పేగు బంధం తెంచుకుంది. అమ్మ ప్రేమ...నాన్న ఆప్యాయతకు దూరమైంది. అమ్మ లాలన, నాన్న మురిపెం కరువైంది. అమ్మానాన్న ప్రేమాభిమానులతో ఆనందంగా ఉండాల్సిన ఆ శిశువు చివరకు అనాథగా మారింది. ఆడపిల్ల అని భారమనుకున్నారో...ఏమో... తెలియదుగాని ఓ ఆడ శిశువును ఆర్టీసీ బస్సులో వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం ఫోర్ట్: విశాఖపట్నం నుంచి రాజాం వెళ్లే ఏపీ35 డబ్ల్యూ 9007నెంబరు బస్సులో హనుమంతవాక వద్ద ఓ వ్యక్తి సీఎంఆర్ బ్యాగ్ పట్టుకుని మంగళవారం ఎక్కాడు. అయితే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చే లోపల మార్గమధ్యలో శిశువు ఉన్న బ్యాగ్‌ను బస్సులో వదిలి దిగిపోయాడు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బస్సు ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చేసరికి బస్సులో ప్రయాణికులంతా దిగిపోయారు. బస్సులో చిన్నగా అరుపు వినిపించింది. అరుపు ఎక్కడ నుంచి వస్తుందని బస్సు డ్రైవర్ రఘునా«ధ్, కండక్టర్ డి.అప్పారావు బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఆడశిశువు ఉంది. డ్రైవర్ రఘునాధ్ శిశువును ఆర్టీసీ కాంప్లెక్సులో ఉంటే ఇన్‌ఫెక్షన్ సోకుతుందని జమ్ము గ్రామానికి తీసుకువెళ్లాడు.
అక్కడ శిశువుకు సపర్యలు చేసిన తర్వాత డిపో మేనేజర్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్‌కు శిశువును అప్పగించారు. మేనేజర్ ఈ విషయాన్ని ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉన్న హెల్ప్ డెస్క్ పోలీసులకు తెలపగా వారు చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నెంబరు 1098 ఫోన్ చేయాలని చెప్పారు. వెంటనే మేనేజర్ చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్‌లైన్ సభ్యులు, శిశు గృహా సిబ్బంది, డీసీపీయూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిశువుకు సపర్యలు చేశారు. డిపో మేనేజర్ నుంచి శిశువును తీసుకుని చికిత్స నిమత్తం ఘోషాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శిశువు ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ శిశువుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు బంగారుబాబు, వరలక్ష్మి, మధుబాబు, లక్ష్మి, శిశుగృహా సోషల్ వర్కర్ శ్రీధర్, డీసీపీయూ సిబ్బంది స్వామినాయుడు పాల్గొన్నారు.
కావాలనే వదిలేసారా..
ఆడ శిశువును బస్సులో వదిలేయడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే వదిలేసారా, లేదంటే ఆడపిల్ల అని వదిలేసారా అనే అనుమానాలు రేకెతుత్తున్నాయి. వదిలించుకోవడానికి విశాఖలో పుట్టిన శివువును విజయనగరం వరకు వచ్చి వదిలేసారనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది.
ఐదు రోజులు వయస్సు ఉంటుంది:
బస్సులో వదిలేసిన శిశువుకు ఐదు రోజుల వయస్సు ఉంటుంది. శిశువుకు అవసరమైన అన్ని సపర్యలు చేశాం. శిశువు బస్సులో దొరికిందని తెలిసిన వెంటనే ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చేశాం. శిశువుకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపిన తరువాత శిశుగృహాలో చేర్పిస్తాం.
–జి.కె.దుర్గ, చైల్డ్‌లైన్ 1098 సంస్థ కౌన్సిలర్
Comments
Please login to add a commentAdd a comment