జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలో ట్రాలీ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ పాఠశాల బస్సు రోడ్డు పక్కనున్న వాలులోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్ గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ పాఠశాల బస్సు 42 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం బుట్టాయగూడెం మండలం గంగవరం నుంచి స్కూలుకు బయలుదేరింది. పట్టెన్నపాలెం, శ్రీనివాసపురం మీదుగా స్థానిక రాష్ట్ర ప్రధాన రహదారిపైకి చేరుకుంది. గరుఢపక్షి నగర్‌లోకి మలుపు తిరుగుతుండగా.. కోదాడ నుంచి ఒరిస్సాకు సిమెంటు లోడుతో వెళుతున్న ట్రాలీ వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో పాఠశాల బస్సు రోడ్డుపక్కన ఉన్న లోతైన వాలులోకి దూసుకుపోయింది.
ఈ ఘటనలో గంగవరానికి చెందిన విద్యార్ధులు పి.దుర్గాప్రసాద్, పి.భావన, ఆర్.రేవతి, జి.సాయికుమార్, జి.హరిచందన, పట్టెన్నపాలెంకు చెందిన జి.వీరాంజనేయులు, బి.హర్షనందు, టి.భీష్మవెంకటసాయిచందు, టి.ఝాన్సీ, శ్రీనివాసపురానికి చెందిన ఎలికే ఈశ్వర శ్రీనాథ కిషోర్, పోల్నాటి తారక్, పోల్నాటి హైమావతి, పట్టణానికి చెందిన జి.నవదీప్, కె.భవ్యనాగార్షిత గాయపడ్డారు. బస్సు డ్రైవర్ దొండపాటి ఇజ్రాయేల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థుల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తనయుడు పోల్నాటి తారక్ ఉండడంతో ఆయన హుటాహుటిన కారులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారునితోపాటు మరికొందరు పిల్లలను కారులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కూడా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.భాస్కరరావు పర్యవేక్షణలో వైద్యులు విద్యార్థులకు చికిత్స చేశారు. ఆరుగురు విద్యార్థులకు ఓ మోస్తరుగా గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ ఇజ్రాయేల్ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏరియా ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద తరలివచ్చారు. దీంతో ఆస్పత్రి ఆవరణ రోదనలతో మిన్నంటింది. చికిత్స పూర్తయిన తర్వాత తమ పిల్లలను వారు ఇళ్లకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీని, దాని డ్రైవర్ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పలువురి పరామర్శ
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పలువురు పరామర్శించారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, పీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు, కరాటం రాంబాబు, వైఎస్సార్ సీపీ అధికారప్రతినిధి పోల్నాటి బాబ్జి, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తిరామ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పీపీఎన్ చంద్రరావు, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, డీవైఈవో తిరుమలదాసు, ఎంఈవో ఆర్.రంగయ్య , బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, సీపీఐ నాయకులు బూరుగుపల్లిసూరిబాబు, పాఠశాల కరస్పాండెంట్ పి.సతీష్ చంద్, ఆయా పాఠశాలల ప్రతినిధులు పరామర్శించారు.
పాఠశాల బస్సును ఢీకొన్న ట్రాలీ
Published Wed, Mar 2 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement