సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అడవుల్లో మావోయిస్టులు సంచరించినట్లు తెలుస్తోంది. 20 రోజుల క్రితం బోథ్ మండలంలోని కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం బోథ్ సీఐ నైలు నాయక్ ఆధ్వర్యంలో కైలాస్ టెకిడి అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ గుట్ట వద్ద గ్రెనేడ్ పడి ఉండడాన్ని పోలీసులు గమనించి వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో పోలీసులు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.
కైలాస్‌టెకిడి అటవీ ప్రాంతం
ఆగస్టులోనే వచ్చారా..?
కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ లభిచండంతో ఆ గ్రెనేడ్ నేలపై ఎన్ని రోజుల క్రితం పడిందని పోలీసులు లెక్కలేస్తున్నారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలోనే మావోల బ్యాగుల నుంచి ఇది నేల మీద పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చారా? లేక తిర్యాణి అడవుల్లో ఉన్నట్లు భావిస్తున్న అడెల్లు దళం వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అడెల్లు స్వస్థలం బోథ్ మండలంలోని పొచ్చర కావడంతో అతనే వచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జారి పడిందా? విడిచి వెళ్లారా?
అటవీ ప్రాంతంలో గ్రెనేడ్ మావోయిస్టుల బ్యాగులో నుండి జారి పడిందా? లేదా కావాలని విడిచి వెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దృష్టిని మరల్చడానికి విడిచివెళ్లారన్న వాదన వినిపిస్తున్నా పోలీసులు మాత్రం కచ్చితంగా మావోయిస్టుల వద్ద నుండే గ్రెనేడ్ కింద పడి ఉంటుందని పేర్కొంటున్నారు.
వివరాలు వెల్లడించని పోలీసులు
గ్రెనెడ్ లభ్యమైందని పోలీసులు అనధికారికంగా ధృవీకరించినా వివరాలు మాత్రం వెల్లడించలేదు. న్నతాధికారులే పూర్తి వివరాలు వెల్లడిస్తారని బోథ్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి గ్రెనేడ్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.
ప్రజాప్రతినిధులు అలర్ట్‌గా ఉండాలి
ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
బోథ్ అడవుల్లో గ్రెనేడ్ లభ్యం
బోథ్ మండలం నిగిని గ్రామ సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కైలాస్ టెకిడి అటవీ ప్రాంతంలో సీఐ నైలునాయక్ ఆధ్వర్యంలో గురువారం కూంబింగ్ నిర్వహిస్తుండగా భూమిపై పడి ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఉన్నతాధికారులకు పంపించారు. ఎలా వచ్చిందో విచారణ చేపడుతున్నారు. 15 నుంచి నెల రోజుల మధ్య అటవీ ప్రాతంలో పడి ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment