ముగ్గుర్ని చంపాడు.. సెల్ క్లూతో దొరికాడు | Three murder cases mystery Cell phone Clue Busted | Sakshi
Sakshi News home page

ముగ్గుర్ని చంపాడు.. సెల్ క్లూతో దొరికాడు

Published Mon, Sep 22 2014 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ముగ్గుర్ని చంపాడు.. సెల్ క్లూతో దొరికాడు - Sakshi

ముగ్గుర్ని చంపాడు.. సెల్ క్లూతో దొరికాడు

 జంగారెడ్డిగూడెం : జిల్లాలో సంచలనం రేకెత్తించిన మూడు హత్య కేసుల్లో మిస్టరీని ఒక్క క్లూతో జంగారెడ్డిగూడెం పోలీసులు ఛేదించారు. జంగారెడ్డిగూడెంలోని విష్ణు ప్లాజా అపార్ట్‌మెంట్‌లో వృద్ధుడు కర్పూరం కృష్ణమూర్తిని హత్య చేసి చోరీ చేసిన ఫోన్ ఐఎంఈఐ నంబర్‌పై పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. ఫోన్‌లో కృష్ణమూర్తి సిమ్‌ను తీసివేసి వేరే సిమ్‌లతో వాడుతున్నారని తెలుసుకుని పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తమశైలిలో విచారించగా, కృష్ణమూర్తి హత్యతో పాటు, కామవరపుకోటలో వాసా ఆంజనేయులు, జంగారెడ్డిగూడెం వడ్డీ వ్యాపారి నున్న వెంకట సుబ్బారావు హత్య కేసుల్లో వీరే నిందితులని వెల్లడైంది.
 
 హత్య కేసుల వివరాలను డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆదివారం జంగారెడ్డిగూడెంలోని తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఈ హత్యలకు ప్రధాన కారకుడు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి దారా నారాయణరావు అని తేలిందన్నారు. నిందితుడు నారాయణరావును అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో విచారణ చేశామని, ఈ మూడు హత్యలను చేశానని అంగీకరించాడన్నారు. అతనికి సహకరించిన కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన గాది సురేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన కొండాబత్తుల బ్రహ్మాజీలను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ చెప్పారు. అధిక వడ్డీలకు సొమ్ము తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక, ఒత్తిళ్లు ఎదుర్కొనడంతో భరించలేక హత్యలకు పూనుకున్నారని తెలిపారు.
 
 నిందితుల నుంచి సుమారు 50 కాసుల బంగారం, 664 గ్రాముల వెండి, మృతుడు కృష్ణమూర్తికి చెందిన రెండు సెల్‌ఫోన్‌లు, రూ.1,35,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాక హత్యకు ఉపయోగించిన సాంత్రో జింగ్ కారు, రెండు బైక్‌లు, టీవీఎస్ జూపిటర్ మోపెడ్, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు టార్చిలైట్లు, సుబ్బారావును హతమార్చేందుకు వాడిన ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.  అనతికాలంలోనే మూడు హత్యలను ఛేదించిన జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్, చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సైలు ఎ.శ్రీహరిరావు, గుర్రయ్య, అప్పారావులతో పాటు క్రైం సిబ్బంది రాజేంద్రప్రసాద్, హెచ్‌సీ దిలీప్, కిరణ్‌కుమార్, రాజశేఖర్, శంకర్, నారాయణరావు, హోంగార్డు ప్రసాద్, సాయి, రాజులను డీఎస్పీ అభినందించారు. త్వరలోనే వీరికి రివార్డులు అందజేస్తామన్నారు.
 
 హత్య చేసింది వీరినే..
 కామవరపుకోటకు చెందిన వాసా ఆంజనేయులు (80) అనే వృద్ధుడు ఈ ఏడాది మార్చి 8వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతనిది సాధారణ మరణమే అని తొలుత భావించారు. అయితే ఇంటితాళం పగులగొట్టి ఉండటం, ఇంటి బీరువాలో ఎక్కువమొత్తంలో బంగారం, డబ్బులు చోరీకి గురవడంతో తడికలపూడి ఎస్సై గుర్రయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 16న వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్యకేసుగా నిర్ధారించారు. అదేవిధంగా జంగాారెడ్డిగూడెం వడ్డీ వ్యాపారి నున్న వెంకటసుబ్బరావు (56) జూన్ 15న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మరుసటిరోజు అతని మృతదేహం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని రామచర్లగూడెం అడ్డరోడ్డు పంటబోదె పడి ఉంది.
 
 అప్పటి ఎస్సై అప్పారావు కేసు నమోదు చేయగా సీఐ అంబికాప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. అలాగే జూలై 24న రాత్రి జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలోని విష్ణుప్లాజా అపార్ట్‌మెంట్ ప్లాజాలో నివసిస్తున్న కర్పూరం కృష్ణమూర్తి (73) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై కె.శ్రీహరిరావు కేసు నమోదుచేయగా, అంబికా ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో కీలకమైన సమాచారంతో కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన గాది సురేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన కొండాబత్తుల బ్రహ్మాజీ అనే వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
 
 కీలకమైన ఐఎంఈఐ నంబర్
 రెండు హత్యలు చేసి ఆధారాలు దొరకకుండా తప్పించుకున్న తిరుగుతూ జంగారెడ్డిగూడెంలో విష్ణుప్లాజా అపార్ట్‌మెంట్‌లో వృద్ధుడి హత్య అనంతరం నిందితులు సెల్‌ఫోన్ దొంగిలించారు. కొంతకాలం తరువాత దానిలోని సిమ్‌లను తొలగించి వేరే సిమ్ లు వేసి ఉపయోగిస్తున్నారు. అప్పటికే సెల్‌ఫోన్‌లపై నిఘా పెట్టిన పోలీసులు, చోరీకి గురైన సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా దానిని వేరే వ్యక్తులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై సెల్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఒక హత్య అనుకున్న పోలీసులు గతంలో ఆధారాలు లభించని మరో రెండు హత్య కేసుల్లో కూడా ఆధారాలు లభించాయి. దీంతో అసలు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం.
 
 ఇలా హతమార్చారు..
 జంగారెడ్డిగూడెంకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్, రియల్‌ఎస్టేట్ వ్యాపారి దారా నారాయణరావుకు కామవరపుకోటకు చెందిన వాసా ఆంజనేయులు వరుసకు పెదనాన్న అవుతాడు. ఇతని వద్ద గతంలో నారాయణ తండ్రి హరినాథ్ రూ. 60 వేలు అప్పు చేశాడు. దీని నిమిత్తం 260 గజాలు తనఖా పెట్టాడు. అయితే అప్పు తీర్చినప్పటికీ వడ్డీ కోసం ఆంజనేయులు తండ్రిని బెదిరించడంతో నారాయణరావు మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతనిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఆంజనేయులు ఇంటికి వెళ్లి అతను ఒంటరిగా ఉన్నాడని గమనించి సురేష్ అనే వ్యక్తితో కలిసి చేతికి గ్లౌజులు తొడుక్కుని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బీరువాలో ఉన్న వెండి, బంగారం, నగదును దొంగిలించాడు.
 
 నున్న వెంకట సుబ్బారావు వద్ద నుంచి నారాయణరావు రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ నెలనెలా కడుతున్నా సుబ్బారావు మానసికంగా హింసించేవాడు. దీంతో సుబ్బారావునూ హత్యచేయాలని నిర్ణయించాడు. దీనిలో భాగంగా జూన్ 15న పెద్ద మొత్తంలో డబ్బు అందిందని, బాకీ చెల్లిస్తానని, ఎల్‌ఐసీ కార్యాలయానికి రావాలని సుబ్బారావుకు సురేష్ ద్వారా కబురుపంపాడు.  దీంతో సుబ్బారావు యాక్టివా వాహనంపై పాత ఎల్‌ఐసీ కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే తన కారులో రెండు రాడ్లు పెట్టుకుని నారాయణ వేచి చూస్తున్నాడు. సుబ్బారావు రాగా, డబ్బు ఇంకా అందలేదని, ఇంకొంత సమయం పడుతుందని అతనికి తెలిపాడు. ఈలోగా పిరమిడ్ దగ్గరలో వేసిన వెంచర్‌ను చూసొద్దాం అంటూ బయలుదేరుతుండగా, సురేష్ కూడా అక్కడకు చేరుకున్నాడు. ముగ్గురూ కారులో వెళుతుండగా, సుబ్బారావుతో గొడవపెట్టుకున్నారు.
 
 వెనుక సీట్లో కూర్చున సురేష్ సుబ్బారావు తలపై రాడ్డుతో కొట్టాడు. దీంతో అతను డోరు తీసుకుని వెళ్లిపోతుండగా నారాయణరావు అతని కాళ్లపై కొట్టి పడవేసి చాతిపై కూర్చుని తల, ముఖంపై రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం అతని నుంచి సెల్‌ఫోన్, ఉంగరాలు దొంగిలించారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి వేగవరం సమీపంలోని రామచర్లగూడెంలో ఎండిపోయిన బోదెలో పడవేశారు. అదే రోజు రాత్రి రాజమండ్రి వెళుతూ జంగారెడ్డిగూడెం బైనేరు వాగులో పర్సు, నగదు, ఉంగరం పడవేశారు. రాజమండ్రిలో లాడ్జి తీసుకుని, మరుసటి రోజు గోదావరిలో స్నానం చేసి అక్కడే బట్టలు పడవేసి, వాహనాన్ని సర్వీసింగ్ చేయించి జంగారెడ్డిగూడెం తిరిగొచ్చారు.
 
 అలాగే జంగారెడ్డిగూడెం రాజులకాలనీలోని విష్ణుప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న కర్పూరం కృష్ణమూర్తి నారాయణకు బంధువు. కృష్ణమూర్తి వద్ద ఎప్పుడూ నగదు, బంగారం ఉండటాన్ని గమనించాడు. నగదు కోసం అతనిని కూడా హతమార్చేందుకు పథకం వేశాడు. 23న హత్యకు పూనుకున్నప్పటికీ ఆ రోజు అపార్ట్‌మెంట్‌లో కుదరకపోవడంతో మరుసటిరోజు 24న నారాయణ, సురేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన కొండాబత్తుల అనే వ్యక్తిని బయట కాపలా ఉంచి, చేతికి గ్లౌజులు తొడుక్కొని నోరు, ముక్కు మూసి హత్యచేశారు. అనంతరం నగదు, బంగారం, సెల్‌పోన్లు, వెండి దొంగిలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement