Tue, Aug 28 2018 11:36 AM

September Two TRS Sabha In Adilabad - Sakshi

ఆర్టీసీ బస్సులు

సాక్షి, ఆదిలాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యం.. వారిని కొంగరకలాన్‌కు ఎలా తరలించాలన్నదే ఇప్పుడు సవాల్‌.. సెప్టెంబర్‌ 2న నిర్వహించే సభ ఎలా విజయవంతం చేయాలనేదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల ముందున్న లక్ష్యం.. ఉమ్మడి జిల్లాలో మూడోంతుల ఆర్టీసీ బస్సులను ఇప్పటికే బుక్‌ చేసుకున్నా అందులో లక్ష్యంలో ఒక వంతును కూడా తరలించలేని పరిస్థితి. మరి మిగతా జనాన్ని అక్కడికి ఎలా చేర్చేది.. ప్రైవేట్‌ బస్సులు, ట్యాక్సీ వాహనాలను వేలాదిగా సమకూర్చాల్సిన బాధ్యత. టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారమే ఆర్టీసీ బస్సులు పోనూ ఇంకా 2వేల బస్సులు, 5వేలు ప్రైవేట్‌ ట్యాక్సీ వాహనాలు అవసరం.. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనిపించిన వాహనాలను ఎంగేజ్‌ చేసేసుకుంటున్నారు.
 
415 ఆర్టీసీ బస్సులు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 415 ఆర్టీసీ బస్సులను టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ కోసం బుక్‌ చేసుకున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే కొంగరకలాన్‌కు తరలనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు 627 ఉండగా, అందులో సుమారు మూడంతుల బస్సులు ఆ రోజున సభకు తరలనున్నాయి. ప్రధానంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ లాంటి బస్సులు అటు వెళ్తుండడంతో ఆ రోజు సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులే అధికంగా తిరుగుతాయి. దీంతో సెప్టెంబర్‌ 2న ప్రయాణికులు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

కాగా, ఒక్కో బస్సులో 50 మంది చొప్పున బుకింగ్‌ చేసుకున్న బస్సుల్లో 20వేలకు పైగా జనం అక్కడికి వెళ్లనున్నారు. ఒక్కో బస్సుకు కిలోమీటర్‌కు రూ.43 చొప్పున చెల్లించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ సభకు వెళ్లేందుకు సుమారు 300 కిలోమీటర్ల దూరభారం పడుతుంది. అప్‌అండ్‌డౌన్‌ కలిసి 600 కిలోమీటర్ల చొప్పున ఆర్టీసీకి కిలోమీటర్‌కు చెల్లించే రుసుము లెక్క కట్టినా రూ.కోటి పైబడుతుంది. దీంతో ప్రగతి నివేదనకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆర్టీసీకే రూ.కోటి చెల్లించే పరిస్థితి ఉండగా, మిగతా వాహనాల పరంగా చూస్తే సుమారు రూ.5 కోట్లకు పైబడే రవాణాకు వెచ్చించాల్సిన పరిస్థితి.
 
ప్రైవేట్‌ వాహనాల ఎంగేజ్‌..
ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ దిశగా ఉమ్మడి జిల్లాలో జన సమీకరణ విషయంలో దిశానిర్దేశం కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లోక భూమారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని జనసమీకరణ కోసం నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా పార్టీ అంచనా ప్రకారమే 2వేల బస్సులు, 5వేల ప్రైవేట్‌ ట్యాక్సీ వాహనాలు అవసరం కాగా, ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ రోజు కోసం వాహనాలను ఎంగేజ్‌ చేసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ ప్రాంతాల నుంచి ఎక్కువగా రైలు మార్గం ద్వారా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా నియోజకవర్గాల్లో వాహనాలను సమకూర్చుకోవాల్సిందే.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కారు అడ్డాపై సుమారు 200 వరకు ప్రైవేట్‌ ట్యాక్సీ వాహనాలు ఉండగా, ఇప్పటికే 150కి పైగా టీఆర్‌ఎస్‌ నేతలు బుకింగ్‌ చేసుకున్నారు. బోథ్‌ నియోజకవర్గంలోని మండలాల్లో ప్రైవేట్‌ వాహనాలు అధికంగా లేకపోవడంతో ఆదిలాబాద్‌ నుంచే ఈ వాహనాలను మాట్లాడుకుంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో వారు సమీప పట్టణ ప్రాంతాల్లోని వాహనాలను బుకింగ్‌ చేసుకుంటున్నారు. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటం, మళ్లీ వాహనాలు దొరుకుతాయో లేవోనన్న ఆందోళనలో వారు కొంత ఎక్కువమొత్తం ఇచ్చి కూడా వాహనాలను బుకింగ్‌ చేసుకుంటుండడంతో ప్రైవేట్‌ వాహన యజమానులకు కొంగరకలాన్‌ కలిసొచ్చేలా కనిపిస్తోంది.

ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ఖర్చు మోపెడు..
ప్రగతి నివేదన సభకు కార్యకర్తలను తరలించే విషయంలో రవాణా ఖర్చు ఒక ఎత్తు కాగా, ఇప్పుడు వారికి టిఫిన్, భోజనాలు, ఛాయ్, పానీ ఖర్చులు మోపెడయ్యే పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయమే వాహనాలు బయల్దేరుతాయి. ఈ భారాన్ని ఎమ్మెల్యేల భుజాననే వేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో నియోజకవర్గం వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి 10వేల మందిని పెట్టుకున్నా సుమారుగా రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఏదేమైనా కొంగరకలాన్‌ టెన్షన్‌ ఇప్పుడు నేతల మదితొలుస్తోంది.

సమన్వయం చేస్తున్నాం
హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నాం. పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గం వారీగా నేతలను సమన్వయం చేసి నియోజకవర్గం నుంచి పది వేలకు తగ్గకుండా ప్రజలను తరలించనున్నాం. – లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement