విధులకు హాజరైన ఉద్యోగులు
డిపోల ఎదుట విజయోత్సవాలు
జిల్లాలో రూ.కోటీ 84లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ
విజయనగరం అర్బన్: ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. వేతన ఫిట్‌మెంట్ డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను విరమించి బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అంతకు ముందు డిపోల వద్ద కార్మికులు సంబ రాలు చేసుకున్నారు. ఈ నెల 5వతేదీ అర్థరాత్రి ప్రారంభమైన సమ్మె ఎనిమిది రోజుల పాటు కొనసాగింది. సమ్మెవల్ల ప్రయాణికులు ఇక్కట్లకు గురికాగా, ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది. ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుని లాభపడ్డారు.
నెక్ పరిధిలో రూ.4.6 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో రూ కోటీ 84 లక్షల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో డిపోల వారీగా విజయనగరంలో రూ.50 లక్షలు, సాలూరు రూ.35 లక్షలు, పార్వతీపురం రూ.64 లక్షలు, ఎస్.కోట డిపో పరిధిలో రూ.35లక్షల ఆదాయానికి గండిపడింది. సమ్మెకాలంలో ప్రత్యామ్నాయం పేరుతో ప్రభుత్వం చేపట్టని చర్యల వల్ల సంస్థకుగాని, ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రయోజనం లభించలేదనే చెప్పాలి. ఎనిమిది రోజుల ఆదాయాల లెక్కలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నెక్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి సాధారణంగా రోజుకు సరాసరిగా రూ.85 లక్షల ఆదాయం వచ్చేది. ఈ లెక్కన ఎనిమిది రోజులకు నెక్ రీజియన్ (తొమ్మిది డిపోల) నుంచి రూ.6.4 కోట్ల రావాల్సి ఉంది. కాని కేవలం రూ.1.8 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్టు సమాచారం. అంటే దాదాపుగా రూ.నాలుగు కోట్ల 60 లక్షల మేర ఆదాయానికి గండి పడింది. నెక్ రీజియన్ పరిధిలో తిరిగిన 507 బస్సులలో 267 బస్సుల వరకు అద్దెబస్సులే ఉన్నాయి. అద్దెబస్సుల వసూళ్లన్నీ వారికే వర్తిస్తాయి, సంస్థకు పైసా కూడా చెల్లించక్కలేదు. దీంతో సంస్థ భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. ఈ విజయం ఆర్టీసీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని కార్మికులు అభిప్రాయపడ్డారు. స్థానిక డిపో ప్రధాన గేటు వద్ద బుధవారం సాయంత్రం వారు సంబరాలు జరుపుకొన్నారు.
కార్మిక ఐక్యతే గెలిచింది
వేతన ఫిట్‌మెంట్ ప్రధాన డిమాండ్‌గా పెట్టుకొని చేపట్టిన సమ్మె విజయానికి కారణం కార్మిక ఐక్యతే. అన్ని సంఘాలు ఐక్యంగా పోరాడితే కార్మిక సంక్షేమంతోపాటు సంస్థను కాపాడుకోవచ్చు.
-కె.రాజ్‌కుమార్, ఎన్‌ఎంయూ నేత
ఇది కార్మికుల విజయం
సంస్థలోని కార్మిక, ఉద్యోగులంతా ఐక్యంగా ఏకతాటిగా నిలబడడం వల్లే సమ్మె విజయవంతమైంది. సమ్మెలో పాల్గొన్న వారందరికీ అభినందనలు. రానున్న రోజుల్లో ఇదే ఐక్యతతో ఉంటే మరిన్ని డిమాండ్‌లు సాధించుకోవచ్చు. సంస్థ వృద్ధికోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.
-పి.భానుమూర్తి, ఎంప్లాయీస్ యూనియన్ నేత
ఆగిన సమ్మె కదిలిన చక్రం
Published Thu, May 14 2015 12:18 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement