- సమైక్య సమ్మెతో రవాణా కష్టాలు
- దసరా ప్రయాణాలపై తీవ్ర ప్రభావం
- ఆర్టీసీ బస్సుల్లేక అవస్థలు
- ప్రయివేటు బస్సుల దోపిడీ
- విద్యుత్ సంక్షోభంతో తిరగని రైళ్లు
- భారీగా రైలు రిజర్వేషన్ల రద్దు
ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయివేటు బస్సుల చార్జీలు భగ్గుమంటున్నాయి. విద్యుత్ సంక్షోభంతో రైళ్లు ఆగిపోతున్నాయి. అరకొర నడిచినా కిటకిటలాడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఊరెలా వెళ్లాలి? బంధువుల్ని ఎలా కలుసుకోవాలి? దసరా పండగెలా జరుపుకోవాలి?... లక్షలాది నగర ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పండగ రోజుకల్లా ఊరు చేరే దారి కోసం వెతుకుతున్నారు.
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : దసరా సెలవులకు సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు రెండు, మూడు నెలల ముందే రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్న వారు నాలుగైదు రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకుంటే సరిపోతుందని ధీమాగా ఉన్నారు. ఇంతలో 70 రోజుల కిందట రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించడంతో అంతా తారుమారైంది. సీమాంధ్రలో ఉద్యమం ప్రారంభమైంది. స్వల్ప వ్యవధిలో అత్యంత ఉధృత రూపం దాల్చింది. కనీవినీ ఎరగని రీతిలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు.
ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి నుంచి సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడి ఆర్టీసీ బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయివేటు ఆపరేటర్ల పంట పడింది. సాధారణ రోజుల్లో విశాఖ నుంచి విజయవాడకు రూ.250 వసూలు చేసే ప్రయివేట్ ఆపరేటర్లు ప్రస్తుతం రూ.500 వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి తిరుపతికి రూ.1100 వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1500 వసూలు చేస్తున్నారు. కార్లు అద్దెకు తీసుకుని వెళ్దామన్నా ట్రావెల్స్ సంస్థలు కూడా అద్దెల్ని అమాంతం పెంచాయి.
ఈ బాధలు పడలేక రైల్లో గమ్యస్థానాలు చేరుకోగలిగే అవకాశమున్న వారు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో నిరీక్షణ జాబితా చాంతాడంత అవుతోంది. ప్రయాణపు తేదీకి బెర్తు ఖరారవుతుందో, లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడు నెలల కిందటే దసరా సెలవుల్లో ప్రయాణాలు ఖరారు చేసుకుని టికెట్లు రిజర్వ్ చేయించుకున్న వారికి విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యం కావడం, విద్యుత్ సమస్య, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, అనేక రైళ్లు రద్దు కావడంతో ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. మూడు రోజులుగా వేలాది మంది తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. జనరల్ బోగీల్లోనైనా ఊరు వెళ్లాలనుకున్న సామాన్యులు కిక్కిరిసిన రైళ్లను చూసి జడుసుకుంటున్నారు.
ప్రయివేటు విమాన సంస్థలు సైతం ఈ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు తెగబడ్డాయి. విశాఖపట్నం నుంచి చెన్నైకి సాధారణ రోజుల్లో రూ.4000 వరకు టికెట్ చార్జీ వసూలు చేసే ప్రయివేట్ విమాన సంస్థలు అమాంతం రూ.6000 వరకూ పెంచేశాయి. హెదరాబాద్ టికెట్ ధరను కూడా భారీగా పెంచాయి. ఈ కష్టాలు పడేకన్నా ఉన్నచోటే దసరా పండుగ జరుపుకొనేందుకు అత్యధిక శాతం ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఊరెళ్లే దారేది..?
Published Thu, Oct 10 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement