పారదర్శకంగా మైనింగ్ లీజులు
జంగారెడ్డిగూడెం రూరల్ : రాష్ట్రంలో మైనింగ్ లీజులను పారదర్శకంగా కేటాయిస్తామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. నవంబర్ 1 నుంచి మైనింగ్ లీజులకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఇసుక రీచ్‌లు ప్రారంభించనున్నామని తెలిపారు. మైనింగ్ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ వస్తుందని, దీంతో ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇసుక రీచ్‌ల ద్వారా డ్వాక్రా మహిళలకు ఆదాయం చేకూరేలా అనుమతులు జారీ చేయనున్నట్టు తెలిపారు. జియోట్యాగింగ్, జీపీఎస్ సిస్టం ద్వారా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో వాటా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నారని, తమ రాష్ట్రానికి చెందినవన్నీ తమ రాష్ట్రానికే చెందుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మండల లక్ష్మణరావు, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కోఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
6 గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. రూ.95 లక్షలతో విద్యుదీకరణ పనులను చెపట్టినట్టు తెలిపారు. అన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఏలూరు జెడ్పీ అతిథి గృహంలో పలువురు గిరిజనులు మంత్రిని కలిసి ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆమె మాట్లాడుతూ తొలుత 6 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో జిల్లా ప్రజలు ముందున్నారన్నారు. దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, ఉత్తరాంధ్రకు పంపించారన్నారు.