female infant
-
పసిగుడ్డును పారేశారు..
జిన్నారం (పటాన్చెరు): కారణమేమోగానీ అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డు అనాథలా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ఏడుపు వినిపించడంతో దోమడుగు గ్రామ ప్రజలు దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారని గుర్తించారు. ముఖంపై రక్తం మరకలు ఇంకా తుడవక ముందే.. పేగు నుంచి కారుతున్న రక్తం ఆరకముందే గుడ్డలో చుట్టేసిన ఆడ శిశువు రోడ్డు పక్కన కనిపించడం స్థానికులను కలచివేసింది. ఈ విషయాన్ని పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ విజయకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌గౌడ్ అంగన్వాడీ, ఆశ వర్కర్లకు సమాచారమిచ్చారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్ఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ తల్లి కన్నబిడ్డో...
పేగు బంధం తెంచుకుంది. అమ్మ ప్రేమ...నాన్న ఆప్యాయతకు దూరమైంది. అమ్మ లాలన, నాన్న మురిపెం కరువైంది. అమ్మానాన్న ప్రేమాభిమానులతో ఆనందంగా ఉండాల్సిన ఆ శిశువు చివరకు అనాథగా మారింది. ఆడపిల్ల అని భారమనుకున్నారో...ఏమో... తెలియదుగాని ఓ ఆడ శిశువును ఆర్టీసీ బస్సులో వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఫోర్ట్: విశాఖపట్నం నుంచి రాజాం వెళ్లే ఏపీ35 డబ్ల్యూ 9007నెంబరు బస్సులో హనుమంతవాక వద్ద ఓ వ్యక్తి సీఎంఆర్ బ్యాగ్ పట్టుకుని మంగళవారం ఎక్కాడు. అయితే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చే లోపల మార్గమధ్యలో శిశువు ఉన్న బ్యాగ్‌ను బస్సులో వదిలి దిగిపోయాడు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బస్సు ఆర్టీసీ కాంప్లెక్సు వచ్చేసరికి బస్సులో ప్రయాణికులంతా దిగిపోయారు. బస్సులో చిన్నగా అరుపు వినిపించింది. అరుపు ఎక్కడ నుంచి వస్తుందని బస్సు డ్రైవర్ రఘునా«ధ్, కండక్టర్ డి.అప్పారావు బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఆడశిశువు ఉంది. డ్రైవర్ రఘునాధ్ శిశువును ఆర్టీసీ కాంప్లెక్సులో ఉంటే ఇన్ఫెక్షన్ సోకుతుందని జమ్ము గ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడ శిశువుకు సపర్యలు చేసిన తర్వాత డిపో మేనేజర్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్‌కు శిశువును అప్పగించారు. మేనేజర్ ఈ విషయాన్ని ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఉన్న హెల్ప్ డెస్క్ పోలీసులకు తెలపగా వారు చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నెంబరు 1098 ఫోన్ చేయాలని చెప్పారు. వెంటనే మేనేజర్ చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్‌లైన్ సభ్యులు, శిశు గృహా సిబ్బంది, డీసీపీయూ సిబ్బంది అక్కడకు చేరుకుని శిశువుకు సపర్యలు చేశారు. డిపో మేనేజర్ నుంచి శిశువును తీసుకుని చికిత్స నిమత్తం ఘోషాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శిశువు ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ శిశువుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు బంగారుబాబు, వరలక్ష్మి, మధుబాబు, లక్ష్మి, శిశుగృహా సోషల్ వర్కర్ శ్రీధర్, డీసీపీయూ సిబ్బంది స్వామినాయుడు పాల్గొన్నారు. కావాలనే వదిలేసారా.. ఆడ శిశువును బస్సులో వదిలేయడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే వదిలేసారా, లేదంటే ఆడపిల్ల అని వదిలేసారా అనే అనుమానాలు రేకెతుత్తున్నాయి. వదిలించుకోవడానికి విశాఖలో పుట్టిన శివువును విజయనగరం వరకు వచ్చి వదిలేసారనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఐదు రోజులు వయస్సు ఉంటుంది: బస్సులో వదిలేసిన శిశువుకు ఐదు రోజుల వయస్సు ఉంటుంది. శిశువుకు అవసరమైన అన్ని సపర్యలు చేశాం. శిశువు బస్సులో దొరికిందని తెలిసిన వెంటనే ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చేశాం. శిశువుకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపిన తరువాత శిశుగృహాలో చేర్పిస్తాం. –జి.కె.దుర్గ, చైల్డ్‌లైన్ 1098 సంస్థ కౌన్సిలర్ -
పెంటకుప్పలో ఆడశిశువు
♦ పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ♦ బంట్వారం మండలం తొర్మామిడిలో వెలుగు చూసిన ఘటన ♦ తాండూరు ఆస్పత్రికి తరలించిన అంగన్వాడీ సిబ్బంది బంట్వారం(వికారాబాద్): అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు పెంటకుప్ప పాలైంది. ఎవరో పాషాణ హృదయులు పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడిలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంత్రం 6 గంటలకు బహిర్భూమికి వెళ్లగా ఆమెకు ఓ చెత్తకుప్పలోంచి పసికందు రోదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే స్థానికులకు విషయం తెలిపింది. సమాచారం అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియమ్మ, లలత, స్వప్న, విజయలక్ష్మితదితరులు అక్కడికి చేరుకున్నారు. ముళ్లపొదలు, చెత్తకుప్పలో ఉన్న అప్పుడే పుట్టిన ఆడపిల్లను గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశివు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాప బరువు రెండు కేజీల కంటే తక్కువగా ఉన్నందున 10 రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. అనంతరం నగరంలోని శిశు విహార్‌కు తరలించనున్ననట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ జగదాంబ తెలిపారు. అయితే, గ్రామానికి చెందిన గుర్తుతెలియని మహిళ ఆడపిల్ల జన్మించడంతో పెంచుకోవడం ఇష్టం లేక చెత్తకుప్పలో పడేసి వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. లేదా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఆడపిల్ల పుడితే పీక నులిమేస్తున్నారు!
వరంగల్: ఆధునిక వ్యవస్థలో కూడా మహిళల పట్ల వివక్ష చూపడం పెరిగిపోతోంది. ప్రపంచం ఓ పక్క సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతోందో, మరో పక్క మనుషులు అంత దిగజారిపోతున్నారు. ఆడపిల్లల పట్ల అతిదారుణం ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల పుడితే చాలు అమ్మేస్తున్నారు. లేకపోతే పీక నులిమేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలోని నాజీ తండాలో ఇటువంటి దారుణమే జరిగింది. నాలుగు నెలల చిన్నారి పీక నులిమి చంపేశారు. అమ్మాయి పుట్టిందని నెలల ఆడపిల్లను నాయనమ్మ హత్య చేసింది. **